బీసీలపై ఎందుకింత వివక్ష.?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఊపిరాడని బీసీ వర్గాలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలబడి కొట్లాడినయి. స్వరాష్ట్ర సాధనలో కొందరు షార్ట్​ టైం, కొందరు పార్ట్​ టైం పోరాడితే,ఆచార్య జయశంకర్ లాంటి వారు మాత్రం లైఫ్​ టైం తెలంగాణ కోసం ఉద్యమించారు. తొలి అమరుడు శ్రీకాంతాచారి, పోలీస్ కిష్టయ్య సహా రాష్ట్రం  కోసం అమరులైంది అత్యధికంగా బీసీలే. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీసీల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లు అయింది. చెప్పుకోలేక, బయట చెబితే ఇజ్జత్​ పోతదనే బాధతో, కొందరు నాలుగు గోడల మధ్య తమ గోడు తామే చెప్పుకుంటూ ‘బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయ’ని కలిసి వచ్చే కాలం కోసం, బుస కొట్టకుండా, కూసం విడవకుండా వేగుచుక్క కోసం వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నారు.

తెలంగాణలో సీఎం కేసీఆర్​ మొదట బీసీల ఆత్మగౌరవంపై దెబ్బకొట్టి, వారు కుంగిపోయేటట్లు చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, ఆచార్య జయశంకర్, శ్రీకాంతాచారి, కొండా లక్ష్మణ్ బాపూజీ, ధర్మ బిక్షం లాంటి మహానేతల విగ్రహాలు ట్యాంక్ బ్యాండ్ పై పెట్టాలన్న బహుజనుల ఆకాంక్షలను కనీసం వినే సమయం కూడా ఆయనకు లేదు.రాజకీయ అణచివేత: పరిపాలనలో ప్రజా ప్రతినిధులు కేవలం స్టేటస్ లేని సంఖ్య మాత్రమే. పల్లె భవన్ నుంచి ప్రగతి భవన్ దాకా బీసీలకు అన్యాయం చేసిన ఘనత కేసీఆర్​దే. సర్పంచ్ రిజర్వేషన్స్ 33 శాతం నుంచి 23 శాతానికి తగ్గిం చడం, ఉప సర్పంచ్ పోరు, జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అత్యధిక సీట్లు ఓల్డ్ సిటీకి కేటాయించి మరోసారి తన వ్యతిరేకతను చాటుకున్నారు. కార్పొరేషన్స్ పదవుల్లో అతి స్వల్ప పదవులు ఇచ్చి తన కక్ష తీర్చుకున్నారు. కనీసం పరోక్ష ఎన్నికలైన 40 ఎమ్మెల్సీ సీట్లలో కేవలం 5, డీసీసీబీ, డీసీఎంస్, జడ్పీ చైర్​పర్సన్ లాంటి పదవుల్లోనూ కనీస కోటా దక్కకుండా చేశారు. ఇక ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పరోక్షంగా చేసి, స్థానిక ప్రజా ప్రతినిధుల పవర్ తగ్గించారు. ప్రగతి భవన్ లో  ఒక్క బీసీ లేకుండా చేసి, తన డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత చాటుకున్నారు. బీసీ కమిషన్ లాంటి పదవులకు కేవలం మొక్కలు నాటడమే పనిగా, సోషల్ మీడియా పోస్టులకు పరిమితం చేసి ఆ వ్యవస్థనే అపహాస్యం చేశారు. సామాజిక సంఘాలను ప్రగతి భవన్ గడప తొక్కకుండా చేసి బీసీల రాజకీయ భవిష్యత్తుపై మరణమృదంగం వాయిస్తున్నారు. 

విద్యా రంగంలో అణచివేత:

కనీసం గురుకుల పాఠశాలలను సైతం బీసీ జనాభా ఆధారంగాఏర్పాటు చేయలేదు. బీసీలకు, ఈబీసీలకు 900 గురుకులాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, కేవలం 260 ఏర్పాటు చేసి కేసీఆర్​తన వివక్షను చాటుకున్నారు. పేదరికమే గీటు రాయిగా ఇచ్చే ఫీజు రియింబర్స్​మెంట్ అన్ని వర్గాలకు 100 శాతం ఇచ్చి, హిందూ బీసీ, ఈబీసీలకు మాత్రం కేవలం11శాతానికి పరిమితం చేసి తన ద్వంద్వ వైఖరి చాటుకున్నారు.  బీసీ, ఈబీసీ ప్రభుత్వ హాస్టల్స్, గురుకుల పాఠశాల భవనాలకు ఒక్క రూపాయి బడ్జెట్​ ఇవ్వకుండా, కనీసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న జగ్జీవన్​రామ్​ఛాత్రి నివాస యోజన ఉపయోగించకుండా శిథిల భవనాల్లో, విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేస్తున్నారు. ఇక ఉన్నత విద్య పూర్తిగా ప్రైవేట్ పరం చేసి, 95 శాతం బహుజన విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ వర్సిటీలను పూర్తిగా నిర్వీర్యం చేశారు.

