ఎమ్మెల్యే హరిప్రియపై అసమ్మతి.. వచ్చే ఎన్నికల్లో బీఫాం ఇవ్వొద్దు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఇల్లెందు బీఆర్ఎస్​లో అసమ్మతి చల్లారట్లేదు. ఎమ్మెల్యే హరిప్రియకు వచ్చే ఎన్నికల్లో ఇల్లెందు బీఫాం ఇవ్వొద్దని కోరుతూ కొందరు అధికార పార్టీ లీడర్లు, ప్రజాప్రతినిధులు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ పెద్దలను కలిసేందుకు శుక్రవారం హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. వారిలో నియోజకవర్గంలోని 20 మంది సర్పంచులు, ఇద్దరు ఎంపీపీలు, 15 మంది ఎంపీటీసీలు, ఆరుగురు ఇల్లందు మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం ఇల్లెందు నియోజకవర్గ ఇన్​చార్జి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తాత మధుతో సమావేశమైనట్లు తెలిసింది. హరిప్రియకు ఇల్లెందు టికెట్​ఇవ్వొద్దని కోరినట్లు సమాచారం. శనివారం మంత్రి హరీశ్​రావును కలిసి నియోజకవర్గంలోని పరిస్థితిని వివరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. శనివారం పార్టీ వర్కింగ్​ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జిల్లాకు వస్తుండగా ఇక్కడి నేతలు రాజధానిలోసమావేశమవడం చర్చనీయాంశమైంది. 

నిరసన గళం 

పార్టీలో ఎమ్మెల్యే భర్త హరిసింగ్​పెత్తనం రోజురోజుకు ఎక్కువ అవుతోందని, తమను కలుపుకుపోవడం లేదని అసమ్మతి నేతలు కొన్నిరోజులుగా వాపోతున్నారు. అలాంటప్పుడు మేం ఎమ్మెల్యే గెలుపు కోసం ఎట్లా పనిచేయాలని ప్రశ్నిస్తున్నారు. హరిప్రియకు బీఫాం ఇస్తే తాము పని చేయలేమని, ఆమెకు తప్ప ఇంకెవరికి ఇచ్చినా కష్టపడి పనిచేస్తామని స్పష్టం చేస్తున్నారు. బీఆర్ఎస్ క్యాండిడేట్ల లిస్ట్​ప్రకటించడానికి ఒక్కరోజు ముందు ఇల్లెందు మున్సిపల్ చైర్మన్​డి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పలువురు ముఖ్య నేతలు సమావేశమయ్యారు. హరిప్రియకు టికెట్ ఇవ్వొద్దంటూ పార్టీ పెద్దలను అభ్యర్థించారు. దీంతో అసమ్మతి నేతలకు, ఎమ్మెల్యే వర్గానికి విభేదాలు మరింత ముదిరాయి. హరిప్రియ ఇటీవల మంత్రి హరీశ్ రావును కలిసి అసమ్మతి నేతలపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతోనే అసమ్మతి నేతలు హరీశ్​రావును కలిసేందుకు హైదరాబాద్​వెళ్లారని తెలుస్తోంది.