దేవుడిగుట్టపై రాతి పనిముట్ల పరిశ్రమ గుర్తింపు 

దేవుడిగుట్టపై రాతి పనిముట్ల పరిశ్రమ గుర్తింపు 

తిమ్మాపూర్, వెలుగు: తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం దేవునిగుట్టపై ఆదివాసుల రాతి పనిముట్ల పరిశ్రమను గుర్తించినట్లు డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి తెలిపారు. గుట్టకు వాయువ్య దిశలో ‘పోచమ్మ మెట్ట’ అని పిలిచే సమతల ప్రాంతంలోని శిలపై చాలా గ్రూవ్స్ ఉన్నాయన్నారు. గ్రూవ్స్ అంటే తెలంగాణలో సిర్రగోనె ఆడే ఆటలో నేలమీద బద్ది తవ్వుకున్నట్టు ఉంటాయనీ, గుట్టపై 42 సెంటీమీటర్ల పొడవులో ఇవి ఉండటం ఇక్కడి విశేషమని చెప్పారు.

పొడవు, లోతు, సంఖ్య, రకాలను బట్టి  నవీన శిలాయుగంలో ఆది మానవులు రాతి గొడ్డళ్లు, నునుపైన రాళ్లతో దంపుడు రాళ్లు తయారు చేసుకొని స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటారని పేర్కొన్నారు. గ్రామం కోసం ప్రాణాలర్పించిన ఓ వీరగల్లు (వీరుడు) విగ్రహం గుట్టపై ఉందని, కుడి చేతిలో కత్తి, నడుముకు పిడి బాకు ఉన్న విగ్రహం కింద పడి ఉండడాన్ని గమనించినట్లు చెప్పారు.