ప్రమాదకరంగా నాగార్జునసాగర్ ఎడమకాల్వ కట్ట
- కుర్యాతండా, అన్నపురెడ్డిగూడెం స్టేజీ వద్ద కోతకు గురైన మట్టి
- ఫుల్ ఫ్లో వస్తే గండి పడే ప్రమాదం
మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా నిడమనూరు మండల పరిధిలోని నేరెళ్లగూడెం మేజర్ వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు ఇటీవల గండి పడడంతో ఇప్పుడు మిగతా చోట్ల కాల్వ కట్ట పరిస్థితిపై ఆందోళన వ్యక్తం అవుతోంది. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల పరిధిలో 178.250 కిలోమీటర్లు ఉన్న ఈ కాల్వ కట్ట అక్కడక్కడా కోతకు గురికావడంతో ఎప్పుడు గండి పడుతుందోనని రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాల్వ పరిధిలో మొత్తం 83 హై లెవల్ బ్రాంచ్ కెనాల్స్, మేజర్ కాల్వలు ఉన్నాయి. మిర్యాలగూడ మండలం కుర్యా తండా అండర్ టన్నెల్, అన్నపురెడ్డిగూడెం, యాద్గార్‌పల్లి మేజర్ సమీపంలో ఎడమ కాల్వ కోతకు గురైంది.
అక్కడక్కగా సీసీ లైనింగ్ వేయకపోవడంతో కాల్వ కట్ట బలహీనపడింది. ఈ కట్ట కింద 8 వేల నుంచి 10 వేల ఎకరాల్లో వరి సాగవుతోంది. కట్టపై వడ్ల లోడ్ ట్రాక్టర్లు తిరుగుతుండడంతో ఎప్పుడు గండి పడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎడమ కాల్వ పూర్తిస్థాయి నీటి విడుదల సామర్ధ్యం 12 వేల క్యూసెక్కులు కాగా రెగ్యులర్‌గా 6 వేల నుంచి 7 వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. కాల్వలో పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తే కట్టకు గండి పడే ప్రమాదం ఉందని రైతులు అంటున్నారు.
బయటపడ్డ నల్గొండ టీఆర్‌ఎస్ లీడర్ల విభేదాలు
- ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వైఖరిపై పార్టీ నేతల్లో అసంతృప్తి
- నల్గొండ మున్సిపాలిటీ, తిప్పర్తి మండలంలో బయటపడ్డ విభేదాలు
- మునుగోడు ఎన్నిక తర్వాత సభ పెట్టాలన్న ఆలోచనలో ఆసంతృప్త లీడర్లు
నల్గొండ, వెలుగు : నల్గొండ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీలో కలవరం పుట్టిస్తున్నాయి. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేస్తున్నారు. రెండు నెలల క్రితం ధిక్కార స్వరం వినిపించిన కౌన్సిలర్లను ఎట్టకేలకు దారిలోకి తెచ్చుకున్నా మళ్లీ పాత కథే రిపీట్ అవుతోంది. పార్టీ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ పిల్లి రామరాజుయాదవ్ , వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్‌గౌడ్, తిప్పర్తి జడ్పీటీసీ పాశం రాంరెడ్డికి, ఎమ్మెల్యేకు మధ్య ఉన్న విబేధాలు రచ్చకెక్కాయి. తిప్పర్తిలో కొద్ది రోజుల క్రితం జరిగిన పింఛన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి జడ్పీటీసీ పాశం రాంరెడ్డిని పిలవకపోవడంతో ఇప్పటివరకు అంతర్గతంగా ఉన్న పోరు కాస్తా బయటపడింది.
