వర్ధన్నపేట, వెలుగు : వరంగల్ జిల్లా వర్ధన్నపేట కాంగ్రెస్‌లో నెలకొన్న విభేదాలు బయటపడ్డాయి. మంగళవారం స్థానిక లక్ష్మీ గార్డెన్స్‌లో వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ పోలీస్ ఆఫీసర్ కేఆర్.నాగరాజు, నియోజకవర్గ ఇన్‌చార్జి నమిండ్ల శ్రీనివాస్ అనుచరులు ఏఐసీసీ అబ్జర్వర్ ఉత్తమ్‌రావ్ దుల్వీ సమక్షంలోనే గొడవ పడ్డారు. నాగరాజును వేదికపైకి పిలవకపోవడంతో ఆయన మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ నేత బండారు శోభారాణి, సీనియర్ లీడర్లు ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు, జంగా రాఘవరెడ్డి, కొండా మురళి, నాయిని రాజేందర్‌రెడ్డి జోక్యం చేసుకొని ఇరు వర్గాలకు నచ్చజెప్పారు.
కాంగ్రెస్ విజయం ఖాయం
వర్ధన్నపేట/స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ఏఐసీసీ అబ్జర్వర్ ఉత్తమ్‌రావ్ దుల్వీ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం వర్ధన్నపేటలో, జనగాం జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌పై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలచుకోవాలని సూచించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిర, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, నాయకులు జంగా రాఘవరెడ్డి, దొమ్మాటి సాంబయ్య, నాయిని రాజేందర్‌రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ పాల్గొన్నారు.