- చైర్మన్‌గా కొనసాగనున్న డి.వెంకటేశ్వరరావు
- కోరం లేకుండా చేయడంలో సక్సెస్ అయిన కాంగ్రెస్
- అధికార పార్టీ, బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట
- హైడ్రామా, నిరసనలతో ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు
- ఎమ్మెల్యే కనకయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ లీడర్లపై బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఫిర్యాదు
భద్రాద్రికొత్తగూడెం/ ఇల్లెందు, వెలుగు : ఇల్లెందు మున్సిపాలిటీ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. సోమవారం తోపులాట, నిరసనలు, హైడ్రామాల మధ్య ఈ కార్యక్రమం ముగిసింది. బీఆర్ఎస్కు మెజార్టీ ఉన్నా కోరం లేకుండా చేయడంలో కాంగ్రెస్, సీపీఐ లీడర్లు సక్సెస్ అయ్యారు. దాదాపు రెండు వారాల పాటు క్యాంప్‌లో ఉంచి కౌన్సిలర్లను కాపాడుకున్న బీఆర్ఎస్ నేతలు చివరిక్షణంలో ఫెయిల్ అయ్యారు.
జరిగింది ఇదీ..
భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపాలిటీలో 24 మంది కౌన్సిలర్లున్నారు. బీఆర్ఎస్ నుంచి 19మంది కౌన్సిలర్లు, ముగ్గురు ఇండిపెండెంట్లు, న్యూడెమోక్రసీ, సీపీఐ పార్టీల నుంచి ఒక్కొక్క కౌన్సిలర్ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు చెందిన మున్సిపల్ చైర్మన్ దమ్మాల పాటి వెంకటేశ్వరరావుతో పాటు కొందరు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు.
దీంతో చైర్మన్‌పై బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసం పెడుతూ కలెక్టర్‌కు గత నెలలో లేఖ ఇచ్చారు. ఈ క్రమంలో సోమవారం అవిశ్వాసంపై స్పెషల్ మీటింగ్ పెడుతున్నట్టు కలెక్టర్ ప్రకటించి కౌన్సిలర్లకు నోటీసులు ఇచ్చారు.
అంతా రహస్యం..
కలెక్టర్ నుంచి చైర్మన్‌పై అవిశ్వాసం నోటీస్ రాగానే బీఆర్ఎస్ లీడర్లు అలర్ట్ అయ్యారు. సీపీఐ కౌన్సిలర్ రవీందర్‌తో పాటు 14 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లను తీసుకొని గోవాలో బీఆర్ఎస్ లీడర్లు క్యాంప్ పెట్టారు. మరో బీఆర్ఎస్ కౌన్సిలర్లు మడత రమ, అనిత రెండు రోజుల కిందట క్యాంప్‌లో జాయిన్ అయ్యారు. వారు ఎక్కడ ఉన్న విషయాన్ని బయటికి లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
సోమవారం జరిగే అవిశ్వాసం మీటింగ్ సమయానికి అక్కడికి చేరుకుంటామని లీకులు ఇచ్చారు. కానీ ఆదివారం సాయంత్రమే మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఉన్న పెన్షనర్స్ బిల్డింగ్‌కు గుట్టు చప్పుడు కాకుండా క్యాంప్‌లో ఉన్న కౌన్సిలర్లంతా చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం 10.15 గంటల వరకు వారు అక్కడ ఉన్న విషయం ఎవరికీ తెలియకపోవడం గమనార్హం.
హైడ్రామా.. ఉద్రిక్తత
అవిశ్వాసంపై స్పెషల్ మీటింగ్‌కు అటెండ్ అయ్యేందుకు సీపీఐ కౌన్సిలర్‌తో కలిసి బీఆర్ఎస్ కౌన్సిలర్లు పెన్షనర్స్ బిల్డింగ్ నుంచి 10.20 గంటలకు ఒక్కొక్కరు బయటకు వస్తుండడాన్ని కాంగ్రెస్ నాయకులు గమనించారు. మొదట వచ్చిన కౌన్సిలర్ జేకే శ్రీను, తోట లలిత శారదను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు యత్నించగా వారు గొడవ పడుతూ అక్కడి నుంచి మున్సిపల్ ఆఫీస్‌లోకి వెళ్లారు.
