ప్రత్యేక రాష్ట్రంలో గల్లంతవుతున్న సభా సంప్రదాయాలు

ప్రత్యేక రాష్ట్రంలో గల్లంతవుతున్న సభా సంప్రదాయాలు

శాసనసభలో ఇదివరకు ప్రతి శాఖ పద్దు మీద చర్చ జరిగేది. నిధుల కేటాయింపుల గురించి మార్పులు చేర్పులు సూచించేవారు. నిధుల ఖర్చు మీద ప్రశ్నలు వచ్చేవి. క్రమంగా శాసనసభ బడ్జెట్ సమావేశాలు కొన్ని రోజులకే పరిమితం అవుతున్నాయి. మంచి సంప్రదాయాలు అనేకం గాలిలో కలిపేశారు. చర్చలు లేకుండా అయి అయి నాయ్ నాయ్ అంటూ బడ్జెట్ 2022–-23 ఆమోదించారు. ప్రజాస్వామ్యంలో, అభివృద్ధిలో చర్చలు, సంప్రదింపులు, సర్వామోదం ద్వారా జరపాల్సిన ప్రక్రియలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. బడ్జెట్ ప్రక్రియల్లో ఇదివరకు ఉన్న పారదర్శక పద్ధతులు కూడా మృగ్యం అవుతున్నాయి. ఒక బడ్జెట్ పుస్తకంలో ఉన్న అంకెలకు ఇంకొక పుస్తకంలో ఉన్నవాటికి పొంతన లేదు. కేటాయింపులు ఘనంగా ఉన్న పద్దులు సర్వసాధారణంగా సవరించడం ఆనవాయీతీ అయి పోయింది. సవరణ చేసినా శాసనసభ ఆమోదం పొందాల్సిందే. కానీ అలాంటి సంప్రదాయం కొనసాగడం లేదు. చేస్తున్న ఖర్చు కూడా కేటాయింపుల కంటే చాలా తక్కువ. రెవెన్యూ లోటు ఒప్పుకుంటూనే, బడ్జెట్ కేటాయింపులు ఆదాయానికి మించి చేస్తూ ద్రవ్య లోటు ఒక ఘనకార్యంగా చెప్పుకునే పరిస్థితికి ప్రభుత్వం దిగజారింది. సాధారణంగా ప్రతి శాఖ బడ్జెట్ ప్రతిపాదనలు పంపుతుంది. ఆయా ప్రతిపాదనలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా పంపాల్సిన బాధ్యత ఆయా శాఖాధిపతుల మీద, మంత్రుల మీద ఉంటుంది. లేదంటే, వారి అంచనాల మీద విమర్శ వస్తుంది. మరీ ఎక్కువ తేడా ఉంటే శాఖాపరమైన చర్యలు ఉంటాయి. ఇటీవలి కాలంలో నూటికి నూరు శాతం ఖర్చు చేయని పథకాలు ఉన్నాయి. అలాంటి వాటి మీద సమీక్షనే లేదు.

ప్రివిలేజ్​కమిటీ ఏది?

ఆర్థిక మంత్రి చేసిన బడ్జెట్ ప్రసంగంలో ఇటీవల కొన్ని నిధుల కేటాయింపుల ప్రకటనలు ఎక్కువయ్యాయి. అయితే, ఇవి బడ్జెట్ పుస్తకాల్లో ఉండవు. బడ్జెట్ పుస్తకంలో లేనివి తన ప్రసంగంలో చెప్పడం ఎంతవరకు కరెక్ట్? బడ్జెట్ ప్రసంగంలో ఉటంకించిన కోట్ల నిధులు వాస్తవానికి అంతే స్థాయిలో బడ్జెట్ పుస్తకంలో ఉండకపోవడం కూడా చూస్తున్నాం. బడ్జెట్​లో కేటాయించినవి తరువాత సవరిస్తున్నారు. ఈ సవరణలకు కూడా శాసన సభ ఆమోదం పొందాలి. కానీ ఆ పద్ధతికి ఎప్పుడో తిలోదకాలు ఇచ్చేశారు. సవరించింది కూడా ఆ మేరకు ఖర్చు పెట్టడం లేదు. ప్రతిపాదించిన సొమ్ముల పరిమాణానికి, ఖర్చు మధ్య తేడా ఉంటే, ప్రభుత్వం సంజాయిషి ఇవ్వాలి. ఇప్పుడు ఇవ్వడం లేదు. ఖర్చు కాకపోవడానికి గల కారణాలు విశ్లేషించి, చర్చించి, పథకాల్లో మార్పులు చేసిన సందర్భాలు ఇదివరకు ఉన్నాయి. ఇట్లాంటివి జరిగితే శాసనసభ్యుల హక్కులకు భంగం కలిగించినట్లే భావించేవారు. ప్రివిలేజ్ కమిటీకి చెప్పవచ్చు. కాకపోతే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కమిటీ వ్యవస్థ అసలు పని చేస్తలేదు. ఒక్క బిజినెస్ వ్యవహారాల కమిటీ కొంత మేర పని చేస్తున్నది. అదీ కూడా సరిగా పని చేస్తలేదని కొందరు శాసనసభ్యుల విమర్శ చూశాం.

