కేసీఆర్ ది ఓ లెక్క.. హెల్త్ డిపార్ట్ మెంట్ ది ఇంకో లెక్క

కేసీఆర్ ది ఓ లెక్క.. హెల్త్ డిపార్ట్ మెంట్ ది ఇంకో లెక్క

హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాప్తి, కేసుల నమోదులో సీఎం కేసీఆర్ చెబుతున్న లెక్కకు, హెల్త్ డిపార్ట్‌‌మెంట్ చెప్తున్న లెక్కకు పొంతన ఉండడం లేదు. నాగార్జున సాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, సూర్యాపేట, ఖమ్మం, డోర్నకల్, హుజూరాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, బెల్లంపల్లి, గోదావరి ఖని, సిరిసిల్ల, వరంగల్‌‌లో కరోనా ప్రభావం తగ్గలేదని కేసీఆర్ రెండు రోజుల క్రితం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా ప్రాంతాల్లో మూడు రోజులు పర్యటన చేసి, కట్టడి చర్యలు చేపట్టాలని ఆఫీసర్లను ఆదేశించారు. కానీ, హెల్త్ డిపార్ట్‌‌మెంట్ మాత్రం ఆ జిల్లాల్లో చాలా తక్కువ కేసులు వస్తున్నట్టుగా చెబుతోంది. కేసీఆర్ చెప్పిన లిస్ట్‌‌లో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ కూడా ఉంది. 
ఆ జిల్లా మొత్తంలో వారం రోజుల్లో 198 మందికి మాత్రమే కరోనా సోకినట్టు హెల్త్ బులెటిన్‌‌లో ప్రకటించారు. సూర్యాపేట జిల్లాలో రోజుకు సగటున 30 కేసులే వస్తున్నట్టు చూపించారు. పెద్దపల్లి, మంచిర్యాలలో రోజూ 40 నుంచి 50 కేసులు మాత్రమే వస్తున్నట్టు బులెటిన్‌‌లో పేర్కొన్నారు. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్‌‌‌‌ జిల్లాల్లో మాత్రమే రోజూ 50కిపైగా కేసులు వస్తున్నాయని హెల్త్ బులెటిన్‌‌ లెక్కలు చెబుతున్నాయి. కాగా, సీఎం ఆదేశాల మేరకు ఆదివారం హైదరాబాద్​ నుంచి అధికారులు హెలికాప్టర్ ద్వారా నాగార్జున సాగర్​కు వెళ్లనున్నారు. ఈ నెల 13న వరంగల్ టూర్​తో పర్యటన ముగించనున్నారు. 

కొత్తగా 704 కేసులే

రాష్ట్రంలో శనివారం 1,00,632 మందికి టెస్టులు చేస్తే, 704 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చినట్టు హెల్త్ డిపార్ట్‌‌మెంట్ బులెటిన్​లో ప్రకటించింది. ఇందులో జీహెచ్‌‌ఎంసీ పరిధిలో 77, జిల్లాల్లో 627 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,31,218కి పెరిగింది. ఇందులో 6,16,769 మంది కోలుకున్నారు. ఇంకో 10,724 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో శనివారం మరో ఐదుగురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 3,725కు పెరిగిందని బులెటిన్​లో వెల్లడించారు.