
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణ పట్ల వివక్షత కనిపించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు ఓ ప్రకటనలో విమర్శించారు. తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా రాష్ట్రానికి అదనంగా సాధించింది సున్నా అని, రాష్ట్ర విభజన జరిగి11ఏండ్లు అవుతున్నా ఇప్పటికీ విభజన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు.
రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. గత నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.3 లక్షల కోట్లకు సంబంధించిన పథకాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారని, తెలంగాణకు మాత్రం కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇది కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని ఆరోపించారు.