ఖర్చులు, కేటాయింపులకు పొంతన లేక

శాసనసభ ఏడాదిలో సమావేశం అవుతున్న రోజులు చాలా తక్కువ. ఇటీవల ప్రధాన ప్రతిపక్ష నేత తన 25 యేండ్ల రాజకీయ జీవితంలో ఇంత తక్కువ బడ్జెట్ రోజులు చూడలేదని చెప్పారు. మిగతా నెలలలో ఎట్లా ఉన్నా, బడ్జెట్ సమావేశాలు కనీసం30 రోజులు ఉండేవి. అప్పటికీ, కొన్ని విషయాలపైన సమయం దొరకక ఆఖరుకు ఒకటే రోజు అన్ని ఆమోదించేవారు. ఇదంతా ఎక్కువగా మార్చిలో జరిగేది. తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు మొదలుపెడితే, సమావేశాల నిడివి పెరుగుతుంది. కనీసం 50 రోజులు ఉంటాయని ఆశిస్తే, అసలు పట్టుమని10 రోజులు కూడా సమావేశాలు కాలేదు. ఈ10 రోజులు కూడా బడ్జెట్ పద్దుల మీద జరిగిన చర్చ అతి తక్కువ. మొత్తం బడ్జెట్ ఆ విధంగా చర్చ లేకుండానే ఆమోదం పొందింది. కొన్ని పథకాలకు నామమాత్రంగా కేటాయించి తరువాత అధిక మొత్తంలో ఖర్చు చేసినవి ఉన్నాయి. ఇంకొన్ని, భారీ మొత్తంలో నిధులు కేటాయించి, జబ్బలు చర్చుకొని తరువాత రూపాయి కూడా ఖర్చు పెట్టని పథకాలు ఉన్నాయి. ఇలాంటి మార్పులు కొత్తగా తెలంగాణాలో వచ్చినవి కావు. అంతకు ముందు శాసనసభలో కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో బడ్జెట్ మీద సామాన్య ప్రజల్లో ఆసక్తి పెరిగింది. అనేక మంది విశ్లేషణలు చేస్తున్నారు. తమ వర్గానికి, లేదా రంగానికి కావాల్సిన నిధుల మీద పోరాటం చేస్తున్నారు. ఆ మేరకు, శాసన సభ బయట జరిగినంత చర్చ శాసనసభ లోపట జరగకపోవటం శోచనీయం.

ప్రజలే శాసనభను కాపాడుకోవాలి

ప్రభుత్వ కార్యక్రమంలో తనపట్ల తగిన ప్రొటోకాల్ పాటించలేదని గగ్గోలు పెట్టే శాసనసభ్యులు సభ లోపట, తమ హక్కులకు భంగం కలుగుతుంటే సైలెంట్​గా ఉండటం హాస్యాస్పదం. తమ నియోజకవర్గంలో తమకు చెప్పకుంట, తమ అనుమతి లేకుండా ఏ పని చేయవద్దని అధికారం ప్రదర్శించే ఎమ్మెల్యేలు శాసనసభలో వారికి చెప్పకుంట, అనుమతి లేకుండా, చర్చ లేకుండా లక్షల కోట్ల రూపాయలు ఆమోదం పొందుతూ ఉంటే నోరు విప్పుత లేరు. ఇలా భారత ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన శాసనసభా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. సంప్రదాయాలను, విధులను, విధానాలను, పద్ధతులను, చట్టాలను అతిక్రమణకు ఆలవాలంగా శాసన సభ మారితే ఇక ప్రజాస్వామ్యంలో మిగిలింది ఏంది? ప్రజలకు ఒరిగింది ఏంది? భారత రాజ్యాంగం అందించిన శాసనసభను ప్రజాస్వామ్య వ్యతిరేక వేదికగా, మలిచిన ఒక నియంతృత్వ పాలకుల బృందం, ఇలాంటి అధికారం కొనసాగించడానికి మళ్లీ ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నది. తమ పార్టీ అభ్యర్థులు గెలవకుంటే వైరి పక్షం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే దుస్సంప్రదాయం ఇప్పటికే వేళ్లూనుకుంది అతి తక్కువ వయసు గల తెలంగాణ రాష్ట్రంలో. ప్రజలు శాసనసభ వ్యవస్థ నిర్వీర్యం అవుతున్న పరిస్థితుల పట్ల, అధికార పార్టీ చర్యల పట్ల, వైరి పక్షాల చేతగానితనం పట్ల, జాగరూకులు కావాలి. ప్రజల సొమ్ముని తమ నోట్లుగా మార్చుకుంటున్న శాసనసభ్యులను ఎండగట్టాలి. ఒక దగ్గర నోటుతో అధికారంలోకి వచ్చినవాడు అదే పద్ధతి అంతటా పాటిస్తాడు. ప్రజలే శాసనసభను కాపాడుకోవాలి. శాసనసభ సమావేశాలను కచ్చితంగా కనీసం 200 రోజులు నిర్వహిస్తామనే వాగ్దానం ప్రతి పార్టీ దగ్గర తీసుకోవాలి.

