ప్రపంచ వ్యాప్తంగా 1992 నుంచి 2001 మధ్యకాలంలో వివిధ విపత్తుల వల్ల మరణించిన వారిలో భూకంపాలు (16 శాతం), కరువులు (45 శాతం), వడగాలులు (10 శాతం), వరదలు (12 శాతం) మరణించారు. ఈ విధమైన ప్రమాదాలను పరిశీలించిన ఐక్యరాజ్య సమితి 1990 – 2000 దశాబ్దాన్ని విపత్తు నివారణ దశాబ్దంగా ప్రకటించింది. ఈ సమయంలో అన్ని దేశాలు విపత్తుల నివారణకు సమగ్ర ప్రణాళికను రూపొందించి కృషి చేయాలని సూచించారు.
మన దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో 28 ప్రాంతాలు విపత్తులకు గురవుతున్నాయి. భారత్‌కు ఉన్న 7516 కి.మీ.ల తీరరేఖలో దాదాపు 5700 కి.మీ. పొడవునా తుపాన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవులు ఎక్కువగా తుపాను బారిన పడుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల దేశ జీడీపీలో 2 శాతం నష్టం వాటిల్లుతున్నదని ప్రపంచ బ్యాంక్ అంచనా. 1980–2010 మధ్యకాలంలో ప్రకృతిసిద్ధ విపత్తుల వల్ల దేశంలో దాదాపు 1,43,039 మంది మరణించారు. కొన్ని లక్షల మంది నిర్వాసితులయ్యారు.
అంతర్జాతీయ విపత్తు నిర్వహణ సంస్థలు
ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్యునెస్కోకు చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రాఫిక్ కమిషన్ (ఐఓసీ) ఆధ్వర్యంలో 1965లో ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని హవాయి రాష్ట్రం హోనోలులో ఉంది.
ఏషియన్ డిజాస్టర్ రిడక్షన్ సెంటర్
ఈ సంస్థను 1998లో జపాన్‌లోని కోబ్ నగరంలో ఏర్పాటు చేశారు.
పసిఫిక్ ప్రాంతంలో సునామీ హెచ్చరిక సమన్వయ గ్రూపు
ఈ సంస్థను 1968లో జపాన్‌లోని కోబ్ నగరంలో ఏర్పాటు చేశారు.
ఆసియా డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ సెంటర్
ఈ సంస్థను 1986, జనవరిలో థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ కేంద్రంగా ఏర్పాటు చేశారు.
ప్రపంచ వాతావరణ సంస్థ
ఇది ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. భూగోళ వాతావరణాన్ని పర్యవేక్షిస్తుంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది.
సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్
ఈ సంస్థను 2006, అక్టోబర్లో న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆవరణలో ఏర్పాటు చేశారు.
ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ ఈ సంస్థను ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1999, డిసెంబర్లో ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది.
అవేర్నెస్ అండ్ ప్రిపేర్డ్నెస్ ఫర్ ఎమర్జెనీస్ ఎట్ లోకల్ లెవల్
ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్ఈపీ) ప్రభుత్వాలు, పారిశ్రామిక వర్గాలతో కలిసి సాంకేతిక ప్రమాదాలు, పర్యావరణ అత్యవసర పరిస్థితులు సంభవించకుండా తగ్గించడానికి, వాటివల్ల జరిగే హానికర ప్రభావాలను కుదించడానికి అవేర్నెస్ అండ్ ప్రిపేర్డ్నెస్ ఫర్ ఎమర్జెనీస్ ఎట్ లోకల్ లెవల్(ఏపీఈఎల్ఎల్)ను రూపొందించారు.
ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్
ఈ సంస్థను 1988లో ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఏ), ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్ఈపీ)లు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ఉంది.
పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్
ఈ సంస్థనే అంతర్జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం అని కూడా అంటారు. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని హవాయి రాష్ట్రం ఇవా బీచ్ వద్ద ఉంది. దీనిని అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అంట్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహిస్తోంది. ఈ సంస్థను 1948లో ఏర్పాటు చేశారు. 2004లో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ అనంతరం ఈ కేంద్రం సేవలను హిందూ మహాసముద్రం, కరేబియన్, చుట్టు పక్కల ప్రాంతాలకు కూడా విస్తరించారు.
అకాడమీ ఫర్ డిజాస్టర్ ప్లానింగ్ అండ్ ట్రైనింగ్
ఇది చెన్నైలో ఏర్పాటైన ప్రభుత్వేతర సంస్థ. విపత్తు నిర్వహణ రంగంలో శిక్షణ కోర్సులు అందించడంతోపాటు ప్రణాళికలు రూపొందిస్తుంది.
ఇంటర్నేషనల్ రెడ్‌క్రాస్, రెడ్ క్రీసెంట్ సొసైటీ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది.
ఎర్త్‌క్వేక్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్‌లో ఉంది.
విపత్తు నిర్వహణ చట్రం
విపత్తు సంభవించబోయే ముందు, విపత్తు జరుగుతున్న సమయం, విపత్తు జరిగిన తర్వాత.. చేపట్టే అన్ని రకాల సహాయక చర్యలు ఆస్తి, ప్రాణ, సామాజిక, ఆర్థిక నష్టాలను నివారించే చర్యలు మొత్తం విపత్తు నిర్వహణ చట్రం కిందికి వస్తాయి. విపత్తు నష్ట నివారణలో భాగంగా చేపట్టే మూడు దశల కార్యకలాపాలు ఈ విధంగా ఉన్నాయి.
విపత్తుకు ముందు: సంభావ్య విపత్తు వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించేందుకు చేపట్టే చర్యలు. ఉదాహరణకు ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టడం, ప్రస్తుతం బలహీనంగా ఉన్న నిర్మాణాలను మరింత పటిష్టం చేయడం, కుటుంబాలు సామాజిక స్థాయిల్లో విపత్తు నిర్వహణా ప్రణాళికలను రూపొందించడం వంటివి విపత్తుకు ముందు చేపట్టే చర్యల కిందికి వస్తాయి. ఈ విధంగా నష్ట నివారణకు చేపట్టే చర్యలను ఉపశమన లేదా సంసిద్ధతా చర్యలు అని వ్యవహరిస్తారు.
విపత్తు సమయం: విపత్తు జరుగుతున్న సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితుల అవసరాలను తీరుస్తూ వారి కష్టాలను సాధ్యమైనంత వరకు కనీస స్థాయికి కుదించడమే లక్ష్యంగా విపత్తు సమయంలో తీసుకొనే చర్యలు ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. ఈ సమయంలో చేపట్టే సహాయక చర్యలను అత్యవసరంగా చేపట్టేవిగా పరిగణిస్తారు.
విపత్తు తర్వాత: విపత్తు సంభవించిన తర్వాత బాధిత సమాజంలో ని ప్రజలకు తక్షణం చేపట్టే సహాయ, పునరావాస చర్యలు ఈ విధానం కిందికి వస్తాయి. వీటినే స్పందన, తిరిగి కోలుకోవడానికి చేపట్టే చర్యలుగా పరిగణిస్తారు.
అంతర్జాతీయ విపత్తు కుదింపు దినోత్సవం
ప్రతి సంవత్సరం అక్టోబర్ 13వ తేదీని అంతర్జాతీయ విపత్తు కుదింపు దినోత్సవంగా జరుపుకుంటారు.
2009, డిసెంబర్ 21న ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ 2010 నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ 13ను అంతర్జాతీయ విపత్తు కుదింపు దినోత్సవంగా పాటించాలని నిర్ణయించింది.
2009 వరకు ప్రతి సంవత్సరం అక్టోబర్లోని రెండో బుధవారాన్ని అంతర్జాతీయ విపత్తుల కుదింపు దినోత్సవంగా జరుపుకునేవారు.