రాంరెడ్డి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు కావడంతోనే అతడికి తిప్పర్తిలో సరైన ప్రయారిటీ ఇవ్వడం లేదన్న ప్రచారం జరుగుతోంది. పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి రాంరెడ్డిని పిలువకుండా మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిని ఎమ్మెల్యే వెంటబెట్టుకొని పోవడం వివాదాస్పదంగా మారింది. తిప్పర్తి మండలంలో రాంరెడ్డికి వ్యతిరేకంగా సైదిరెడ్డి సన్నిహితుడైన ఓ కాంట్రాక్టర్‌ను ప్రోత్సహిస్తున్నారని, ఆ కాంట్రాక్టర్‌తోనే తిప్పర్తిలో ఫ్లెక్సీలో ఏర్పాటు చేసి అందులో రాంరెడ్డి ఫొటోలు పెట్టకుండా పింఛన్లు పంచారని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు ఎంపీపీ సైతం నిరాకరించినప్పటికీ చివరి నిమిషంలో ఎమ్మెల్యే సర్ధిచెప్పడంతో అతడు కార్యక్రమానికి హాజరయ్యాడు.
నల్గొండలో రామరాజు, అబ్బగోని లొల్లి...
అధికార పార్టీలోని పలువురు కౌన్సిలర్లు రెండు నెలల క్రితం మున్సిపల్ పాలకవర్గంపై తిరుగుబాటు చేశారు. జనరల్ బాడీ మీటింగ్‌కు రాకుండా క్యాంప్‌నకు వెళ్లారు. పార్టీ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి ఈ వివాదానికి తెరదించారు. కానీ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ పిల్లి రామరాజుయాదవ్, వైస్‌చైర్మన్ అబ్బగోని రమేశ్‌గౌడ్ మాత్రం అసంతృప్తితోనే ఉన్నారు. రామరాజు యాదవ్ తన ఫౌండేషన్ తరఫున ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నల్గొండ నియోజకవర్గంలో సుమారు 200 వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. రామరాజు యువసేన పేరుతో పట్టణంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ సీటు బీసీలకు ఇవ్వాలని రామరాజు డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో గతంలో మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ఆశపడ్డ అబ్బగోని రమేశ్‌గౌడ్ నుడా చైర్మన్ పోస్ట్ కోసం పట్టుబడుతున్నారు. ఈ పదవి ఇస్తానని గతంలో ఎమ్మెల్యే హామీ కూడా ఇచ్చినట్లు తెలిసింది. కానీ ఇలాంటి హామీలతో గతంలోనూ మోసపోయామని, తమ బలాన్ని నిరూపించుకోకపోతే రాజకీయంగా నిలబడలేమన్న ఆలోచనతో ఎమ్మెల్యేకు పోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత నల్గొండలో అసంతృప్తుల ఆధ్వర్యంలో బహిరంగ సభ పెట్టాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. అసంతృప్తుల వెనకాల పార్టీలోని పలువురు పెద్దల హస్తం కూడా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జిల్లా ముఖ్యనేత ఇటీవల మరో సీనియర్ లీడర్ ఇంట్లో చర్చలు జరిపినట్లు తెలిసింది.
బీసీల తరఫున కొత్త పార్టీ పెడుతా..
మునుగోడు, వెలుగు : బీసీల తరఫున కొత్త పార్టీ పెట్టి 2023లో పోటీ చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రకటించారు. నల్గొండ జిల్లా మునుగోడులో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో ఆయన మాట్లాడారు. ప్రజల కోసం కాకుండా రాజకీయ అవసరాల కోసమే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ తరపున బీసీ క్యాండిడేట్‌కు టికెట్ ఇస్తే అతడిని గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మునిగిపోయే పడవ అని ఎద్దేవా చేశారు. అంతకుముందు అంబేద్కర్ చౌరస్తా నుంచి సత్య ఫంక్షన్‌హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, పాట్నా ఓబీసీ అధ్యక్షులు బాబున్‌రావు, సచిన్‌రాజు, లోకేశ్, ముఖేష్ నందన్, బూడిద లింగయ్య యాదవ్, పల్లె రవికుమార్, బూడిద మల్లికార్జున్, పానగంటి విజయ్, ఈదులకంటి కైలాశ్, గుంటోజు వెంకటాచారి పాల్గొన్నారు.
