కొల్లాపూర్, వెలుగు: శ్రీరాముడి జీవితం, ఆయన అనుసరించిన ధర్మ మార్గం అందరికీ ఆదర్శప్రాయమని తెలుగు భారతి సంస్థ ప్రధాన కార్యదర్శి, సాహితీ వేత్త వేదార్థం మధుసూధనశర్మ పేర్కొన్నారు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన సందర్భంగా హైదరాబాద్కు చెందిన ప్రముఖ అర్థ శాస్త్ర వేత్త, కవి, రచయిత డా. కర్నాటి లింగయ్య రచించిన ఆధ్యాత్మ రామాయణం గ్రంథాన్ని సోమవారం కొల్లాపూర్ పట్టణంలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ జీవితాన్ని సంస్కరించే కావ్యమే రామాయణమన్నారు. తల్లిదండ్రుల పట్ల అనురాగం, పిల్లల పట్ల ప్రేమ, అన్నదమ్ములతో అనుబంధం, భార్యా భర్తల మధ్య సంబంధం, గురు శిష్యుల మధ్య ఉండే భక్తి, స్నేహ ఫలం, ధర్మ బలం మొదలైన సుగుణాలను శ్రీరాముడు తాను ఆచరించి, సర్వ జనులకు మార్గదర్శనం చేశాడని తెలిపారు. శ్రీ రాముడి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను సంక్షిప్తంగా ఆధ్యాత్మిక రామాయణం అనే పుస్తక రూపంలో పాఠకులకు అందించడం అభినందనీయమన్నారు. ఆలయ అర్చకులు టి. జి రాఘవాచార్యులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుడు గోవిందు గౌడ్, వెంకటయ్య, మల్లయ్య, టీచర్లు కృష్ణప్రసాద్, రామకృష్ణ పాల్గొన్నారు.