- ఏండ్లుగా ఎదురు చూస్తున్నా అవకాశాల్లేవని అసంతృప్తి
- నామినేటెడ్ పోస్టుల్లేవు, పార్టీ పదవుల్లేవని అసహనం
- మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్న కొందరు అసంతృప్తులు
ఖమ్మం, వెలుగు: కొన్నేండ్లుగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయకపోవడంపై ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లోని బీఆర్ఎస్నేతల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. ఎలాంటి పదవి లేకుండానే పార్టీ కోసం పనిచేస్తున్నా, తగిన గుర్తింపు రావడం లేదని కొందరు మనోవేదనకు గురవుతున్నారు. గతంలో ఏదో ఒక పదవిలో కొనసాగి, తర్వాత మాజీలుగా మిగిలిపోయామని బాధపడుతున్నారు. వెంట తిప్పుకుంటున్న తమకెందుకు నామినేటెడ్ పోస్టులు ఇప్పించడం లేదని పార్టీ ముఖ్య నేతలను నిలదీస్తున్నారు. హైకమాండ్‌కు రిఫర్‌చేసి ఏదో ఒక పోస్టు ఇప్పించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
పోస్టులు ఖాళీ అయినా తిరిగి భర్తీ చేయకపోవడం, ఒకటే సామాజికవర్గానికి చెందిన వారికి ఎక్కువ పదవులిచ్చారనే అసంతృప్తిలో కొందరు నేతలు ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో కనీసం ఇప్పుడైనా ఏదో ఒక పోస్ట్ఇప్పించాలంటూ ముఖ్య నేతలను వేడుకుంటున్నారు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో మంత్రి హరీశ్‌రావును కొందరు కలిసి రిక్వెస్ట్ చేశారు. శనివారం ఖమ్మంకు వస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు మరికొందరు రెడీ అవుతున్నారు.
గాడ్ఫాదర్ల ద్వారా వర్కవుట్ కాలే
ఉమ్మడి జిల్లాకు చెందిన కొందరు నేతలు రాష్ట్ర స్థాయి నామినెటెడ్పోస్టుల్లో ఉండగా, మరికొన్ని వేర్వేరు కారణాలతో ఖాళీ అయ్యాయి. స్టేట్సీడ్డెవలప్ మెంట్ కార్పొరేషన్చైర్మన్గా దాదాపు ఎనిమిదేళ్ల నుంచి కొండబాల కోటేశ్వరరావు కొనసాగుతున్నారు. సుడా చైర్మన్‌గా బచ్చు విజయ్మూడేళ్లుగా పదవిలో ఉన్నారు. అంతకు ముందు స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బుడాన్‌బేగ్ ఉండగా, 2018 ఎన్నికల సమయంలో ఆయన రాజీనామా చేసి టీడీపీలో చేరారు. కొన్ని నెలలకే తిరిగి పార్టీలోకి వచ్చిన ఆయన చనిపోయారు. అప్పట్లో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న పిడమర్తి రవి, 2018 ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి పోటీ చేసేందుకు గాను పదవికి రాజీనామా చేసినా, ఎలక్షన్లలో ఓడిపోయారు.
రాష్ట్ర మార్క్ఫెడ్వైస్ చైర్మన్‌గా ఉన్న బొర్రా రాజశేఖర్ఇటీవల మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెంట కాంగ్రెస్‌లో చేరడం కోసం ముందుగానే తన పదవికి రాజీనామా చేశారు. రెండేళ్ల పదవి కాలం పూర్తయ్యాయక, తిరిగి సుడా చైర్మన్‌గా బచ్చు విజయ్ను కొనసాగించడంతో ఆ పోస్టు మీద ఆశలు పెట్టుకున్న లీడర్లు తమ గాడ్ఫాదర్ల ద్వారా చేసిన ప్రయత్నాలు వర్కవుట్ కాలేదు. ఏదో ఒక రాష్ట్ర స్థాయి నామినేటెడ్పోస్టు వస్తుందని ఆశలు పెట్టుకున్న వారి సంఖ్య భారీగానే ఉంది. రకరకాల సందర్భాల్లో పార్టీ ముఖ్య నేతల నుంచి వచ్చిన హామీలతో తమకు పదవి దక్కుతుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారు.
