సర్పంచి భర్త అదృశ్యం.. పెండింగ్ బిల్లులు రాలేదని మనస్థాపం

సర్పంచి భర్త అదృశ్యమైన సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఝాన్సీ లింగాపూర్ గ్రామ సర్పంచి పంబాల జ్యోతి భర్త శ్రీనివాస్ తో కలిసి నివసిస్తోంది.  ఈ క్రమంలో బయటికి వెళ్లోస్తానని చెప్పి శ్రీనివాస్ అదృశ్యమయ్యారు. ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.ప్రస్తుతం ఆయన విద్యుత్తు ఉద్యోగిగా పని చేస్తున్నారు.

కారణం అదేనా..?

జ్యోతి మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులకు సంబంధించిన రూ.40 లక్షల పెండింగ్ బిల్లులు ఇంకా మంజూరు కాలేదన్నారు. కాగా ఉప సర్పంచి, వార్డు మెంబర్లు అభివృద్ధికి సహకరించలేదని గ్రామస్థులతో శ్రీనివాస్ అన్నట్లు సమాచారం. దీనికి తోడు పెండింగ్ బిల్లులు రావట్లేదని తరచూ మనస్థాపానికి గురయ్యేవారని భార్య జ్యోతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.