స్వరాష్ట్రంలోనూ వివక్షేనా

ఇటీవల పరిపాలనను గమనించినప్పుడు  రాజకీయ పార్టీల స్వప్రయోజనం తప్ప  రాజ్యాంగం,  చట్టం, న్యాయ వ్యవస్థ,  ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలు  వంటి కీలకమైన అంశాలను పాలకవర్గాలు ఏనాడో విస్మరించినాయి.  అడిగిన వారికి వరాల జల్లు కురిపించడం , బలమైన ప్రజా ప్రతినిధులు ఉన్న నియోజకవర్గాలలో మాత్రమే  అభివృద్ధి జరగడం వంటి అపసవ్య లక్షణాలను ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం.  ఈ పద్ధతి  దుర్మార్గమే కాదు రాజ్యాంగబద్ధంగా చూసినప్పుడు  పెద్ద నేరం కూడా. రాజ్యాంగం రాసుకున్నదే  పరిపాలనలో  పాటించవలసిన నియమ నిబంధనలు సూత్రాలు అధికరణాలను  పారదర్శకంగా  పాటించడం ద్వారా సుపరిపాలన అందించడం కోసం  రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం  రాజ్యాంగ విలువలను  తుంగలో తొక్కి  తప్పుడు విధానాలు, స్వార్థ ప్రయోజనాలు,  బెదిరింపులు, లొంగదీసుకోవడం, ఆధిపత్య వర్గాల డిమాండ్ల మేరకు  ప్రజాధనాన్ని ఇష్టమున్నట్లుగా అప్పటికప్పుడే  చట్టసభల ఆమోదం లేకుండా మంజూరు చేయడం అనాగరికమైన చర్య.

కనీసం రాచరిక వ్యవస్థలో కూడా  ప్రజా ప్రయోజనం  చట్టం యొక్క ఔన్నత్యాన్ని కాపాడిన సందర్భాలు ఉండేవి. కానీ  ప్రపంచంలోనే అత్యంత  ఉత్కృష్టమైన ప్రజాస్వామ్య దేశమని చెప్పబడుతున్న భారతదేశంలో  ప్రలోభాల మాటున కొనసాగుతున్న ఈ పరిపాలనను  ప్రజలు  నిరసించకపోగా  ఎవరి స్వార్థం కోసం వాళ్లు  ఎక్కడికక్కడ డిమాండ్ చేస్తూ  కులాలు, మతాలు, వర్గాల  వారీగా  కోరికలు కోరడం అవివేకం. హక్కుల కోసం రాజ్యాంగబద్ధమైన పాలన కోసం డిమాండ్ చేస్తే అర్థం ఉంటుంది కానీ  యాచించే పద్ధతిలో  కోరికలు కోరుకోవడం  ఇదే అదనుగా భావించిన పాలకవర్గాలు  వరాల జల్లు కురిపించి తమ దాతృత్వాన్ని ప్రదర్శించుకుని అందుకు  ఓట్లను దండుకోవడం ఒక రాజకీయ దగా.  ప్రజలు కూడా  రాజకీయ ఆర్థిక సామాజిక అంతరాలను  తొలగించే విధంగా, ప్రజా సంపదను అన్ని వర్గాలకు పంచే విధంగా,  అసమానతలను మరింత పెంచకుండా ఉండేవిధంగా  ప్రభుత్వం పైన డిమాండ్ చేయాలి కానీ  కోరికలు కోరుకోవడం వలన  ప్రజలు విభిన్న వర్గాల వారు యాచకులుగా బానిసలుగానే మిగిలిపోయే ప్రమాదం ఉన్నది .

పర్యటించిన ప్రాంతానికి వరాలు  

 ముఖ్యమంత్రి కొన్ని ప్రాంతాలను సందర్భోచితంగా పర్యటించినప్పుడు  ప్రజల మనసులను దోచుకోవడానికి  ప్రజల మెప్పు పొందడానికి  వరాల జల్లు కురిపించి కోటానుకోట్ల రూపాయలను అక్కడికక్కడే మంజూరు చేయడాన్ని మనం గమనించవచ్చు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో  ముఖ్యమంత్రి,  పరిశ్రమల మంత్రి కేటీఆర్  వివిధ నియోజకవర్గాల పర్యటనకు వెళ్ళినప్పుడు  అక్కడికక్కడే కోటాను కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ  వరాల జల్లు కురిపించడం  తాత్కాలికంగా ఆ ప్రాంతానికి లాభం జరగవచ్చు. కానీ  ఇలాంటి  ప్రకటనలు  అసమానతలను మరింత పెంచి పోషించే ప్రమాదం ఉంటుంది.  

