
- గత 6 నెలల్లో అదానీ గ్రీన్ ఎనర్జీ 55 శాతం డౌన్..
- టాటా మోటార్స్, హీరో, బజాజ్ ఆటో షేర్లు 30 శాతానికి పైగా పతనం
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్‌లో గ్రేట్ ఇండియన్ సేల్ నడుస్తోంది. టాప్ కంపెనీల షేర్లపై భారీ డిస్కౌంట్ దొరుకుతోంది. ట్రంప్ టారిఫ్ వార్ మొదలు పెట్టడంతో టాప్ కంపెనీల షేర్లు గత ఆరు నెలల్లో సగటున 25 శాతం పడ్డాయి. కొన్ని షేర్లయితే 55 శాతం వరకు నష్టపోయాయి. ఇందులో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ముందున్నాయి. గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై కిందటేడాది యూఎస్‌లో లంచం కేసు నమోదు కావడంతో అదానీ షేర్లు పడడం మొదలు పెట్టాయి.
రికవర్ అవ్వడానికి కష్టపడుతున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు గత ఆరు నెలల్లో 55 శాతం పతనయ్యాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 25 శాతం పడగా, అదానీ పోర్ట్స్ షేర్లు 20 శాతం పడ్డాయి. జో బైడెన్ గవర్నమెంట్ గౌతమ్ అదానీపై లంచం కేసు పెట్టగా, తాజా ట్రంప్ ప్రభుత్వం ఈ కేసులపై దర్యాప్తును తాత్కాలికంగా ఆపింది. దీంతో ఈ గ్రూప్ కంపెనీల షేర్లు కోలుకుంటున్నాయి. వీటితో పాటు కిర్లోస్కర్ ఆయిల్ (50 శాతం డౌన్), తాన్లా ప్లాట్‌ఫామ్స్ (50 శాతం), నాట్కో ఫార్మా (47 శాతం), రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ (45 శాతం), స్టార్ హెల్త్ (42 శాతం), ఎన్‌సీసీ (41 శాతం), ఆయిల్ ఇండియా (41 శాతం), సన్ ఫార్మా (39 శాతం), పీవీఆర్ (38 శాతం) వంటి టాప్ కంపెనీల షేర్లు కూడా గత ఆరు నెలల్లో భారీగా పతనమయ్యాయి.
కార్ల కంపెనీలకు గండం
టెస్లా కార్లపై కస్టమ్స్ డ్యూటీ పూర్తిగా ఎత్తేస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సుంకాలను పూర్తిగా తొలగించకపోయినా కార్ల దిగుమతులపై డ్యూటీని కేంద్రం భారీగా తగ్గిస్తుందనే అంచనాలు ఉన్నాయి. దీనిపై యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పటికే ప్రధాని మోదీతో చర్చించారు. దీంతో వెహికల్ తయారీ కంపెనీల షేర్లు నష్టపోతున్నాయి. గత ఆరు నెలల్లో టాటా మోటార్స్ షేర్లు 38 శాతం పడగా, బజాజ్ ఆటో షేర్లు 30 శాతం నష్టపోయాయి. హీరో మోటోకార్ప్ 36 శాతం, సంవర్ధన మదర్సన్ 32 శాతం, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ 31 శాతం, భారత్ ఫోర్జ్ 30 శాతం, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ షేర్లు 26 శాతం పడ్డాయి.
రిస్క్ తీసుకోకూడదనుకునే వారు సాధారణంగా లార్జ్ క్యాప్‌లలో ఇన్వెస్ట్ చేస్తారు. తాజా మార్కెట్ కరెక్షన్‌లో ఇవి కూడా పడ్డాయి. మరోవైపు డిస్కౌంట్‌కు దొరుకుతున్న క్వాలిటీ షేర్లలో ఇన్వెస్ట్ చేయాలని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. మార్కెట్ పడుతున్న టైమ్‌లో లార్జ్ క్యాప్ షేర్లు ఇన్వెస్టర్లకు రక్షణగా ఉంటాయని వీఎస్‌ఆర్‌కే క్యాపిటల్ డైరెక్టర్ స్వప్నిల్ అగర్వాల్ పేర్కొన్నారు. మిడ్, స్మాల్ క్యాప్ షేర్లతో పోలిస్తే ఇవి తక్కువగా నష్టపోతాయని అన్నారు. అదే రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడితే క్వాలిటీ మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో ఇన్వెస్ట్ చేయొచ్చని చెప్పారు.