హైదరాబాద్ లో దారుణం జరిగింది. మలక్‌పేటలోని ప్రభుత్వ అంధ బాలికల వసతిగృహంలో చదువుతున్న బాలికపై బాత్రూంలు శుభ్రం చేసే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో బాలిక అస్వస్థతకు గురైంది. బాధిత బాలిక వికారాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తిగా తెలుస్తుంది. మలక్‌పేటలోని వసతిగృహంలో ఉంటూ అక్కడే చదువుకుంటోంది.
జూలై 7న ఉదయం బాలికకు రక్తస్రావం జరిగినట్లు కేర్ టేకర్ గుర్తించి తల్లిదండ్రులకు సమాచారమిచ్చింది. వెంటనే వారు వసతిగృహానికొచ్చి ఆరా తీశారు. నిర్వాహకులు సరిగ్గా స్పందించకపోవడంతో కూతురే తన పట్ల జరిగిన ఘోరాన్ని చెప్పింది. దీంతో బాధితులు మలక్‌పేట పోలీసులను ఆశ్రయించారు. ఆ స్టేషన్‌లో ఎవరూ వీరి గోడు పట్టించుకోకపోవడంతో బాధితులు సొంత ఊరుకు వెళ్లారు.
తల్లిదండ్రులు బాలికను ఇంటికి తీసుకెళ్లి దగ్గర్లోని ఆస్పత్రిలో చూపించారు. ఎంతకీ రక్తస్రావం ఆగకపోవడంతో హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు చిన్నారిపై అత్యాచారం జరిగిందని తల్లిదండ్రులకు చెప్పి, మలక్‌పేట పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రభుత్వ వైద్యులు చెప్పాక పోలీసులు జూలై 16న పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడైన స్కావెంజర్ నరేశ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.