పర్యటించని ఆ ప్రాంతాలు వెనుకబడి పోవాల్సిందేనా?  పర్యటనతో సంబంధం లేకుండా  ప్రాంతాల వెనుకబాటు,  ప్రజల ఆర్థిక పరిస్థితులు , జనాభా దామాషా,  విభిన్న సామాజిక వర్గాల యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతుల నేపథ్యం  వంటి అంశాల ఆధారంగా మాత్రమే  నిధులు మంజూరు చేయబడినప్పుడు  అన్ని వర్గాలకు సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. కానీ  దేవత ప్రత్యక్షమై  వరమిచ్చినట్లుగా  ముఖ్యమంత్రి ప్రధాని వంటి  హోదాలో గలవాళ్లు  నోటికి వచ్చిన మాటను  ప్రకటించడం  నిజమైన పాలన కాలేదు. అది ఒకరకంగా ప్రాంతాల మధ్యన  అంతరాలను పెంచడం చిచ్చు పెట్టడమే.

తెలంగాణ తెచ్చుకున్నదెందుకు?

ప్రాంతాల మధ్య పాలకులు వివక్ష చూపించడం దారుణం. పలుకుబడి ఉన్న నాయకులు వారి వారి ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటే, మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటి? 60 ఏళ్ల పోరాటం ఫలితంగా 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన విషయం కూడా అందరికీ తెలిసిందే.  తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి  ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన వివక్ష కారణంగా రాష్ట్ర ఏర్పాటు అనివార్యమైంది. కానీ అదే ఉద్యమకారుల నాయకత్వంలో రాష్ట్ర పాలన కొనసాగుతున్న నేడు  తెలంగాణ రాష్ట్రంలో  కేవలం గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట  మూడు నియోజకవర్గాలు మాత్రమే బలంగా అభివృద్ధి చెందినట్లు ఆరోపణలు వస్తుంటే3 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి, పరిశ్రమల మంత్రి, ఆరోగ్య మంత్రి  ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్రానికే ఆదర్శం కావాలని అప్పుడప్పుడు ప్రకటన చేస్తుంటే  ఇక మిగతా జిల్లాలు నియోజకవర్గాలను విస్మరించినట్లే కదా

ఇది ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా వివక్షకు దారి తీయదా?  ఈ రకంగా బలమైన నాయకులు ఉన్న ప్రాంతాలకు అధికారం చేతిలో ఉంది కనుక కోట్ల నిధులను మంజూరు చేస్తే  ప్రశ్నించడానికి కూడా సాహసం లేని బలహీనులైన శాసనసభ్యులు ఉన్న నియోజకవర్గాల గతి ఏమిటి ? పై మూడు రకాల పద్ధతులు కూడా  రాజ్యాంగానికి భిన్నంగా నడుస్తున్న   అవకతవకల పాలన. అడిగిన వారికి ఇవ్వడం, అడగకపోతే మరిచిపోవడం  చేతిలో అధికారం ఉన్నోళ్లే  పైసలు కుమ్మరించుకోవడం  వంటి పద్ధతులు కొనసాగితే ఇది ఏ రకంగా రాజ్యాంగబద్ధ పరిపాలన అవుతుంది? దేశ ప్రధాని కూడా  ఇలాంటి పరిపాలకులను కట్టడి చేయాలి. వారి చేత రాజ్యంగ సూత్రాలకు అనుగుణమైన పాలనా  విధానాలతో నడిపిస్తే బాగుంటుంది. 

బంధు’ ల రాజకీయం 

ప్రజాస్వామ్యంలో  ప్రజల  సమస్యలను గుర్తించి పరిష్కరించడం ఒక నైపుణ్యం సంస్కారం అయితే  ప్రజా చైతన్యం కూడా అవసరమే..  కానీ  చైతన్యం లేని ప్రజలను  ప్రజలుగా చూడకుండా నిర్లక్ష్యం చేయడం మాత్రం  ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ ద్రోహంగా పరిగణించవలసి ఉంటుంది . ఇటీవల కాలంలో రైతుబంధు, దళిత బంధు  ప్రకటించిన సందర్భంలో మిగతా వర్గాలు బీసీ బంధు, గిరిజన బంధు, జర్నలిస్టు బంధు, పద్మశాలి బంధు,  కులాల వారి బంధులను కూడా అడుగుతున్న సందర్భాలను గమనిస్తే  పరిపాలన ఎంత విచ్చలవిడితనంగా మారిపోయిందో అర్థమవుతున్నది.  ఇది అంతిమంగా కులాల మధ్యన  చిచ్చు రగిలించేందుకు దారితీస్తుంది. విజ్ఞత కలిగిన ప్రభుత్వాలు చేయాల్సిన పని ఇది కాదు. 

- వడ్డేపల్లి మల్లేశం, సోషల్​ ఎనలిస్ట్​