కాంగ్రెస్​లో భగ్గుమన్న అసమ్మతి .. నారాయణఖేడ్ క్యాండేట్లను వ్యతిరేకిస్తూ ఆందోళనలు

కాంగ్రెస్​లో భగ్గుమన్న అసమ్మతి .. నారాయణఖేడ్ క్యాండేట్లను వ్యతిరేకిస్తూ ఆందోళనలు
  • అనుచరులకు టికెట్లు దక్కకపోవడంపై దామోదర రాజనర్సింహ నారాజ్​
  • రోజంతా నాటకీయ పరిణామాలు

సంగారెడ్డి, వెలుగు :  పటాన్​చెరు, నారాయణఖేడ్​ కాంగ్రెస్​ టికెట్ల కేటాయింపుపై ఆ పార్టీలో అసమ్మతి భగ్గుమన్నది. సోమవారం రాత్రి వెలువడిన కాంగ్రెస్ ఫోర్త్​లిస్టులో పటాన్​చెరు నుంచి నీలం మధు, నారాయణఖేడ్​ నుంచి సురేశ్​ షెట్కార్​ పేర్లు ఖరారైన సంగతి తెలిసిందే. దీంతో పటాన్​చెరు, ఖేడ్​ టికెట్లపై ఆశలు పెట్టుకున్న కాటా శ్రీనివాస్​గౌడ్​, పట్లోళ్ల  సంజీవరెడ్డి అనుచరులు ఒక్కసారిగా ఆగ్రహోదగ్రులయ్యారు.

కాటా అనుచరులు సోమవారం అర్ధరాత్రి రేవంత్​దిష్టి దిష్టిబొమ్మ దహనం చేయడంతో పాటు హైదరాబాద్​లోని పీసీసీ చీఫ్​ ఇంటిపై దాడి చేయడం కాంగ్రెస్​పార్టీలో కలకలం రేపింది. మరోవైపు  ఖేడ్​టికెట్​ఆశించి భంగపడ్డ సంజీవరెడ్డి అనుచరులు పార్టీ మారే ఆలోచన చేస్తున్నారనే టాక్​ నడుస్తోంది. మరోవైపు అనుచరులకు టికెట్లు దక్కకపోవడంపై నారాజ్​గా ఉన్న దామోదర రాజనర్సింహ సీక్రెట్​ మీటింగ్​ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.  

అసంతృప్తిలో దామోదర రాజనర్సింహా..​ 

తాజా పరిణామాలపై పార్టీ సీనియర్​ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా  హైకమాండ్​ తీరుపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. పటాన్​చెరు, నారాయణఖేడ్​ స్థానాల్లో ఆయన ముఖ్య అనుచరులు కాటా శ్రీనివాస్​గౌడ్​, పట్లోళ్ల సంజీవరెడ్డి టికెట్​అశించగా రెండుచోట్ల భంగపాటు తప్పలేదు. దీంతో తీవ్ర అసహనంతో ఉన్న దామోదర రాజనర్సింహా​ మంగళవారం మధ్యాహ్నం మనిపల్లి మండలం బుధేరా చౌరస్తాలో ఓ నాయకుడి ఇంట్లో తన అనుచరులతో రహస్య మీటింగ్​ పెట్టి భవిష్యత్​ కార్యాచరణపై చర్చించినట్టు తెలిసింది.

ఈ మీటింగ్​లో నారాయణఖేడ్​ టికెట్​ ఆశించిన సంజీవరెడ్డి కూడా పాల్గొనడం విశేషం. విషయం తెలుసుకున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గే దామోదర్​తో ఫోన్​లో మాట్లాడి బుజ్జగించినట్లు కాంగ్రెస్​ వర్గాలు చెప్తున్నాయి. ఆ తర్వాతే   రేవంత్​ ఇంటివద్ద ఆందోళనకు దిగిన కాటా అనుచరులకు దామోదర్​నచ్చజెప్పి శాంతింప జేసినట్లు తెలుస్తోంది.