క్వాలిటీ భోజనం, మంచినీరు ఇవ్వాలి
దేవరకొండ (డిండి), వెలుగు : గురుకుల స్టూడెంట్లు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సూచించారు. స్వచ్ఛ గురుకులం కార్యక్రమంలో భాగంగా ఆదివారం నల్గొండ జిల్లా డిండిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు, కిచెన్, మరుగుదొడ్లను పరిశీలించారు. స్టూడెంట్లకు నాణ్యమైన భోజనం, మంచి నీటిని అందించాలని ఆదేశించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మ కృష్ణయ్య, ఎంపీపీ మాధవరం సునీతా జనార్దన్‌రావు, రైతుబంధు అధ్యక్షుడు రాజినేని వెంకటేశ్వర్‌రావు, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ పేర్వాల జంగిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ తూం నాగార్జున్‌రెడ్డి, సర్పంచ్ మేకల సాయమ్మ కాశన్న ఉన్నారు.
టికెట్ ఎవరికిచ్చినా గెలుపు కోసం పనిచేస్తా
చండూరు, వెలుగు : మునుగోడు టికెట్ ఎవరికి వచ్చినా వారి గెలుపు కోసం పనిచేస్తానని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ చెప్పారు. నల్గొండ జిల్లా మునుగోడులో ఆదివారం మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాల సమాచారం ఇవ్వకపోవడం వారి విచక్షణకే వదిలేస్తున్నానని అన్నారు. ఎవరు పిలిచినా, పిలవకపోయిన టీఆర్‌ఎస్ క్యాండిడేట్ గెలుపు కోసం సైనికుడిలా పనిచేస్తానని స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు కాని సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణలోనే అమలవుతున్నాయన్నారు. మునుగోడులో టీఆర్‌ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్‌ను చూస్తే కేంద్రం వణుకుతోంది
యాదగిరిగుట్ట, వెలుగు : జాతీయ రాజకీయాల్లోకి వస్తానని సీఎం కేసీఆర్ చెప్పినప్పటి నుంచి బీజేపీ, ప్రధాని మోడీకి వణుకు పుడుతోందని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం కంచల్‌తండా, ఆలేరు మండలం మందనపల్లికి చెందిన పలువురు ఆదివారం యాదగిరిగుట్టలో గొంగిడి మహేందర్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులను కూడా కేంద్రం ఇవ్వడం లేదని ఆరోపించారు. కేసీఆర్‌కు దేశ ప్రజల నుంచి మద్దతు పెరుగుతుండడంతో ఐటీ, ఈడీ దాడులంటూ భయపెడుతున్నారన్నారు. కేంద్రం ఎన్ని ఆటంకాలు సృష్టించినా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, బొమ్మలరామారం మండల అధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ గూదె బాలనర్సయ్య, జిల్లా నాయకులు మచ్చ శ్రీనివాస్‌గౌడ్, రాజన్‌నాయక్ పాల్గొన్నారు.
కరెంట్‌షాక్‌తో యువకుడు మృతి
భూదాన్‌పోచంపల్లి, వెలుగు : గణేశ్ శోభాయాత్ర నిర్వహిస్తున్న టైంలో కరెంట్ షాక్‌తో ఓ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన యాదాద్రి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం వంకమామిడిలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం రాత్రి వంకమామిడిలో గణేశ్ శోభాయాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా డీజే బాక్స్‌లకు తీగుళ్ల జశ్వంత్ (15), చింటు, చరణ్ పవర్ కనెక్షన్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురికి కరెంట్ షాక్ కొట్టడంతో తీవ్రంగా గాయపడి జశ్వంత్ చనిపోయాడు. చింటు, చరణ్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి.
