ఊరంతా తెలిసిన మనిషిని పట్టుకొని పేరు అడిగితే చాలా అవమానంగా ఉంటది. ఇప్పుడో మోస్ట్ సీనియర్ లీడర్ కు ఇదే పరిస్థితి వచ్చింది. ఊరు పేరు కాదు ఏకంగా పుట్టుక, వంశం దాకా వచ్చేసింది. దీంతో ఆ లీడర్ చాలా బాధపడుతున్నారట. పొలిటికల్ గానూ ఇబ్బందేనని ఫీలవుతున్నారట.
దశాబ్దాల రాజకీయం తర్వాత కులం గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆవేదనలో ఉన్నట్లు ఆయన సన్నిహితుల్లో టాక్ నడుస్తోంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం వరకు సీనియర్ దళిత నేతగా గుర్తింపు ఉన్న తనకు ఇప్పుడీ కష్టమేంటని ఫీలవుతున్నట్లు చెబుతున్నారు. ఎలక్షన్ వేడిలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేసిన విమర్శలతో వ్యక్తిగతంగా, రాజకీయంగానూ ఇబ్బంది పడుతున్నట్లు జిల్లా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
స్టేషన్ ఘన్ పూర్ సెగ్మెంట్ కంచుకోటగా ఎదిగి మంత్రి పదవులు అందుకున్న కడియం తర్వాత వరుసగా రాజయ్య చేతిలోనే ఓటమి పాలయ్యారు. చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న ఇద్దరు 2014 నుంచే ఒకే పార్టీలో ఉన్నారు. రెండుసార్లు రాజయ్యకే టికెట్ ఇచ్చిన కేసీఆర్... కడియంకు ఎమ్మెల్సీతో పాటు మొదటి టర్మ్ లో కొంతకాలం డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. అయితే.. తన పాత అడ్డా ఘన్ పూర్ కు మరోసారి ఎమ్మెల్యే కావాలన్న కోరిక మాత్రం కడియంకు బలంగా ఉంది. 2018లో మిస్సయినా ఈసారి ఎట్లయినా బరిలోకి దిగాలన్న పట్టుదలతో ఉన్నారు.
సెగ్మెంట్లో ఇద్దరు నేతల యాక్టివిటీ మాటల యుద్ధానికి దారితీసింది. తనపై వచ్చిన పలు ఆరోపణల వెనుక కడియం వర్గమే ఉందని రాజయ్య వర్గం అంటోంది. లేటెస్ట్ గా ఆరోపణల క్రమంలో రాజయ్య మొదటిసారి కడియం కుల ప్రస్తావన తేవడం కలకలం రేపింది. కడియం అసలు దళితుడే కాదని, బీసీ అంటూ ఆరోపణలు చేశారు.
ALSO READ :ఇందిరమ్మ ఇండ్లకు.. రూ.3 వేలు కరెంటు బిల్లు వసూలు చేస్తున్రు
ఎలక్షన్ టైంలో ఇట్లాంటి ఆరోపణలు రావంతో కడియం వివరణ ఇచ్చుకున్నారు. తన తల్లి బీసీ అని, తండ్రి ఎస్సీ ఉపకులం కాబట్టే వారసత్వం ప్రకారం తాను దళితుడినేనని చెప్పారు. అయితే ఎలక్షన్ టైంలో సున్నితమైన అంశాన్ని రేపడం ఇబ్బందేనన్న ఆందోళన ఉందని కడియం అనుచరులు చెబుతున్నారు. సబ్ క్యాస్ట్ ప్రస్తావనతో దళిత ఓట్లలోనే చీలిక రావచ్చన్న భయం వెంటాడుతోందట.
సీనియర్ దళిత నేతగా పేరున్నా, ఎన్నో మంత్రి పదవులు చేసినా ఇప్పుడు కులం గురించి క్లారిటీ ఇచ్చుకోవాల్సి రావడం ఏంటని కడియం ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తీవ్రమైన ఆరోపణలు, వివాదాలు లేని ఆయనకు ఈ పరిస్థితి ఇబ్బందిగానే చెబుతున్నారు.