డబ్ల్యూపీఎల్‌‌లో చాన్స్ రాకపోవడంతో నిరాశ చెందా: గొంగడి త్రిష

డబ్ల్యూపీఎల్‌‌లో చాన్స్ రాకపోవడంతో నిరాశ చెందా: గొంగడి త్రిష
  • ఈ వరల్డ్ కప్‌‌ నాకెంతో ముఖ్యం 
  • అమ్మాయిలు ఆటల్లోకి రావాలి
  •  అండర్‌‌‌‌19 టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ స్టార్ గొంగడి త్రిష

హైదరాబాద్, వెలుగు:
ఐసీసీ అండర్‌‌‌‌19 విమెన్స్‌‌ టీ20 వరల్డ్ కప్‌‌లో టీమిండియా వరుసగా రెండోసారి విజేతగా నిలవడంతో కీలక పాత్ర పోషించిన తెలంగాణ క్రికెటర్‌‌‌‌ గొంగడి త్రిష అందరి మన్ననలు అందుకుంటోంది. వరల్డ్ కప్‌‌లో టాప్ స్కోరర్‌‌‌‌గా నిలవడమే కాకుండా బౌలింగ్‌‌లోనూ రాణించిన భద్రాచలం అమ్మాయి టీమిండియా ఫ్యూచర్‌‌‌‌ స్టార్‌‌‌‌గా కనిపిస్తోంది. 

ఈ వరల్డ్ కప్‌‌ తనకెంతో ముఖ్యమైనదని ముందు నుంచీ అనుకున్నానని, తన ఆటతో జట్టును గెలిపించాలని కృత నిశ్చయంతో ఈ టోర్నీకి వచ్చానని త్రిష చెబుతోంది. తన తండ్రి వల్లే క్రికెట్ స్టార్ట్ చేశానని, ఆయన లేకుంటే తాను వరల్డ్ కప్‌‌ విన్నింగ్ టీమ్ మెంబర్‌‌గా నిలిచేదాన్ని కాదని చెప్పింది. ప్రస్తుతం క్రికెట్‌‌ అభివృద్ధి చెందుతూ విశ్వవ్యాప్తం అవుతోందని, ఈ ఆటలోకి మరింత మంది అమ్మాయిలు రావాలని త్రిష సూచించింది. క్రికెట్ అనే కాకుండా మహిళలు ఏదో ఆటను ఎంచుకోవాలని వరల్డ్ కప్ అందుకున్న  ఆనందంలో ఉన్న త్రిష  చెప్పింది. 

నాకు నేను ధైర్యం చెప్పుకున్నా..

డొమెస్టిక్ క్రికెట్‌‌, ఇండియా జూనియర్ టీమ్స్‌‌లో కొన్నాళ్లుగా నిలకడగా రాణిస్తున్నప్పటికీ డబ్ల్యూపీఎల్‌‌లో వరుసగా రెండు సీజన్లలో త్రిషకు అవకాశం లభించలేదు. వరల్డ్ టాప్ స్టార్లతో పాటు ఇండియాలోని యంగ్ క్రికెటర్లు బరిలో నిలిచే ఈ లీగ్‌‌లో చాన్స్ రాకపోవడంతో నిరాశకు గురైనప్పటికీ  మరింతగా రాణించేలా ఈ విషయం తనలో ప్రేరణ కలిగించిందని త్రిష చెప్పింది. ‘డబ్ల్యూపీఎల్‌‌కు అవకాశం లభించకపోవడంతో నేను బాధ పడ్డా. కానీ, ఈ లీగ్‌‌లో చాన్స్ దక్కించుకోవాలంటే నేను ఇంకా బాగా రాణించాలని నాకు నేను ధైర్యం చెప్పుకున్నా. ఈ వరల్డ్ కప్‌‌లో నా పెర్ఫామెన్స్‌‌ చాలా సంతృప్తి కలిగించింది.  బ్యాటింగ్‌‌తో పాటు బౌలింగ్‌‌లోనూ రాణించడం సంతోషాన్ని ఇచ్చింది’ అని పేర్కొంది.  

అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా 

మిథాలీ రాజ్‌‌ను అభిమానించే త్రిష వరల్డ్ కప్‌‌లో ఓపెనర్‌‌‌‌ పాత్రకు సంపూర్ణ న్యాయం చేసింది. గత ఎడిషన్‌‌లో కప్పు నెగ్గిన జట్టులో ఉన్నప్పటికీ త్రిషకు ఎక్కువగా అవకాశాలు రాలేదు. అయితే తాజా టోర్నీలో వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జట్టు తనకు అప్పగించిన కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తించేందుకు వంద శాతం కృషి చేశానని త్రిష చెప్పింది. ‘మెగా టోర్నీలో నాకు లభించిన అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకునే ప్రయత్నం చేశా. ఈ విషయంలో సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఉన్నా.  