ఎస్సై ఫ్యామిలీని పరామర్శించిన ఎస్పీ
హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా హాలియా ఎస్సై ఎల్లయ్య అనారోగ్యంతో ఇటీవల చనిపోయారు. విషయం తెలుసుకున్న ఎస్పీ రెమా రాజేశ్వరి ఆదివారం ఎల్లయ్య ఫ్యామిలీ మెంబర్స్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధిత ఫ్యామిలీకి అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం ద్వారా రావాల్సిన బెనిఫిట్స్‌ను త్వరగా ఇప్పించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
సమస్యల పరిష్కారం కోసమే పాదయాత్ర
యాదాద్రి, వెలుగు : ఆలేరు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్‌తో సోమవారం నుంచి పాదయాత్ర నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య ప్రకటించారు. ఆదివారం స్థానికంగా మీడియాతో మాట్లాడారు. రాహుల్‌గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రకు మద్దతుగా ఆలేరు మండలం కొలనుపాకలోని సోమేశ్వరాలయం నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహిస్తామని చెప్పారు. ఆలేరు, మోటకొండూరు, యాదగిరిగుట్ట మండలాల్లో 9 రోజుల పాటు మొదటి విడత పాదయాత్ర నిర్వహిస్తామన్నారు. ఆలేరు ప్రాంతంలో సాగు, తాగునీటి సమస్య పరిష్కారం కోసం గంధమల్ల, తపాస్‌పల్లి రిజర్వాయర్లు నిర్మిస్తామని చెప్పి ఎనిమిదేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. యువతకు ఉపాధి కల్పించడంలో విఫలం అయ్యారని ఆరోపించారు. పాదయాత్రలో ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు.
కటాఫ్ మార్కుల విషయంలో ఎస్సీలకు న్యాయం చేయాలి
కోదాడ, వెలుగు : ఎస్సై, కానిస్టేబుల్ ఎంపిక ఎగ్జామ్ కటాఫ్ మార్కుల విషయంలో ఎస్సీ, ఎస్టీలకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కోరారు. ఈ మేరకు ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీల కటాఫ్ మార్కులను 40 నుంచి 20కి తగ్గించాలని కోరారు. డిగ్రీ పాస్
అయి ఉండాలన్న రూల్ వల్ల కొందరికి నష్టం జరుగుతుందన్నారు. నోటిఫికేషన్‌లోని లోపాలను సవరించి రీనోటిఫికేషన్ ఇచ్చేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఏపూరి రాజు, వడ్డేపల్లి కోటేశ్, యలమర్తి రాము, కొండపల్లి ఆంజనేయులు, కొత్తపల్లి అంజయ్య, రావి స్నేహలత చౌదరి, కుడుముల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
‘ప్రజల గొంతుక’ పుస్తకావిష్కరణ
మిర్యాలగూడ, వెలుగు : మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి రాసిన ‘ప్రజల గొంతుక’ పుస్తకాన్ని ఆదివారం ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలను రాజకీయంగా, సామాజికంగా చైతన్యపరిచేందుకు ఈ పుస్తకం ఉపయోగపడుతుందన్నారు. శాసనసభలో లేవనెత్తిన అంశాలను పుస్తక రూపంలో తీసుకురావడం శుభపరిణామం అన్నారు. గిరిజన సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ఇస్లావత్ రాంచంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మాజీ జెడ్పీచైర్మన్ రవికుమార్ పాల్గొన్నారు.
మునుగోడులో టీఆర్‌ఎస్ ఓటమి ఖాయం
మునుగోడు, వెలుగు : మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించడమే తన లక్ష్యమని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా మునుగోడులో ఆదివారం మీడియాతో మాట్లాడారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన అనుచరులు,
గుండాలను పంపించి సుదర్శన్‌పై దాడి చేయించడం హేయమైన చర్య అన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు దాడి చేసిన వారికే అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గంలో గడపగడపకు తిరిగి ప్రభుత్వ తీరును, ఓటు విలువను వివరిస్తామని చెప్పారు. సోమవారం ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల కార్యకర్తలతో మీటింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు.
సునీల్ బన్సల్‌కు స్వాగతం పలికిన బీజేపీ లీడర్లు
చౌటుప్పల్, వెలుగు : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్‌చార్జి సునీల్ బన్సల్‌కు ఆదివారం యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో ఆ పార్టీ లీడర్లు ఘన స్వాగతం పలికారు. ఆదివారం నల్గొండ జిల్లా మునుగోడుకు వెళ్తున్న సునీల్ బన్సల్‌తో పాటు జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి చౌటుప్పల్‌లో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. చౌటుప్పల్ మండలం ఆరెగూడెం, జై కేసారం గ్రామానికి చెందిన పలువురు సునీల్ బన్సల్ సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాత, కొత్త అనే తేడా లేకుండా అందరూ కో ఆర్డినేషన్‌తో పనిచేసి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో దూడల భిక్షం, జడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, గుజ్జుల సురేందర్‌రెడ్డి, వెంకటేశం పాల్గొన్నారు.
