144 సెక్షన్​లో వివక్ష.. మీడియాకు, ప్రతిపక్షాలకు నో పర్మిషన్

ఎల్లూరు పంపుహౌజ్ వద్ద సర్కార్ ఆంక్షలు

ప్రతిపక్షాలు, కవరేజీకి వెళ్లిన ప్రెస్‌కు నో పర్మిషన్
టీఆర్ఎస్ నేతలకు, కార్యకర్తలకు మాత్రం ఓకే
పోలీసుల దిగ్బంధంలో కల్వకుర్తి టౌన్
అన్ని మార్గాలను బారికేడ్లతో మూసేసిన ఖాకీలు
సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు

నాగర్​కర్నూల్, వెలుగు: కల్వకుర్తి మొదటి లిఫ్ట్​ ఎల్లూరు పంపుహౌజ్​ నీటమునగడంతో అక్కడ 144 సెక్షన్​ పేరిట ఆంక్షలు విధించిన  సర్కారు తీరు వివాదాస్పదమవుతున్నది.  ప్లాంట్​ పరిస్థితిని చూసేందుకు వెళ్తున్న ప్రతిపక్ష నేతలను, కవరేజీకి వెళ్తున్న మీడియా ప్రతినిధులను పర్మిషన్​ లేదని అడ్డుకుంటున్న పోలీసులు, టీఆర్​ఎస్​నేతలు, కార్యకర్తలకు మాత్రం అనుమతివ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 16న పంప్​హౌస్​ నీటమునగడంతో అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు 17 నుంచి కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, బీజేపీ, లెఫ్ట్ పార్టీల లీడర్లు, ప్రజా సంఘాల నేతలు వరుసగా వస్తున్నారు. కానీ ప్రభుత్వం ముందుజాగ్రత్తగా పెద్దసంఖ్యలో పోలీసులను మోహరించడంతో 144 సెక్షన్​ విధించామంటూ ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పే క్రమంలో కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులను కూడా పంపుహౌస్​ వైపు వెళ్లనివ్వడం లేదు. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు కొల్లాపూర్​ పట్టణాన్ని బారీకేడ్లతో దిగ్బంధించారు. హైదరాబాద్​వస్తున్న నేతలను మధ్యలోనే అడ్డుకుని పోలీస్​ స్టేషన్లలో కూర్చోబెట్టి  వెనక్కి పంపుతున్నారు. కొల్లాపూర్​కు వెళ్లే అన్ని రోడ్లను పోలీసులు బారికేడ్లతో మూసేశారు.   వనపర్తి, తెల్క పల్లి, నాగర్​కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, బిజినేపల్లి రోడ్లపై పహారా కాస్తూ ప్రతిపక్ష లీడర్లను, మీడియా ప్రతినిధులను అడ్డుకుంటున్నారు. శనివారం  కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు డా.వంశీకృష్ణ, బీజీపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లెని సుధా కర్​ రావు, ఇతర లీడర్లను మధ్యలోనే అడ్డుకొని వివిధ పోలీస్​ స్టేషన్లకు తరలించారు. ఆదివారం ఎల్లూరు బయలు దేరిన సీపీఐ, ఎమ్మార్పీఎస్​ నేతలను మధ్యలోనే అడ్డుకుని వెనక్కిపంపించారు. కానీ  సోమవారం భారీ కాన్వాయ్​తో వెళ్లిన టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు,వారి అనుచరులు, కార్యకర్తలను పోలీసులే దగ్గ రుండి మరీ ఎస్కార్ట్​తో ఎల్లూరు తీసుకెళ్లారు. వారు పంప్​హౌస్​ను పరిశీలించినంత సేపు కాపలా కాశారు. అదే టైంలో సీపీఎం నేతలను కొల్లాపూర్​లో అడ్డుకున్నారు.  నిరసనగా రోడ్డుపై బైఠాయించిన లీడర్లను లాగిపడేశారు. ఈ సందర్భంగా సర్కారు, పోలీసుల తీరును ప్రతిపక్ష నేతలు తప్పుపడుతున్నారు. ఎల్లూరు పంపుహౌస్​ నీటిలో మునగడం వల్ల లక్షల ఎకరాల్లో పంటల సాగు, వేలాది గ్రామాలకు తాగునీరు నిలిచిపోనుందని, కోట్ల నష్టం జరిగినందున, ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని అంటున్నారు. కానీ టీఆర్​ఎస్​ ప్రభుత్వం తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని మండిపడుతున్నారు. బార్డర్​లో జరుగుతున్న యుద్ధాలను సైతం జర్నలిస్టులు కవర్​ చేస్తున్నారని, అలాంటిది పంప్​హౌస్​ వద్దకు రాకుండా మీడియాపై ఆంక్షలు విధించడమేంటని కాంగ్రెస్, బీజేపీ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇలాంటి ఉదంతాలు ఎప్పుడూ లేవని గుర్తు చేస్తున్నారు.