మాజీ ఎమ్మెల్సీకి ఎదురుచూపులు
మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పదవీకాలం పూర్తయ్యాక, ఏదో ఒక పోస్టు వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. రెండేళ్లవుతున్నా ఆయనకు ఎదురుచూపులు తప్పడం లేదు. భద్రాచలం పార్టీ ఇన్చార్జి పదవి ఇచ్చినట్టే ఇచ్చి తప్పించడంతో అసంతృప్తితో ఉన్నారు. బీఆర్ఎస్లో సీనియర్ నేత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్గుండాల కృష్ణ(ఆర్జేసీ కృష్ణ) చాలా ఏళ్లుగా నామినేటెడ్పోస్టు కోసం ఎదురుచూస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఆయన ఖమ్మం బీఆర్ఎస్అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.
మూడేళ్ల కింద జిల్లా పార్టీ ఆఫీస్ఇన్చార్జిగా ఆయన్ను నియమించారు. ఆ సమయంలో ఆ పదవి తీసుకునేందుకు వెనుకంజ వేయడంతో స్వయంగా కేటీఆర్ఫోన్చేసి జిల్లా అధ్యక్ష పదవి మీకే ఇస్తామని, అప్పటి వరకు ఆఫీస్ఇన్చార్జిగా ఉండాలని కన్విన్స్చేశారు. ఆ తర్వాత జిల్లా పార్టీ బాధ్యతలు మరొకరికి అప్పగించడంతో కృష్ణకు షాక్తగిలింది. అప్పటి నుంచి నామినేటెడ్ పోస్టు కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.
మరో నేత కమర్తపు మురళి ఖమ్మం సిటీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, వేరొకరికి ఆ పదవి అప్పగించారు. రెండుసార్లు కార్పొరేటర్ గా ఎన్నికైన తనకు మంచి నామినేటెడ్పోస్టు వస్తుందన్న ఆశతో ఆయన ఉన్నారు. గతంలో సుడా చైర్మన్ రేసులో పేరు వినిపించినా, మార్పులు చేయకపోవడంతో మొండిచేయి తప్పలేదు. గుండాల కృష్ణ, కమర్తపు మురళికి నామినేటెడ్ పోస్టుల కోసం కొన్ని నెలల కిందే సీఎం కేసీఆర్ కు మంత్రి పువ్వాడ అజయ్సిఫారసు చేశారని సమాచారం. ఇక ఉద్యమకారుడు, 2014లో మధిర బీఆర్ఎస్అభ్యర్థిగా పోటీచేసి ఓడిన బొమ్మెర రామ్మూర్తి కూడా నామినేటెడ్ పదవి ఆశిస్తున్నారు.
పోస్టుల భర్తీ చర్చనీయాంశం
పదవులు వచ్చిన వారు అవే పదవుల్లో ఏళ్ల తరబడి కొనసాగుతుండగా, వెయిటింగ్ లిస్టులో ఉన్నోళ్లకు మాత్రం ఎదురుచూపులు తప్పడం లేదని నాయకులు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల జరిగిన ఇంటర్నల్మీటింగులో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఓ నేత కాస్త గట్టిగానే మాట్లాడినట్టు సమాచారం. ఇన్నేళ్ల నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న తాము పదవి ఆశించడం తప్పెలా అవుతుందని ప్రశ్నించినట్టు తెలిసింది. మ్యాచ్గెలవాలంటే ఒక్క ప్లేయర్ఆడితే సరిపోదని, టీమ్ అంతా కలిసి ఆడితేనే గెలుస్తామంటూ కామెంట్ చేసినట్టు సమాచారం. దీంతో నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం బీఆర్ఎస్లీడర్లు, కార్యకర్తల్లో మరోసారి చర్చనీయాంశమైంది.