నీ బుర్రలోని చెత్తనంతా బయటపెట్టినవ్.. యూట్యూబర్ అల్హాబాదియాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

నీ బుర్రలోని చెత్తనంతా బయటపెట్టినవ్.. యూట్యూబర్ అల్హాబాదియాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
  • పాపులారిటీ ఉందికదా అని నోటికొచ్చిందల్లా మాట్లాడుడేందని ఫైర్
  • అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఆదేశం

న్యూఢిల్లీ: ఐజీఎల్ యూట్యూబ్ కామెడీ షో సందర్భంగా పేరెంట్స్ సెక్స్​పై వల్గర్ కామెంట్లు చేసిన యూట్యూబర్ రణ్​వీర్​ అల్హాబాదియాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ఉపయోగించిన పదాలు అక్కాచెల్లెళ్లు, తల్లిదండ్రులు, ఆడబిడ్డలతోపాటు యావత్ సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయని మండిపడింది. షో ద్వారా మీ బుర్రలో ఉన్న అసహ్యం కలిగించే, చెత్త మాటలన్నీ బయటపెట్టారని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. అంత చెత్తగా మాట్లాడేందుకు మీకేమైనా ప్రత్యేక లైసెన్స్ ఉందా అని ప్రశ్నించింది. పాపులారిటీ ఉందని నోటికొచ్చిందల్లా మాట్లాడుడేందని ఫైర్ అయింది.

‘అలాంటి భాషను ఎవరైనా ఇష్టపడతారా? ఇలాంటి వ్యక్తులకు కోర్టులు ఎందుకు రక్షణ కల్పించాలి’ అని ప్రశ్నించింది. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో సమాజ విలువలకు, నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడే లైసెన్స్ ఎవరికీ లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పర్మిషన్​ లేకుండా దేశం విడిచిపోవద్దు కమెడియన్ సమయ్ రైనా ఆధ్వర్యంలోని ఇండియాస్ గాట్ లేటెంట్(ఐజీఎల్) షో సందర్భంగా తల్లిదండ్రులనుద్దేశించి అల్హాబాదియా అనుచిత కామెంట్లు చేశారు.

ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తంకాగా, పలు రాష్ట్రాల్లో అతడిపై కేసులు నమోదయ్యాయి. వీటన్నింటినీ కలిపి ఒకేచోట విచారించాలని, తనను చంపేస్తామంటూ వస్తున్న బెదిరింపుల నుంచి రక్షణ కల్పించాలని అల్హాబాదియా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్​పై మంగళవారం విచారణ జరిపిన కోర్టు.. ఆయనకు పోలీస్ ప్రొటెక్షన్ మంజూరు చేస్తూనే తీవ్రస్థాయిలో మండిపడింది. చీప్ పబ్లిసిటీ కోసం అసహ్యంగా మీరు మాట్లాడినట్లే, పబ్లిసిటీ పెంచుకునేందుకు వాళ్లు మిమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారేమో అని కోర్టు కామెంట్ చేసింది. అశ్లీలత, అసభ్యతకు పారామీటర్లు ఏంటని రణ్​వీర్ తరఫు లాయర్​ను ప్రశ్నించింది. పర్మిషన్ లేకుండా దేశం విడిచిపోరాదని, పాస్​పోర్టును మహారాష్ట్రలోని థానె పోలీస్​స్టేషన్​లో సమర్పించాలని అల్హాబాదియాను ఆదేశించింది. 

నిందితుడిని అదుపులోకి తీసుకోవద్దని, ముంబై, గౌహతిలో నమోదైన కేసుల్లో అతడి కామెంట్లపై మరో కేసు ఫైల్ చేయొద్దని సుప్రీం కోర్టు పోలీసులను ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చేదాకా రణ్​వీర్​తో పాటు, అతని సహచరులు సమయ్ రైనా, ఆశిష్ చంచ్లానీ, జస్ర్పీత్ సింగ్, అపూర్వ మఖిజా తదితరులకు సంబంధించిన ఎపిసోడ్​లను కామెడీ షోలో పోస్ట్ చేయడానికి వీళ్లేదని చెప్పింది. మహారాష్ట్ర, అస్సాం తదితర ప్రాంతాల్లో నమోదైన కేసుల విచారణకు సహకరించాలని రణ్​వీర్​కు కోర్టు సూచించింది. కాగా, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి, ఐజీఎల్ కామెడీ షోలోని మొత్తం 18 ఎపిసోడ్‌‌‌‌‌‌‌‌లను తొలగించాలని మహారాష్ట్ర సైబర్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఇదివరకే కోర్టును కోరింది.