దివ్యాంగుల చట్టాలను పక్కాగా అమలు చేయాలి

సమాజంలో  అత్యంత వివక్షకు, అపహాస్యాలకు, అవమానాలకు, అన్యాయాలకు, పీడనకు గరయ్యేవారు దివ్యాంగులే. వారికి సాంఘిక న్యాయం, ఆర్థికాభివృద్ధి, రాజకీయ చైతన్యం మానసిక వికాసం, ప్రగతి చెందడానికి తగిన విధానాల రూపకల్పన జరగడం లేదు. పేదరికం, నిరాక్ష్యరాస్యత, అజ్ఞానం, అనారోగ్యం నుంచి దివ్యాంగులకు విముక్తి దొరకడం లేదు. దివ్యాంగులకు వివిధ రకాల రక్షణ, అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల చట్టం – 1995 తెచ్చి అమలు చేస్తున్నాయి. అయినా దివ్యాంగుల జీవితాల్లో అనుకున్న స్థాయిలో వెలుగులు నిండటం లేదు. ఐక్యరాజ్యసమితి దివ్యాంగుల హక్కుల ఒప్పంద నిర్ణయాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం  వైకల్యం గల వ్యక్తుల చట్టం-–2016 ను అమల్లోకి తీసుకొచ్చింది. దీనికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018 మే 1 ఓ చట్టం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ చట్టం 21 వైకల్యాలను గుర్తించి విద్యలో 5 శాతం, ఉపాధి కల్పనలో 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించింది. ఈ చట్టం మీద అవగాహన కల్పించేందుకు ప్రచారం చేయాలని అందులోని పలు సెక్షన్లు చెబుతున్నా.. అలాంటి ప్రయత్నాలేమీ  జరగటం లేదు.    

దివ్యాంగుల పట్ల చులకన భావం..

కంచె చేను మేసిన చందంగా దివ్యాంగుల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వాధికారులే ఆ స్ఫూర్తికి తిలోదకాలు ఇస్తూ, ఉద్యోగ రిజర్వేషన్లు అమలు చేయకపోగా ఉద్యోగాలు చేస్తున్న దివ్యాంగుల పట్ల తోటి ఉద్యోగులు చులకనగా చూస్తూ సహకరించక పోవడం మూలంగా ఎంతో ఒత్తిడికి గురై పైస్థాయికి ఎదగలేకపోతున్నారు. చట్టంలోని సెక్షన్‌‌ ప్రకారం ప్రభుత్వ సంస్థల్లో మొత్తం ఉద్యోగాల్లో 4 శాతం దివ్యాంగులను భర్తీ చేయాలి. ఇంత వరకు ఉద్యోగ రిజర్వేషన్లలో జరిగిన అవకతవకలను గుర్తించి ప్రతి సంవత్సరం ప్రతి సంస్థల్లో బ్యాక్​లాక్‌‌ పోస్టులు నింపడానికి చర్యలు తీసుకోవడం లేదు. దివ్యాంగుల చట్టం 1995 ప్రకారం ప్రైవేట్‌‌ సెక్టార్‌‌లో కూడా 5 శాతం ఉద్యోగ రిజర్వేషన్‌‌ అమలు చేయాలని ఉన్నా, పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. చట్టం ప్రకారం, దివ్యాంగ ఉద్యోగులకు ప్రత్యేక ప్రకటన ద్వారా బీమా పథకాలను,  పునరావాస సేవలు, కార్యక్రమాలు, ఆరోగ్య, విద్య, ఉపాధి రంగాలకు సంబంధించిన కార్యక్రమాలు, దివ్యాంగుల సాంస్కృతిక వినోదం, నృత్యం, కళలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా చేయాలి.

2018 చట్టం అమలు ఏదీ?

ఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఐదేండ్ల గడువు లోపల అన్ని ప్రభుత్వ భవనాల్లోనూ దివ్యాంగులకు అనువైన, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సెక్షన్‌‌ 45  చెబుతున్నది. కానీ కొత్త భవనాలకు మొక్కుబడిగా ర్యాంపులు నిర్మిస్తున్నారు.  అవి దివ్యాంగులు వీల్ చైర్స్, ట్రై సైకిళ్లు వెళ్లడానికి వీలుగా ఉండటం లేదు. దివ్యాంగులు సమాజంలో అందరితో కలిసి జీవించే హక్కు, జీవనానికి అవసరమైన సేవలు, గృహవసతి, ఇతర కమ్యూనిటి సేవలు అందించాలని, క్రూరమైన, అమానుషమైన ప్రవర్తన నుంచి రక్షణ, హింస, అగౌరవం, దాడి చేయడం, అవమానపర్చడం, బెదిరించడం, ఆహారం ఇవ్వకపోవడం, దివ్యాంగ మహిళలను లైంగికంగా వేధించడం, సురక్షిత తాగునీరు, పారిశుధ్య సౌకర్యాలు కల్పించకపోవడం వంటివి నేరాల కిందకు వస్తాయి. సమాజంలో దివ్యాంగుల వైకల్యాన్ని  ఇంటి పేరుగా ‘కుంటోడు, గుడ్డోడు, కుష్టోడు, గూనోడు’ అని నీచంగా దూషించడం నిత్యకృత్యంగా  గోచరిస్తున్నది. ప్రతీ సారి వైకల్యాన్ని  ఎత్తి చూపడం మూలంగా దివ్యాంగులు సాధారణ వ్యక్తులతో కలవడానికే భయపడుతుంటారు. అంతేగాక సూటి పోటి మాటలతో మానసిక హింసకు గురిచేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో అందరితో కలివిడిగా ఉండలేక మానసిక ఒత్తిడికి గురువుతుంటారు. ఈ చట్టంలోని అంశాలను ఎవరు ఉల్లంఘించినా, రూ. 10 వేల నుంచి రూ. 5 లక్షల వరకు జరిమానా విధించాలని సెక్షన్‌‌89 చెబుతున్నది. కానీ చట్టంలో ఉన్న ఈ సెక్షన్లను అమలు చేసే వారు లేక, అవి కాగితాలకే పరిమితమవడం శోచనీయం.

వైకల్యం గల వ్యక్తిని కించపరిచినా, బహిరంగంగా ఉద్దేశపూర్వకంగా అవమానపరిచినా, అగౌరవపరిచే ఉద్దేశంతో దాడి, బలప్రయోగం చేయడం, వైకల్యం గల వ్యక్తిపై పెత్తనం చేయడం, అణచివేయడం, అభిప్రాయాలపై, భావాలపై దాడి చేయడం, దివ్యాంగులకు ఊతమిచ్చె పరికరాన్ని ధ్వంసం చేయడం, ఉద్దేశపూర్వకంగా ఆహారాన్ని, పానీయాలను ఇవ్వడానికి నిరాకరించడం, వైకల్యం ఉన్న మహిళలపై ఆధిపత్యాన్ని వినియోగించి లైంగిక దాడికి పాల్పడినా.. సెక్షన్‌‌92 ప్రకారం 6 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చని  చట్టం చెబుతున్నది. వీటిని అమలు చేయాల్సిన పోలీసు అధికారులకు అవగాహన లేక నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారు. పైగా ఎవరైనా దివ్యాంగులు పోలీసుస్టేషన్‌‌కు పోతే ముందు పోలీసులే వైకల్యం పేరుతో తిడుతున్న సందర్భాలు ఉంటున్నాయి.  సమాజంలో ఇలాంటి పద్ధతి మారాలంటే, దివ్యాంగులకు ఒక బలమైన చట్టం ఉందనే విషయం అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది.  ఇంటా, బయట ఈసడింపులను తట్టుకుని సమాజంలో అందరితో సమానంగా ఎదిగే పరిస్థితి కనుచూపు మెరలో కనిపించడంలేదు. ఎందుకో ఇతర దేశాల్లో మాదిరిగా మన సమాజంలో సానుకూల దృక్పథం ప్రజల్లోగానీ, మన ప్రజాస్వామ్య ప్రభుత్వాలకి గానీ రాకపోతుండటం ఒకింత ఆశ్చర్యకరంగా, విచాకరమైన విషయంగా మిగిలిపోతున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరిచి దివ్యాంగుల చట్టాలను కాగితాలకే పరిమితం చేయకుండా వారికి చట్టం ద్వారా వచ్చే రాయితీలను కల్పించి, అన్నిరకాల భద్రత, రక్షణ చర్యలు తీసుకోవడానికి అధికారులను సన్నద్ధం చేయాలి. 

విద్యా కోటా భర్తీ లేదు

ఒక వైపు భారత రాజ్యాంగం, మరో వైపు దివ్యాంగుల చట్టాల ప్రకారం 18 సంవత్సరాలు వచ్చే వరకు ఉచిత నిర్బంధ విద్య అందించాలని నిర్ణయించినప్పటికీ  కేటగిరీల వారీగా సరైన స్కూల్స్‌‌గానీ, వసతులుగానీ  కల్పించకుండా దివ్యాంగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సెక్షన్‌‌29 ప్రకారం ప్రభుత్వ విద్యా సంస్థల్లో, ప్రభుత్వం నుంచి నిధులు పొందే సంస్థల్లో 5 శాతం సీట్లు తప్పక కేటాయించాలని ఉన్నా.. ఉన్నత విద్యలో అన్ని కోర్సుల్లో అర్హులైన దివ్యాంగులు లేక ఆ సీట్లు ఓపెన్‌‌ కేటగిరీకి పోతున్నాయి. చాలా మంది వైకల్యం, పేదరికం మూలంగా  విద్యా సంస్థల్లో చేరకుండా బాధతో వెళ్లిపోతున్నారు. యూనివర్సిటీ క్యాంపస్‌‌లలో సీట్లు వస్తేనే చేరుతున్నారు. అది కూడా సైన్స్​ సబ్లెక్టుల్లో దివ్యాంగులు అసలే కనిపించడం లేదు. ఈ విధానంలో మార్పు రావాలి.

- డా. పెద్దమళ్ల శ్రీనివాసరావు,
అసోసియేట్ ప్రొఫెసర్,  కేయూ