ఆర్థిక సర్వే, కాగ్​ రిపోర్టుల ప్రస్తావన ఏది?

బడ్జెట్ సమావేశాల్లో విధిగా రాష్ట్ర బడ్జెట్​కు ముందు ఆర్థిక సర్వే ప్రవేశపెట్టే సంప్రదాయం ఉండేది. దాని మీద కూడా ఆర్థిక మంత్రి ప్రసంగం ఉండేది, చర్చ జరిగేది. ఈ ఆర్థిక సర్వేలో రాష్ట్ర పరిస్థితి మీద సమాచారంతో పాటు, కొన్ని సూచికల మీద పురోగతి, ఆయా రంగాల్లో వస్తున్న మార్పుల గురించి విశ్లేషణ ఉంటుంది. తెలంగాణలో ఇప్పుడు ఒక నివేదిక విడుదల అవుతున్నా, దాన్ని శాసనసభలో ప్రవేశపెడతలేరు. ప్రభుత్వ రంగ సంస్థల వార్షిక నివేదిక, కాగ్ నివేదికలు ఈసారి శాసనసభలో పెట్టనే లేదు. వివిధ కార్పొరేషన్ల పేరు మీద తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అప్పులు, ఖర్చులు శాసనసభలో చర్చకు రాకుండా ఉండడానికే ఈ నివేదికలు ఇవ్వలేదు. వివిధ పద్దుల మీద ఆడిట్ రిపోర్ట్ శాసనసభలో పెట్టే అవకాశం లేకుండా బడ్జెట్ సమావేశాలు తగ్గించేసింది రాష్ట్ర ప్రభుత్వం. శాసన సభలో ఏదైనా సమాచారం ఇచ్చిన, ప్రకటించినా, నివేదిక ప్రవేశపెట్టినా, దానికి ఒక నిర్దిష్టత వస్తుంది. తప్పుడు సమాచారం ఇచ్చే ప్రసక్తే ఉండేది కాదు. వివిధ కమిటీల ద్వారా సమాచారం పవిత్రత కాపాడేవారు. ఆర్థిక వ్యవహారాల కమిటీ కూడా తగిన రీతిలో పని చేసేది. ఆర్థిక మంత్రి ఈ కమిటీతో సఖ్యతగా ఉండేవారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని దీనికి చైర్మన్ గా నియమించి, ఈ కమిటికి చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. బడ్జెట్ కు ముందు, తరువాత, సవరణల సందర్భంలో, చేసిన ఖర్చులను సమీక్ష చేయడం ఈ కమిటీ బాధ్యత. ఇప్పుడు ఆ కమిటీకి కూడా ప్రాధాన్యత తగ్గించేశారు.


సంపూర్ణ ప్రణాళిక లేదు


తెలంగాణ బడ్జెట్ కేటాయింపుల్లో సామాజిక సమతుల్యత పాటిస్తున్నట్లు కనపడుతున్నా, వివిధ పథకాల అమలు తీరు, రూపొందించిన విధి విధానాలు, మార్గదర్శకాలు దానికి భిన్నంగా ఉన్నాయి. రైతు బంధు అందరికి, ఎక్కువగా పేద రైతులకు అని సర్కారు చెబుతున్నా, వ్యవసాయం చేయని వారికి అందుతున్న వైనం గురించి ప్రభుత్వం స్పందిస్తలేదు. లక్షల మంది సన్నకారు రైతులు పాసుపుస్తకాలు రాక, వచ్చినా అందులోని తప్పులను సరిదిద్దే వ్యవస్థ లేక పథకాలను పొందలేకపోతున్నారు. సంక్షేమ పథకాల్లో నేరుగా ప్రజా ప్రతినిధుల జోక్యంతో లబ్ధిదారుల ఎంపిక రాజకీయం అయిపొయింది. వ్యవసాయం మీద ప్రభుత్వ ఖర్చుకు ఒక దారీ తెన్ను లేదు,దిశ లేదు. సంపూర్ణ ప్రణాళిక లేదు. సుస్థిర ఆలోచనలతో కూడిన ప్రణాళిక లేదు. కొన్ని పథకాల మీద కోట్లు పెడుతున్నా, సత్ఫలితాలు రావడం లేదు. రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతంలో పేదరికం పెరుగుతున్నది. ఆహార అభద్రత విస్తరిస్తున్నది. ఆహార లేమి, పోషకాల లేమితో రైతాంగం వారి కుటుంబాలు సతమతమవుతున్నాయి.

దొంతి నర్సింహా రెడ్డి, పాలసీ ఎనలిస్ట్