కమలాపూర్​ బీఆర్ఎస్​లో భగ్గుమన్న విభేదాలు

  • ఎమ్మెల్సీ పాడి కౌశిక్​రెడ్డి సమక్షంలో లీడర్ల ఘర్షణ
  • రసాభాసగా మారిన ముఖ్య కార్యకర్తల సమావేశం
  • కౌశిక్ మేనేజ్ చేయలేకపోతున్నాడని బీఆర్ఎస్ లీడర్ల గుస్సా

కమలాపూర్, వెలుగు: హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ బీఆర్ఎస్ పార్టీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఒకే పార్టీలో ఉంటూనే గ్రూపులు మెయింటైన్ చేసిన కొందరు లీడర్లు సోమవారం ఏకంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సమక్షంలో ఒకరినొకరు బూతులు తిట్టుకున్నారు. ఘర్షణకు దిగి కుర్చీలు విసురుకున్నారు. ఇదంతా చూస్తుండిపోయిన మిగిలినవారు ‘పార్టీ పట్టించుకోదు.. వీళ్లు మారరంటూ’ అసహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. సోమవారం సాయంత్రం కమలాపూర్ శివారులో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కమలాపూర్ మండలం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

 సీనియర్ లీడర్లతోపాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఓ సీనియర్ లీడర్ మాట్లాడుతుండగా, మండలంలోని ఓ గ్రామానికి చెందిన లీడర్ చేసిన వ్యాఖ్యలతో సమావేశంలో ఘర్షణ వాతావరణం మొదలైంది. ఇరువర్గాల లీడర్లు నోటికొచ్చినట్లు తిట్టుకుంటూ ఒకరినొకరు తోసుకున్నారు. కుర్చీలు విసిరేసుకున్నారు. పాడి కౌశిక్ రెడ్డి లీడర్ల తీరుపై అసహనం వ్యక్తం చేసి, పార్టీలో ఇబ్బంది ఉంటే వెళ్లిపోవచ్చన్న సంకేతాలు ఇచ్చినట్లు కొందరు లీడర్ల ద్వారా తెలిసింది. గొడవపై సీరియస్ అయిన కౌశిక్ రెడ్డి మరో రెండు రోజుల్లో మీటింగ్ ఏర్పాటు చేస్తానని, కొట్లాడుకోవడం కాదు పార్టీ అభివృద్ధికి, నియోజకవర్గంలో గెలుపు కోసం కృషి చేయాలని సూచించి వెళ్లిపోయినట్లు సమాచారం. 

అయితే కౌశిక్ తీరుపై కమలాపూర్ బీఆర్ఎస్ లీడర్లు అసహనంగా ఉన్నారు. నెల రోజుల కింద హుజూరాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కమలాపూర్ మండల ప్రజాప్రతినిధులు కౌశిక్​తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటికి వచ్చేశారు. అతనికి పార్టీలోని లీడర్లను మేనేజ్ చేయడం తెలుస్తలేదని అసహనం వ్యక్తం చేయడంపై చర్చనీయాంశమైంది.