ఇదే క్రమంలో చివరలో వచ్చిన కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావు మున్సిపల్ ఆఫీస్‌లోకి ఎమ్మెల్యే కోరం కనకయ్య పక్క నుంచి వెళ్తుండగా ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ లీడర్లు ఆయనను అడ్డుకొని ఎదురుగా ఉన్న ఎంపీడీఓ ఆఫీస్‌లోకి లాక్కెళ్లారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్ల మధ్య తోపులాట సాగింది. అంతకుముందు ఎంపీడీఓ ఆఫీస్‌లో బీఆర్ఎస్ లీడర్ హరిప్రియతో పాటు కొక్కు నాగేశ్వరరావు కొంత సేపు అక్కడే ఉన్నారు.
టైం అవుతుండడంతో కొక్కు నాగేశ్వరరావు బయటకు రాగానే బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనను అడ్డుకునే అక్కడి నుంచి లాక్కెళ్లారు. సీపీఐ కౌన్సిలర్ రవీందర్ మీటింగ్ అటెండ్ అయ్యేందుకు మున్సిపల్ ఆఫీస్‌లోకి రాగానే అక్కడే ఉన్న కొందరు ఆయనపై దాడి చేశారు. ఆయనను లాక్కెళ్లి మున్సిపల్ ఆఫీస్ వెనుక గోడ మీద నుంచి బయటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో రవీందర్‌కు గాయాలయ్యాయి.
కౌన్సిలర్ల నిరసన..
కౌన్సిల్ మీటింగ్‌లోకి బీఆర్ఎస్కు చెందిన 15 మంది కౌన్సిలర్లు మాత్రమే అటెండ్ అయ్యారు. 24 మంది ప్రజాప్రతినిధులున్నా ఈ కౌన్సిల్లో అవిశ్వాసంపై చర్చ సాగాలంటే 17 మంది అటెండ్ కావాల్సి ఉంది. 15 మంది కౌన్సిలర్లు మాత్రమే అటెండ్ అయ్యారు. మరో ఇద్దరు కౌన్సిలర్లు వస్తారని చెప్పగా ఆర్డీఓ వారికి కొంత టైం ఇచ్చారు. అయినా రాకపోవడంతో కోరం లేనందున చైర్మన్ డి. వెంకటేశ్వరరావుపై పెట్టిన అవిశ్వాసం వీగిపోయిందని ఆమె ప్రకటించారు. దీంతో లోపల ఉన్న 15 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపాలిటీ ఆఫీస్ బయటికి వచ్చి మాజీ ఎమ్మెల్యే భానోత్ హరిప్రియతో కలిసి ధర్నా చేశారు.
పోలీసులు, ఆఫీసర్లు కాంగ్రెస్ లీడర్ల అరాచకాలకు మద్దతు పలికారంటూ ఆరోపించారు. అంతకుముందు బీఆర్ఎస్ కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావును కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేశారంటూ ఆయన భార్య లక్ష్మితో పాటు కూతురు, కో ఆప్షన్ మెంబర్ సరిత మున్సిపల్ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. తన భర్తను కాంగ్రెస్ నాయకులు హత్య చేస్తారని లక్ష్మి ఆరోపించారు. అవిశ్వాసం మీటింగ్ అనంతరం కాంగ్రెస్ లీడర్ల ఆధీనంలో ఉన్న కొక్కు నాగేశ్వరరావు బయటికి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
ఎమ్మెల్యేపై పోలీసులకు కంప్లైంట్..
తమను కౌన్సిల్ మీటింగ్‌కు వెళ్లకుండా ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటుయ పలువురు కాంగ్రెస్ లీడర్లు అడ్డుకున్నారని, తమ కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావును కిడ్నాప్ చేశారని పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు పోలీసులకు కంప్లైంట్ చేశారు. తన భర్త నాగేశ్వరరావును కాంగ్రెస్ లీడర్లు కిడ్నాప్ చేశారంటూ ఆయన భార్య లక్ష్మి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ లీడర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఆఫీస్ ఎదుట పోలీస్‌లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.