ఈ టోర్నీ కోసం  ప్లేయర్లంతా తొమ్మిది నెలలుగా ఒక జట్టుగా కలిసి ట్రెయినింగ్ తీసకున్నాం. టీమ్‌‌లోని ప్రతీ ఒక్కరికి  ఒక్కో బాధ్యతను అప్పగించింది. మెగా టోర్నీలో వారి పాత్ర ఏమిటో మేనేజ్‌‌మెంట్‌‌ స్పష్టంగా వివరించింది. నాతో పాటు జట్టులో చాలా మంది తమకు అప్పజెప్పిన కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తించారు. దాని ఫలితమే ఈ విజయం’ అని త్రిష చెప్పుకొచ్చింది. 

విన్నింగ్ రన్ కొట్టాలని అనుకున్నా

 మెగా టోర్నీ కోసం తన ఆటలో ప్రత్యేకంగా ఎలాంటి మార్పులు చేసుకోలేదని, నిలకడగా ఆడుతూ, తన పూర్తి సామర్థ్యాన్ని చూపెట్టాలని అనుకున్నానని త్రిష తెలిపింది. ‘ ఈ వరల్డ్ కప్‌‌ నాకు చాలా ముఖ్యం. విన్నింగ్ షాట్ కొట్టి  ఇండియాను గెలిపించాలని ముందు నుంచి అనుకున్నా. గత ఎడిషన్‌‌ ఫైనల్లో ఆడినా విన్నింగ్ రన్‌‌ కొట్టలేకపోయాను. మూడు రన్స్‌‌ అవసరమైన టైమ్‌‌లో ఔటయ్యా. ఈసారి మా టీమ్ టైటిల్ నెగ్గే వరకూ నేను క్రీజులో ఉన్నందుకు చాలా సంతృప్తిగా అనిపిస్తోంది.  ఈ టోర్నీ కోసం  బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ నా టెక్నిక్‌‌లో ఎటువంటి సర్దుబాట్లు చేయలేదు. ఆటపైనే పూర్తి ఫోకస్ పెట్టినిలకడగా ఆడాలని, నా పూర్తి సామర్థ్యాన్ని మైదానంలో చూపెట్టాలని అనుకున్నా’ అని భద్రాచలం క్రికెటర్ పేర్కొంది.

ఇక సీనియర్ లెవెల్‌‌పై ఫోకస్‌‌

ఇండియా అండర్‌‌‌‌19 టీమ్ తరఫున వరుసగా రెండు వరల్డ్ కప్‌‌లు అందుకోవడంతో పాటు ఆసియా కప్​టీ20 టోర్నమెంట్‌‌లోనూ ఇండియాను విజేతగా నిలిపిన త్రిష ఇకపై సీనియర్‌‌‌‌ లెవెల్లో లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని అంటోంది. సీనియర్ లెవెల్‌‌కు వెళ్లే ముందు ఆడిన  తన చివరి అండర్-19 మ్యాచ్‌‌లో  ఇండియాకు ట్రోఫీ అందించడం తనకెంతో ప్రత్యేకమైనదని చెప్పింది. ఈ ఏడాది విమెన్స్ వన్డే వరల్డ్ కప్‌‌ ఇండియాలోనే జరగనుంది. ఇందులో పాల్గొనే ఇండియా సీనియర్‌‌‌‌ విమెన్స్ జట్టులో చోటు దక్కితే తన మార్కు చూపెట్టాలని త్రిష ఆతృతగా ఉంది.

ఎప్పటికీ గుర్తుంటుంది..

 ఏడు ఇన్నింగ్స్‌‌లలో 309 పరుగులు చేసి, తన లెగ్-స్పిన్‌‌తో తొమ్మిది వికెట్లు పడగొట్టిన త్రిష కీలక మ్యాచ్‌‌ల్లో రాణించి జట్టు విజయాలకు కృషి చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. ‘సెమీఫైనల్, ఫైనల్‌‌లో జట్టు విజయానికి తోడ్పడటం నాకు ప్రత్యేకంగా అనిపించింది. అయితే స్కాట్లాండ్‌‌పై సెంచరీ నాకెంతో స్పెషల్. అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని తెలిపింది.