బీసీ బిడ్డలపై వివక్షెందుకు?

మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే అని బలంగా నమ్మిన పూలే దంపతులు సమాజంలోని బలహీనవర్గాలకు విద్యనందించాలని ప్రయత్నం చేశారు. 75 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఏ నివేదిక, సర్వే చూసినా విద్యలో వెనుకబాటుతనం వల్లే బలహీనవర్గాలు పేదరికంలో మగ్గుతున్నట్లు తెలుస్తున్నది. ఉత్పత్తి, సేవా కులాలైన బలహీన వర్గాలు ఇంజనీరింగ్, మెడిసిన్, బిజినెస్, కంప్యూటర్స్, ఫార్మసీ లాంటి ఖరీదైన కోర్సులకు ఫీజులు చెల్లించలేకపోతున్నారు. సంప్రదాయ కోర్సుల బాటపట్టి మెరుగైన, ఉన్నతమైన అవకాశాలు పొందలేకపోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఇంజనీరింగ్​లాంటి ఉన్నత కోర్సులు చేసేందుకు వీలుగా 2008లో అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్​మెంట్​పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా అన్ని కోర్సులకు ప్రభుత్వమే పూర్తిగా ఫీజులు చెల్లించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో వేలాది మంది పేదల బిడ్డలు ఉన్నత విద్యనభ్యసించి ఇయ్యాల మెరుగైన స్థితిలో ఉన్నారు.

స్వరాష్ట్రంలో ఫీజులపై ఆంక్షలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత  ఫీజురియింబర్స్​మెంట్​పథకం పేరును ఫాస్ట్​(ఫైనాన్షియల్​అసిస్టెన్సీ టు స్టూడెంట్స్​ ఆఫ్ ​తెలంగాణ)గా మార్చాలని ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని గమనించి రియింబర్స్​మెంట్​పథకం పేరు మార్చే ప్రతిపాదనను విరమించుకుంది. దానికి బదులు ఫీజుల భారం తగ్గించుకునే ప్రయత్నం చేసింది. ఫీజుల చెల్లింపులో నిబంధనలను, ఆంక్షలను తీసుకొచ్చింది. ఇంజనీరింగ్​చదివే బీసీ విద్యార్థులకు ఎంసెట్ లో పదివేల లోపు ర్యాంకు వస్తేనే పూర్తి ఫీజు చెల్లిస్తున్నది. పదివేలకు పైగా ర్యాంకు వచ్చిన వారికి కేవలం రూ.35 వేలు మాత్రమే చెల్లిస్తామని ఆంక్షలు విధించింది. దీంతో బీసీ విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. ఇలా ఒకవైపు ఫీజుల చెల్లింపులపై ఆంక్షలు పెట్టి, మరో వైపు ప్రతి మూడేండ్లకోసారి ఇంజనీరింగ్​ఫీజులు పెంచుకునే నిబంధనలను తెచ్చింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 3 సార్లు ఇంజనీరింగ్​ ఫీజులు పెంచారు. ఈ ఏడూ ఇంజనీరింగ్​ఫీజులు పెంచాలని ప్రైవేటు ఇంజనీరింగ్​కాలేజీలు పెట్టిన డిమాండ్​ను ఫీజుల నియంత్రణ కమిటీ తిరస్కరించినా, 81 కాలేజీలు హైకోర్టుకు వెళ్లి ఫీజులు పెంచుకోవడానికి అనుమతి తెచ్చుకున్నాయి. ఈ పెంపుతో సగటున ఏటా ఒక్కో విద్యార్థిపై రూ.20 వేల అదనపు ఫీజు భారం పడుతున్నది. ఇంజనీరింగ్ ​కోర్సులకు ఫీజులు పెరుగుతున్నా ప్రభుత్వం చెల్లించే ఫీజులను పెంచడం లేదు. రాష్ట్రంలో దాదాపు 71 వేల ఇంజనీరింగ్​ సీట్లలో పూర్తి ఫీజురియింబర్స్​మెంట్​ పొందుతున్న బీసీ విద్యార్థులు కేవలం 6 వేల కన్నా తక్కువే. దీన్ని బట్టి ప్రభుత్వం పెట్టిన ఈ ఆంక్షల వల్ల బీసీ విద్యార్థులు ఎంత నష్టపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. బీసీ, ప్రజా సంఘాల ఒత్తిడి వల్ల ఆంక్షలు ఎత్తివేసి బీసీ విద్యార్థులకు అందరికీ పూర్తి ఫీజు చెల్లిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​మూడేండ్ల క్రితమే హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు దాన్ని అమలు చేయడం లేదు. 

బడ్జెట్ లో అరకొర నిధులు..

ఇంజనీరింగ్ చదివే బీసీ విద్యార్థులకు ఫీజులు చెల్లించకపోవడమే కాదు, 52 శాతం ఉన్న బీసీల సంక్షేమానికి గత అన్ని బడ్జెట్​లలో కేవలం 3 శాతం కంటే తక్కువ నిధులనే ప్రభుత్వం కేటాయించింది. 2022‌‌‌‌-23 బడ్జెట్​లో బీసీల సంక్షేమానికి కేవలం రూ.5,697 కోట్లు మాత్రమే ప్రతిపాదించింది. మొత్తం బడ్జెట్​లో ఇది 2.3 శాతం మాత్రమే. బీసీలకు సబ్​ప్లాన్​ ప్రకటిస్తామని హామీ ఇచ్చినా, దాన్ని గాలికి వదిలేసింది. బీసీల సంక్షేమ పథకాల అమలు పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనిపిస్తున్నది. 

ఆత్మగౌరవ భవనాలు కాదు చదువు కావాలి

బలహీన వర్గాలకు 42 ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది. ఇప్పటికే హైదరాబాద్​లో కొన్ని బీసీ కులాలు కుల భవనాలు, హాస్టల్స్​ నిర్మించుకున్నాయి. ఆత్మగౌరవ భవనాల కంటే బలహీన వర్గాల పిల్లల నాణ్యమైన, ఉన్నత చదువుల కోసం పూర్తి ఫీజు రియింబర్స్​మెంట్​అమలు చేస్తే వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టినట్లే అవుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాలను ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నది తప్ప వారి సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టడం లేదు. ఏపీ​ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఏ కోర్సు, ఏ రాష్ట్రంలో చదువుకుంటున్నా ఎలాంటి ఆంక్షలు లేకుండా ఫీజులు చెల్లిస్తున్నది. మన రాష్ట్రం మాత్రం పట్టించుకుంటలేదు. చదువు ద్వారానే వెనుకబాటుతనం నుంచి బయట పడతామని బీసీ సమాజం కూడా గ్రహించాలి. 

- డా. తిరునహరి శేషు,
రాష్ట్ర చైర్మన్, బీసీ జేఏసీ​