వాళ్లను అనుమతించండి: టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలకు లిఫ్ట్​ ఇరిగేషన్ అడ్వైజర్​ సలహా

ప్రతిపక్ష నేతలు, మీడియాను అనుమతించేలా చర్యలు తీసుకోవాలని సోమవారం ఎల్లూరు పంపుహౌస్​ పరిశీలనకు వెళ్లిన టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలకు లిఫ్ట్​ ఇరిగేషన్​ అడ్వైజర్ పెంటారెడ్డి సూచించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఇతర లీడర్లను అడ్డు కోవడం వల్ల రాద్ధాంతం జరుగుతోందని ఈ విషయంలో సీఎం కేసీఆర్​ను ఒప్పించాలని ఆయన కోరారు. ఎవరు వచ్చినా నిండిన పంప్​హౌజ్​, సర్జ్​పూల్​ నీటిని తోడే పైపులను చూసి వెళ్లాల్సిందే కదా? అన్నారు. పూర్తిగా డీ వాటరింగ్ జరిగితే తప్ప కారణాలు తెలియవని, అప్పటివరకు ప్రతిపక్ష నేతలను, మీడియాను అనుమతించాలని పెంటారెడ్డి హితవు పలికారు. దీంతో విషయాన్ని సీఎం దృష్టికి  తీసుకువెళ్తామని ప్రభుత్వ విప్​ గువ్వల బాల రాజు చెప్పారు.

ఏం కొంపలు మునిగాయని వస్తున్నరు
ప్రతిపక్ష నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫైర్
ఎల్లూరు పంప్ హౌస్ మునిగిపోవడం దురదృష్టకరమని, కానీ ప్రతిపక్ష లీడర్లు దానిపైనా రాజకీయాలు చేస్తున్నారని, ఏదో కొంపలు మునిగిట్లు ఉరికివస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే‌లు విమర్శించారు. సోమవారం ప్రభుత్వ విప్ గువ్వల బాల రాజు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, బీరం హర్షవర్దన్ రెడ్డి తదితరులు నీటమునిగిన పంప్ హౌజ్‌ను పరిశీలించారు. లిఫ్ట్ స్కీమ్ల అడ్వైజర్ పెంటారెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. 20 రోజుల్లోగా ఎల్లూరు లిఫ్టు అందుబాటులోకి వస్తుందని, వారం రోజుల్లో డీవాటరింగ్ పనులు పూర్తిచేసేందుకు రంగనాయకమ్మ ప్రాజెక్టు నుంచి మోటార్లు తెప్పిస్తున్నారని చెప్పారు. పంప్‌హౌజ్‌లో జరిగింది సాంకేతిక ప్రమాదమేనని, ప్రభుత్వమే కావాలని చేసినట్లు ప్రతిపక్ష నేతలు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి విమర్శించారు.

For More News..

నాలాలపై నిర్మాణాలు కూల్చకుండా స్టే తెచ్చుకుంటున్న జనాలు

వ్యవసాయం నుంచి విమానం​ దాకా.. అన్నీ మార్చేస్తాం

మధ్యప్రదేశ్​లో ‘ఐటెం’ వివాదం