- 31 మంది కౌన్సిలర్లకు 21 మంది మద్దతు
కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ మున్సిపాలిటీ చైర్మన్ మహమ్మద్ సద్దాం హుస్సేన్, వైస్ చైర్మన్ గిరీశ్ కుమార్ మీద కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. చైర్మన్, వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం కోసం మున్సిపల్ ఆఫీస్‌లో ప్రత్యేక అధికారి, కాగజ్ నగర్ ఆర్డీవో కాసబోయిన సురేశ్ అధ్వర్యంలో శనివారం ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. 30 మంది కౌన్సిలర్లు, ఓ ఎక్స్ అఫీషియో సభ్యుడితో కలిపి 31 మంది సభ్యులు ఉండగా, మీటింగ్‌కు 23 మంది హాజరుకాగా.. వైస్ చైర్మన్ గైర్హాజరయ్యారు.
నెగ్గేందుకు 21 మంది సభ్యులు అవసరం కాగా, కోరం ఉండడంతో ఆర్డీవో సమావేశం నిర్వహించారు. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్‌కు వ్యతిరేకంగా ఉన్న 21 మంది కౌన్సిలర్లు హైదరాబాద్‌లో ఉన్న క్యాంప్ నుంచి నేరుగా ఆఫీస్‌కు చేరుకున్నారు. వారంతా అవిశ్వాసాన్ని సమర్థిస్తూ చేతులు పైకి ఎత్తడంతో నెగ్గినట్లు ఆర్డీవో ప్రకటించారు. మున్సిపాలిటీలో మెజారిటీ ఉన్న బీఆర్ ఎస్ నుంచి చైర్మన్‌గా కొనసాగుతున్న సద్దాం హుస్సేన్, వైస్ చైర్మన్ గిరీశ్ కుమార్‌పై అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టి వారిని దింపేయడం గమనార్హం.