సాగర్ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
హాలియా, వెలుగు : శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. సాగర్‌కు 1,81,304 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో 10 గేట్లను 10 ఫీట్ల మేర ఎత్తి 1,45,760 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌లో ప్రస్తుతం 587.80 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. కుడికాల్వకు 9,160 క్యూసెక్కులు, వరదకాల్వకు 400 క్యూసెక్కులు, మెయిన్ పవర్‌హౌజ్‌కు 25,984 క్యూసెక్కుల నీటిని
వదులుతున్నారు.
నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన దంపతులు
కాపాడిన యువకులు
యాదాద్రి (ఆలేరు), వెలుగు : వరద నీటిలో కొట్టుకుపోతున్న దంపతులతో పాటు మరో యువకుడిని స్థానిక యువకులు, పోలీసులు గమనించి కాపాడారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక శివారులో జరిగింది. ఆలేరుకు చెందిన సక్కుబాయి, అశోక్ మోపెడ్‌పై ఆదివారం కొలనుపాకకు వెళ్తున్నారు. గ్రామ శివారులోని కాజ్‌వే దాటుతుండగా బైక్ అదుపుతప్పడంతో నీటిలో పడ్డారు. స్థానిక యువకులు వెంటనే వారిని గమనించి కాపాడారు. అలాగే జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన జూల శ్రీకాంత్ బైక్‌పై ఆలేరుకు వచ్చాడు. తిరిగి పోచన్నపేటకు వెళ్తుండగా కొలనుపాక కాజ్‌వేపై జారిపడి కొట్టుకుపోయాడు. గమనించిన పోలీసులు వెంటనే అతడిని కాపాడారు.
ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ
నకిరేకల్, వెలుగు : సంక్షేమ పథకాల అమలులో సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం గోరెంకలపల్లికి చెందిన పలువురికి మంజూరైన ఆసరా పెన్షన్ కార్డులను ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల, మతాలు, పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అందుతోందన్నారు.
డిండిలో గల్లంతైన యువకుడి డెడ్‌బాడీ లభ్యం
దేవరకొండ (డిండి), వెలుగు : నల్గొండ జిల్లా డిండి ప్రాజెక్ట్ వద్ద సెల్ఫీ దిగుతూ రిజర్వాయర్‌లో పడి గల్లంతైన ఉడుత మనోజ్ డెడ్‌బాడీ ఆదివారం దొరికింది. గణేశ్ నిమజ్జనం కోసం ఫ్రెండ్స్‌తో కలిసి శ్రీశైలం వెళ్లిన మనోజ్ తిరుగు ప్రయాణంలో ప్రాజెక్ట్ వద్ద సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం ఉదయం రిజర్వాయర్‌లో గాలింపు చర్యలు చేపట్టారు. మనోజ్ డెడ్‌బాడీని బయటకు తీసి దేవరకొండ ప్రభుత్వ హాస్పిటల్‌కు
తరలించారు.
లక్ష్య సాధనకు కృషి చేయాలి
నల్గొండ అర్బన్, వెలుగు : ఒత్తిడి లేకుండా ఆరోగ్యంగా ఉండేందుకు మేధ యోగా ఎంతగానో ఉపయోపడుతుందని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి చెప్పారు. ఆర్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండలోని బీసీ గురుకుల స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్టూడెంట్లు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. స్టూడెంట్లలో మార్పులు తీసుకొచ్చేందుకు మేధ యోగా ఎంతోగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఆర్ట్‌ఆఫ్ లివింగ్ వలంటీర్ ఏచూరి భాస్కర్, ఏచూరి శైలజ పాల్గొన్నారు.