
- జిల్లా నేతలకు దక్కని అవకాశం
- పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి
సిద్దిపేట, వెలుగు : ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం 37 కార్పొరేషన్పదవులు ప్రకటిస్తే అందులో జిల్లా కాంగ్రెస్ నేతలకు ఎవ్వరికీ అవకాశం దక్కలేదు. దాదాపు డజన్ మంది నాయకులు ఈ పోస్టుల కోసం ట్రై చేస్తే ఒక్కరికీ చోటు దక్కలేదు. బీఆర్ఎస్ కు పట్టున్న సిద్దిపేట జిల్లా నుంచి నామినేటెడ్ పోస్టులు లభిస్తే వచ్చే పార్లమెంట్ఎన్నికల్లో పార్టీ పటిష్టతకు అవకాశం ఏర్పడుతుందని నేతలు భావిస్తున్నా ఆ దిశగా అడుగులు పడలేదు.
జిల్లాలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాలుండగా కేవలం హుస్నాబాద్ నుంచి మాత్రమే పొన్నం ప్రభాకర్ గెలుపొంది మంత్రి పదవి చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లా నుంచి పది మంది వరకు రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులు పొందగా కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు పదవులు లభిస్తాయని ఆశించిన నేతలకు నిరాశే మిగిలింది.
నేతలను ప్రసన్నం చేసుకున్నా..
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జిల్లాకు చెందిన ముఖ్య నేతలు నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్ర స్థాయిలో తమకు గాడ్ ఫాదర్లుగా భావించే నేతల దగ్గరకు వెళ్లి పార్టీకోసం కష్టపడిన తీరును వివరించి అవకాశం కల్పించాలని మొరపెట్టుకున్నారు. అయినప్పటికీ జిల్లాకు ఒక్క పోస్టు దక్కకపోవడంతో పార్టీ శ్రేణులో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
మరికొందరు కనీసం కార్పొరేషన్ సభ్యుడిగానైనా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాతైనా తమకు అవకాశం దక్కక పోతుందా అనే ఆలోచనల్లో మరికొందరు నేతలు ఉన్నారు.
మార్కెట్ కమిటీలపై ఆశలు
రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు దక్కకపోవడంతో కొందరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. జిల్లాలోని13 ఏఎంసీ మార్కెట్ కమిటీలకు ఇటీవలే ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఏఎంసీల్లో రిజర్వేషన్ అనుకూలించకుంటే తమ కుటుంబ సభ్యులకు అవకాశం లభించేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
మార్కెట్ కమిటీలతో పాటు సుడా, రైతు సమన్వయ సమితి, జిల్లా గ్రంథాలయ సంస్థల్లోనైనా అవకాశం దక్కించుకోవాలని భావిస్తున్నారు. బీఆర్ఎస్ కు కంచుకోట లాంటి సిద్దిపేట జిల్లాలో వారికి ధీటుగా పనిచేయాలంటే నామినేటెడ్ పోస్టులు కేటాయించాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి.