కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్‌సభలో సమర్పించిన రైల్వేపద్దులో తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయి. దీన్నిబట్టి కేంద్రానికి మన రాష్ట్రంపై ఎంత ప్రేమ ఉన్నదో అర్థమవుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 441 కి.మీ. మేర ఐదు కొత్త రైల్వే లైన్ల నిర్మాణాన్ని దక్షిణ మధ్య రైల్వే చేపట్టింది. 2024-–25 కేంద్ర బడ్జెట్‌లో రైల్వే కేటాయింపులు చూస్తే.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు మరో 30 ఏండ్లకు కూడా పూర్తికావని విశదమవుతున్నది. తెలంగాణకు ఈ ఏడాది రూ.5,071 కోట్లు వివిధ పనులకు కేటాయించినట్లు ప్రకటించింది. వీటిలో కొత్త రైల్వేలైన్లకు కేవలం రూ.361.50 కోట్లను విదిల్చారు. వీటి అంచనా వ్యయం రూ,8,600 కోట్లు. ఇవి పూర్తయ్యేసరికి పెరుగుతున్న ధరల ప్రకారం కనీసం రూ. 25వేల కోట్లకు పైగానే వ్యయమవుతుందని సమాచారం. ఏటా కనీసం 2000 కోట్లు మంజూరు చేస్తేనే పదేండ్లలో పూర్తవుతాయి. లేదంటే మరో 30 నుంచి 40 ఏండ్లకుగానీ పూర్తి కావు. ఈ ఐదు రైల్వే లైన్లలో.. మనోహరాబాద్–-కొత్తపల్లి( సిద్దిపేట వరకు పూర్తయింది. ఇంకా 76 కి.మీ ఉంది.) పనుల్లో కొంత కదలిక ఉంది. భద్రాచలం రోడ్- కొవ్వూరు(తెలంగాణలో 78.50 కి.మీ., ఏపీలో 72.40 కి.మీ), మణుగూరు–- రామగుండం(200 కి.మీ.), కొత్తగూడెం-– కొండపల్లి(తెలంగాణలో 16.07 కి.మీ, ఏపీలో 82 కి.మీ.), నల్గొండ-– మాచర్ల (తెలంగాణలో68.10 కి.మీ., ఏపీలో81 కి.మీ) మార్గాల్లో పెద్దగా పనులు జరగడంలేదు.
తెలంగాణలో 1,194 కి.మీ రైల్వేలైన్
తెలంగాణ రాష్ట్రంలో కేవలం 1,194 కి.మీ రైల్వేలైన్ మాత్రమే ఉన్నది (రెండు, మూడు, నాలుగు మార్గాల నిడివి మరో 806 కి.మీ.). ఇది చాలా తక్కువ ప్రాంతాలను మాత్రమే అనుసంధానిస్తున్నది. అనేక జిల్లాలు, పట్టణాలకు రైల్వే అనుసంధానత కల్పిస్తూ కొత్త లైన్లు నిర్మించాలని కోరినా పట్టించుకున్న నాథుడే లేడు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1972లో మంజూరైన బీబీనగర్–- నల్గొండ-– మిర్యాలగూడ- నడికూడి లైన్ 1990లో పూర్తయింది. అదేవిధంగా పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1994లో మంజూరైన పెద్దపల్లి-– కరీంనగర్–- నిజమాబాద్ లైన్ 2017లో అంటే 23 ఏండ్ల తరువాత అందుబాటులోకి వచ్చింది. దీన్నిబట్టి నిర్మాణంలో ఎంత జాప్యం జరుగుతున్నదో గమనించవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇటీవల ద.మ. రైల్వే జీఎం భేటీ అయిన సందర్భంగా మఖ్తల్– -నారాయణపేట-– వికారాబాద్ రైల్వేలైన్‌ను పట్టాలెక్కించేలా చూడాలని ఆదేశించారు. ఈ బడ్జెట్‌లో దాని ప్రస్తావనే లేదు. అదేవిధంగా గత ఏడాది సెప్టెంబరులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి తెలంగాణకు 15 కొత్త రైల్వే లైన్ల నిర్మాణం కోసం ఫైనల్ లొకేషన్ సర్వే(ఎఫ్.ఎల్.ఎస్) చేపట్టనున్నట్లు తెలిపారు. వీటి నిడివి 2,647 కి.మీ. అంచనా వ్యయం రూ.50,848 కోట్లని వెల్లడించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవాటికే కేటాయింపులు సరిగా లేవు. ఇక కొత్త లైన్లు సర్వే చేసి బడ్జెట్‌లో మంజూరు చేస్తామంటే ప్రజలు అంత మందబుద్ధులేమీ కాదు.
ఉత్తరాది రాష్ట్రాలపై ఔదార్యం
ఖాజీపేట–-బల్హర్ష, ఖాజీపేట-– విజయవాడ సెక్షన్లలో మూడోలైనుకు వరుసగా 300 కోట్లు, 337.52 కోట్లు కేంద్రం కేటాయించింది. కానీ వీటిని పూర్తి చేయాలంటే ఇంకా భారీగా నిధులవసరమవుతాయి. ఖాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌కు కేవలం 150 కోట్లు ఇచ్చారు. ఇవి ఏమూలకు సరిపోతాయో తెలియదు. కేంద్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం తెలంగాణకు తాము ఇన్నికొత్త రైల్వే లైన్లు మంజూరు చేసి, నిర్మించామని చెప్పుకోవడానికి కూడా వారికి నోరు లేని పరిస్థితి. తమకు ఎక్కువ స్థానాలు ఇచ్చిన దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా నిధులు కేటాయించి బీజేపీ ప్రభుత్వం తన ఔదార్యాన్ని చాటుకున్నది. తెలంగాణ నుంచి నాలుగు స్థానాలు గెలిచినా కేటాయింపులపై తగిన శ్రద్ధ చూపలేదు. ఈసారి ప్రజలు మరి ఎలా స్పందిస్తారో చూడాలి.
- కె, బాలకిషన్ రావు,
సీనియర్ జర్నలిస్ట్.