బీసీ హాస్టల్ చదువుకుంటున్న ఓ స్టూడెంట్ అదృశ్యం అయిపోయాడు.. సీసీ కెమెరాల్లోనూ అతని ఆచూకీ దొరకలేదు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.
సింగరేణి మండలం మాధారం గ్రామానికి చెందిన భాను ప్రకాష్ (17) సుదిమళ్ళ బీసీ హాస్టల్ లో ఉంటూ ఇల్లందులోని ప్రైవేట్ ఐటీఐలో ఎలక్ట్రిషన్ చదువుతున్నాడు. అయితే గత నెల జులై 28న రాత్రి 9 గంటల ప్రాంతంలో హాస్టల్ నుండి బయటకు వచ్చి ఖమ్మం వెళ్లే సూపర్ లగ్జరీ బస్సు ఎక్కి ఖమ్మం బస్టాండ్ లో దిగి ఆటో ఎక్కేవ వీడియో లు సీసీ కెమెరా లో రికార్డ్ అయ్యాయి.
ఖమ్మం నుండి మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ లో సికింద్రాబాద్ వెళ్ళాడు భాను ప్రకాష్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సీసీ కెమెరాలలో వీడియోల కోసం ప్రయత్నిస్తే అందులో ఎక్కడా కూడా భాను ప్రకాష్ కనపడలేదని అతని తండ్రి తెలిపారు. రాత్రి 9 గంటల సమయంలో హాస్టల్ నుండి పిల్లవాడిని బయటికి ఎలా పంపించారని హాస్టల్ నిర్వాహకులను ప్రశ్నించాడు భాను ప్రకాశ్ తండ్రి శ్రీనివాస్ .
తమ పిల్లవాడికి ఏమైనా జరిగితే హాస్టల్ నిర్వాహకులదే బాధ్యతని భాను ప్రకాష్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇల్లందు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు శ్రీనివాస్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.