న్యూఢిల్లీ: మ్యారేజ్ కి ఒప్పుకోనంత మాత్రాన ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు కాదని సుప్రీంకోర్టు తెలిపింది. దీన్ని ఐపీసీ 306 కింద నేరంగా పరిగణించలేమని చెప్పింది. ఓ మహిళపై నమోదైన చార్జ్ షీట్ ను కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మతో కూడిన డివిజన్ బెంచ్ ఆదివారం తీర్పు ఇచ్చింది. ఓ యువతి, యువకుడు ప్రేమించుకోగా.. అతడు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో ఆ యువకుడి తల్లిపై కేసు నమోదైంది. ఆమె పెళ్లికి ఒప్పుకోలేదని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. యువతి ఆత్మహత్యకు ఆమెనే కారణమంటూ కేసు పెట్టారు.
దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ‘‘రికార్డుల్లోని అన్ని సాక్ష్యాధారాలు నిజమైనవే అనుకున్నా.. నిందితురాలికి వ్యతిరేకంగా ఒక్క చిన్న సాక్ష్యం కూడా లేదు. తనకు చావు తప్ప మరో మార్గం లేదని, తన చావుకు తాను ప్రేమించిన వ్యక్తి తల్లే కారణమని యువతి ఎలాంటి ఆరోపణలు చేయలేదు. తన కొడుకుతో బంధాన్ని తెంచుకోవాలని యువతిపై నిందితురాలు గానీ, ఆమె కుటుంబసభ్యులు గానీ ఒత్తిడి చేయలేదు.
అంతేకాకుండా ఈ ప్రేమ వ్యవహారంపై యువతి తల్లిదండ్రులు అసంతృప్తిగా ఉన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న నేపథ్యంలో.. ఒకవేళ నిందితురాలు తన కొడుకు మ్యారేజ్ కి ఒప్పుకోకపోయినా, యువతిని ఆత్మహత్యకు ఆమె ప్రేరేపించినట్టు కాదు” అని పేర్కొంది.