పార్టీ ఇన్​చార్జ్​ల మీటింగ్​లకు రెబెల్ లీడర్ల డుమ్మా  

నల్గొండ/ చౌటుప్పల్, వెలుగు:  మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి సెగ కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ఈ నెల 20న మునుగోడులో బహిరంగ సభ నిర్వహించనుండగా.. ఏర్పాట్లపై జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి శనివారం హైదరాబాద్​లోని తన నివాసంలో ఇన్​చార్జి ఎమ్మెల్యేలతో చర్చించారు. మంత్రి జగదీశ్ రెడ్డితో మీటింగ్ తర్వాత.. సీఎం సభకు జనసమీకరణ కోసం ఇన్ చార్జులుగా ఉన్న ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే భాస్కర్​రావు, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్ నియోజకవర్గంలో వేర్వేరుగా మీటింగ్​లు నిర్వహించారు.

అయితే, ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో అసమ్మతి గళాలు విన్పిస్తున్న మున్సిపల్ చైర్మన్ వెన్​రెడ్డి రాజు సహా ఐదుగురు కౌన్సిలర్లు, ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీ డుమ్మా కొట్టారు. అంతేకాకుండా వేరేగా మీటింగ్ సైతం పెట్టుకున్నారు. మరోవైపు కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న సర్పంచులు, లీడర్లు కూడా శనివారం వేరే మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ముందుగా తమ అభిప్రాయాలు తీసుకోవాలని చెప్పినా పట్టించుకోకుండా అవమానించారని ఎంపీపీ వెంకటరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, 10 మంది సర్పంచులు, ఎంపీటీసీలు మండిపడ్డారు.