ఆర్థిక దిగ్బంధం :  ఫ్యూడల్ నాయకులు అందరూ ఒకటి నమ్ముతారు.  ప్రజలను ఆర్థికంగా ఎదగకుండా ఉంచితే తమ పాలన శాశ్వతంగా ఉంటదని వారు భావిస్తారు. కేసీఆర్​ చేస్తున్నది అదే. తెలంగాణ రాష్ట్రంలో కోటి కుటుంబాలు ఉంటే, దాదాపు 30 లక్షల కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి. అందులో15 లక్షల బీసీ కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి. బడ్జెట్ కొండంత, కానీ బీసీలకు కేటాయించేది గులకంతా. అందులో ఖర్చు పెట్టేది రవ్వంత. 2014 నుంచి 2022 వరకు దాదాపు రూ.15 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెడితే, బీసీ కార్పొరేషన్ కు కేవలం రూ. 836 కోట్లు ప్రకటించి, రూ. 230 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇక 6 లక్షల కుటుంబాలు కుల వృత్తుల మీద ఆధారపడి జీవిస్తుంటే, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్​లో ఏర్పాటు చేసిన 11 ఫెడరేషన్స్ నిర్వీర్యం చేసి, విధులు, నిధులు, కార్యవర్గం లేకుండా చేశారు. బీసీలు యాచకులుగా ఉండాలనేదే ఆయన లక్ష్యం.  కొత్తగా ఎంబీసీ కార్పొరేషన్​ పెడితే అంతా తమకు మేలు జరుగుతుందన్నకున్నారు. దానికి రూ.2,505 కోట్లు కేటాయించినా, ఖర్చు చేసిన నిధులు రూ. 7 కోట్లు మాత్రమే. అలా బీసీ బడ్జెట్​ కేటాయింపులనే అపహాస్యంగా మార్చేశారు. అందుకే, 2023లో  కేసీఆర్​ ప్రభుత్వాన్ని  గద్దె దించడానికి 56 శాతం ఉన్న బీసీలే ముందు నడుస్తారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అనే తేడా లేకుండా  దగా పడ్డ ప్రతి సామాజిక వర్గమూ అందుకు తప్పక తోడుగా నడుస్తాయి. తెలంగాణ నుంచి అవినీతి, నియంతృత్వ పాలన పోవాలంటే అది ఓటు ద్వారానే సాధ్యం. ధన బలం, కుల బలం కాకుండా, సిద్ధాంత బలంతో అన్ని వర్గాలకు తోడుగా నడిచే బీజేపీ లాంటి వేగు చుక్క తెలంగాణకు అవసరం.

ఒక్కో వర్గాన్ని ఒక్కో రకంగా..

కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక రాజకీయ లక్ష్యం అయితే, బీసీల అణచివేత జీవిత లక్ష్యంగా ఆయన ఈ 8 ఏండ్ల పరిపాలన రుజువు చేస్తున్నది. ఇతర వర్గాల పట్ల పూర్తి సానుకూలత ఉందనుకుంటే అది కూడా భ్రమే. అర్థ బలం, రాజకీయ బలం ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని మునగ చెట్టు మీద కూర్చోబెట్టారు. దళిత, గిరిజనులను దరి చేరని దిక్కులోకి నెట్టారు. మీడియా బలం ఉన్న కమ్మ వర్గాలను కమ్మటి మాటలతో కవర్ అప్ చేస్తున్నారు. ఇక మాయమాటలు నమ్మే ముస్లింలను ‘ ఏక్ దిన్ బిర్యానీ, పూరా సాల్ పరేషాని’ అన్నట్లు కాలం నెట్టుకొస్తున్నారు. క్రిస్టియన్లకు కమలం గుర్తును చూపి, తన లోపాలను కప్పి పుచ్చుకుంటున్నారు. ఇక ఢిల్లీ నుంచి గల్లీ వరకు అధికార గణం, ఆధ్యాత్మిక గణం ఉన్న బ్రాహ్మణులను సాష్టాంగ నమస్కారాలతో సైలెంట్ చేశారు. ఇక కొంత మంది అవసరం అనుకున్న వెలమలకు అందలం ఇచ్చి, అత్యధిక మంది బయట చెప్పుకోలేక, వాస్తవం కక్కలేక కాలం గడుపుతున్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలను మాత్రం పుండు మీద కారం చల్లుతూ, ఎస్ నేను ఇంతే అంటున్నారు. ఆనాడు నిండు అసెంబ్లీలో ‘ఒక్క పైసా ఇవ్వను ఏమి చేసుకుంటావో చేసుకో’ అన్న కిరణ్ కుమార్ రెడ్డి లాగా, ‘అన్ని రంగాల్లో  బీసీలను అణచివేస్తాను’ అని ఒక చాలెంజ్ విసిరి మరీ.. అణచి వేస్తున్నారు సీఎం కేసీఆర్.
-డా.బూర నర్సయ్య గౌడ్,మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర నాయకులు