- హుజూర్నగర్, మిర్యాలగూడ, భువనగిరి, తుంగతుర్తిలో నిశ్శబ్ద వాతావరణం
- కనిపించని అసమ్మతి నేతల సందడి
- 8 నియోకవర్గాల్లో భగ్గుమంటున్న అసమ్మతి
- దారికి తెచ్చుకునేందుకు ఎమ్మెల్యేల ముమ్మర ప్రయత్నాలు
- మండలి చైర్మన్ గుత్తాను కలిసిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు
నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మొ త్తం 12 నియోజకవర్గాల్లో 8 చోట్ల అసమ్మతి సెగ భగ్గుమంటుంటే..మరో నాలుగు చోట్ల మాత్రం నిశబ్ద వాతావరణం కనిపిస్తోంది. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సొంత నియోజకవర్గం సూర్యాపేట మొదలు ఆలేరు, మునుగో డు, నల్గొండ, కోదాడ, నకిరేకల్, దేవరకొండ, నాగార్జునసాగర్ వరకు అన్ని చోట్ల ఎమ్మెల్యేలు, అసమ్మతి నేతలకు మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. కానీ మిర్యాలగూడ, హుజూర్నగర్, భువనగిరి, తుంగతుర్తిలో మాత్రం అలాంటి అసమ్మతి ఆనవాళ్లు కనిపించడం లేదు.
ఒకవేళ నిజంగానే ఆ నియోజకవర్గాల్లో అసమ్మతి లేదా? లేకపోతే ఎమ్మెల్యేలకు భయపడి అసంతృప్తులు నోరెత్తకుండా సైలెంట్‌గా ఉన్నారా అనే చర్చ పార్టీలో జరుగుతోంది. 8 నియోజకవర్గాల్లో అసంతృప్తి నేతలు వ్యవహరించినట్టు కాకుండా ఎన్నికల టైంలో తమ నిజస్వరూపాన్ని బయట పెట్టాలనే ప్లాన్‌తో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు ఎమ్మెల్యేల మీద తిరగబడ్డ అసంతృప్తి నేతలు మెల్లగా చల్లబడుతున్నారు.
దారికి తెచ్చుకునే ప్రయత్నాలు
పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు సైతం దిగొచ్చి అసమ్మతి నేతలను దారికి తెచ్చుకునే ప్రయత్నాలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే దేవరకొండ, నల్గొండ, మునుగోడు ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలవడం చర్చనీయాంశమైంది. అధిష్టానం ఆదేశాల మేరకు ఇదంతా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ మూడు చోట్ల అసమ్మతి నేతల్లో గుత్తా వర్గం కూడా ఉంది. దీంతో ఆయన్ని కలిస్తే సగం గొడవలు సద్దుమణుగుతాయనే అభిప్రాయానికి వచ్చారు. టికెట్ వచ్చిన సందర్భంగా గుత్తాను మర్యాద పూర్వకంగా కలిశారే తప్ప వాళ్ల మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని తెలిసింది.
అయితే ఇన్నాళ్లూ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఫైట్ చేసిన అసమ్మతి నేతలు ఒక్కసారిగా దారికొస్తారంటే నమ్మశక్యంగా లేదనే చెబుతున్నారు. ఒకవేళ నిజంగానే అసమ్మ తి నేతలు చివరకు ప్లేట్ ఫిరాయించి ఎమ్మెల్యేలతో చేతులు కలిపే పరిస్థితులే వస్తే అప్పుడు తమలాంటి వాళ్లు బయటపడ్డా ప్రయోజనం ఉండదనే ఆ నాలుగు నియోజకవర్గాలోని అసమ్మతి నేతలు జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది.
అసమ్మతి నేతల వ్యూహాత్మక ఎత్తుగడ...
- నాలుగు నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిపై స్థానిక ప్రజాప్రతినిధుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హుజూర్‌నగర్‌తో సహా, అన్ని మండలాల్లో జరుగుతున్న ప్రభుత్వ కాంట్రాక్టులు అన్నీ స్థానిక నేతలకు కాకుండా సమీప బంధువులకు కట్టబెట్టారని, మఠంపల్లి, మేళ్లచెరువులో పోడు భూములను బినామీ పేర్ల మీద పట్టాలు చేయించు కున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణా, మద్యం బిజినెస్‌లో మంత్లీ వాటాలు వల్ల ఇల్లీగల్ దందా మితిమీరిపోయిందని చెబుతు న్నారు. హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్‌తో సహా, నేరేడుచర్ల, గరిడేపల్లి మండలాల్లోని పార్టీ లీడర్లు అసంతృప్తిగా ఉన్నారు. ఉప ఎన్నికల్లో సహకరిం చిన జిన్నారెడ్డి శ్రీనివాస్ రెడ్డిని పక్కకు పెట్టారని, నేరేడుచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని
- చెబుతున్నారు.
- మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్. భాస్కర్‌రావు రాజకీయంగా ఇబ్బంది లేకుండా ప్రధాన సామాజిక వర్గాలకు పదవులు ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా రెడ్డి, ఎస్సీ, కమ్మ, వైశ్య ప్రధానమైన సామాజిక వర్గాలకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు. అయితే మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరుగనగర్ భార్గవ్‌తో ఉన్న విభేదాలు పూర్తిగా సమసిపో లేదని అంటున్నారు. సంక్షేమ పథకాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ, నామినేటెడ్ పోస్టుల ఎంపిక ఏకపక్షంగా జరిగిందని వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. పొలిటికల్ ఎత్తులు వేయడంలో భాస్కర్‌రావు సిద్ధహస్తుడు కావడంతో అసమ్మతి నేతలు బయటకు రాకుండా సైలెంట్‌గా ఉన్నారు.
- తుంగతుర్తిలో ఇసుక మాఫియా, తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్‌తో వి భేదాలు ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్‌కు ఇబ్బందిగా మారాయి. దళిత బంధు స్కీంలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. పార్టీ సీనియర్ నేత మందుల సామేలు పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఇతర మండలాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల్లో ఇసుక రవాణాకు సంబంధించి గొడవలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరినేది తేలితే తప్ప అసమ్మతి నేతలు బయటకు రారని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పడం గమనార్హం.
- భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డికి మధ్య విభేదాలు సమసిపోలేదు. చింతల వెంకటేశ్వరెడ్డి వర్గం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్ రెడ్డి చేరిక శేఖర్ రెడ్డికి అస్సలు మింగుడపడటం లేదు. పార్టీలో చేరాక అనిల్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించినట్లు తెలిసింది. భువనగిరి టౌన్, అనిల్ రెడ్డి సొంత మండలం వలిగొండ, పోచంపల్లి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే పనితీరు పైన అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది.