కాంగ్రెస్​లో టికెట్​ వార్..జూపల్లి, కూచుకుళ్ల పార్టీలో చేరక ముందే మొదలైన లొల్లి

కాంగ్రెస్​లో టికెట్​ వార్..జూపల్లి, కూచుకుళ్ల పార్టీలో చేరక ముందే మొదలైన లొల్లి

నాగర్​కర్నూల్, వెలుగు: కాంగ్రెస్​లో చేరేందుకు సిద్ధమైన సీనియర్​​లీడర్లు పార్టీ హైకమాండ్​ ముందు డిమాండ్లు పెడుతుంటే, నియోజకవర్గాల స్థాయిలో తామే బాసులమని ఇన్​చార్జీలు ధీమాగా ఉన్నారు. కొత్తగా ఎవరు చేరినా తమ పరిధిలో పని చేయాల్సిందేనని కొంచెం గట్టిగానే చెబుతున్నారు. సోమవారం పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో మీటింగ్​ నిర్వహించిన కాంగ్రెస్​ నేతలు సీఆర్​ జగదీశ్వర్​రావును కాదని జూపల్లికి టికెట్​ ఇస్తే ఓడిస్తామని స్పష్టం చేశారు. 

కొల్లాపూర్, కోడేరు మండలాల్లో ఇదే తరహా మీటింగులు నిర్వహించారు. నాగర్​ కర్నూల్  నియోజకవర్గంలో బిజినేపల్లి మండల పార్టీ ప్రెసిడెంట్,​ ఎంపీటీసీ కూచుకుళ్ల సుహాసన్​రెడ్డితో పాటు ఆయన వర్గీయులు నాగం జనార్ధన్​రెడ్డి తమను అణచివేస్తున్నారని పీసీసీ నేతలకు కంప్లైంట్​ ఇచ్చారు. తాను టికెట్​ రేస్​లో ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​రెడ్డి, ఆయన కొడుకు డా.రాజేశ్​రెడ్డి కాంగ్రెస్​లో చేరాలని  నిర్ణయించుకోవడంతో నాగర్​ కర్నూల్​ కాంగ్రెస్​ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఢిల్లీలో ఏఐసీసీ కార్యకలాపాలకు పరిమితమైన మాజీ ఎమ్మెల్యే వంశీచంద్​రెడ్డి కల్వకుర్తి నుంచి తానే పోటీ చేస్తానని, రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తానని అంటున్నారు.

చేరకముందే అసమ్మతి..

ఉమ్మడి జిల్లా రాజకీయాలను ప్రభావితం చేస్తానని భావిస్తున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్​లో చేరడానికి ముందే అసమ్మతిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. 11 ఏండ్లు బీఆర్ఎస్​లో కొనసాగిన జూపల్లి, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డితో కలిసి కాంగ్రెస్​లో చేరేందుకు పావులు కదిపారు. కాంగ్రెస్​ సీనియర్​ నేతలతో వరుస భేటీలు నిర్వహించారు. కొల్లాపూర్​ నుంచి కాంగ్రెస్​ టికెట్​పై జూపల్లి పోటీ చేయడం ఖాయమన్న వార్తలతో ఇక్కడి కాంగ్రెస్​ లీడర్లు గుర్రుగా ఉన్నారు. జూపల్లి వచ్చినా.. ఇంకెవరు వచ్చినా తన కింద పనిచేయాల్సిందేనని, కాంగ్రెస్​ నుంచి తానే  పోటీ చేస్తానని పీసీసీ మెంబర్  సీఆర్​ జగదీశ్వర్​రావు కార్యకర్తలతో చెబుతున్నారు. టీపీసీసీ కార్యదర్శి రంగినేని అభిలాశ్​రావ్​ కూడా తాను టికెట్​ రేస్​లో ఉన్నానని ప్రకటించారు. వీరి ముగ్గురితో పాటు మహిళా కాంగ్రెస్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతమ్మ లైన్​లో ఉన్నారు. ఇక బీఆర్ఎస్​ నుంచి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​ రెడ్డి పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామన్న మాజీ మంత్రి డా.నాగం ఈసారి తాను అసెంబ్లీలో ఉండడం అవసరమని, తానే అభ్యర్థినని డైరెక్ట్​గా ప్రకటించారు.    

కలుపుకొని వెళ్లడం సాధ్యపడేనా?

2012లో మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్​లో చేరిన జూపల్లి కృష్ణారావు రాష్ట్ర ఏర్పాటు తరువాత కొల్లాపూర్​ నుంచి గెలిచి కేసీఆర్​ తొలి​క్యాబినెట్​లో ఐదేండ్లు మంత్రిగా కొనసాగారు. 2018లో ఓటమి తర్వాత బీఆర్ఎస్​హైకమాండ్ తో పాటు బీఆర్ఎస్​లో చేరిన ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్​రెడ్డి వర్గం నుంచి అవమానాలు భరించలేక పలుమార్లు ఆందోళనకు దిగారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డితో జతకట్టి  కాంగ్రెస్​లో చేరేందుకు సిద్ధమయ్యారు. కొల్లాపూర్​లో మొదటి సమావేశం నిర్వహించిన జూపల్లి, వనపర్తిలో పొంగులేటి శ్రీనివాస్​రెడ్డితో కలిసి మరో సభ నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో తనకు నాలుగు స్థానాలు కేటాయించాలని డిమాండ్​ పెట్టినట్లు సమాచారం. కొల్లాపూర్, నాగర్​కర్నూల్, వనపర్తి, గద్వాల లేదా అలంపూర్​ స్థానాలు తాను సూచించిన వారికి ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. 

ALSO READ:ఈ వారం ఎలక్షన్ కమిటీ.. వచ్చే నెల టికెట్ల ఖరారు : కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి

నాగర్​కర్నూల్​లో మాజీ మంత్రి డా.నాగం జనార్దన్​ రెడ్డి, వనపర్తిలో మాజీ మంత్రి డా.చిన్నారెడ్డి రేస్​లో ఉన్నారు. ఇదిలాఉంటే నెల రోజులుగా బీఆర్ఎస్​ అసంతృప్త నేత, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​రెడ్డితో సంప్రదింపులు జరిపారు. ఎటువంటి హామీ లేకుండా కాంగ్రెస్​లో చేరడమా లేక బీఆర్ఎస్​లోనే కొనసాగడమా అని కూచుకుళ్ల  డైలమాలో పడినట్లు సమాచారం. కాంగ్రెస్​ నేతలతో సంప్రదింపులు జరుపుతూనే ఈనెల 12న గద్వాల పర్యటనకు వచ్చిన సీఎం సభలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. సోమవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రెసిడెంట్​ ఖర్గే, రాహూల్​గాంధీతో జరిగిన భేటీలో ఆయన కొడుకు డా.రాజేశ్​రెడ్డి పాల్గొన్నారు. నాగర్​ కర్నూల్, కొల్లాపూర్​లో పాత కాపులే పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కొత్త, పాత నేతలు కలిసి పని చేస్తారనేది అనుమానమేనని 
అంటున్నారు.