మా సర్కారు ఉన్నందువల్లే వివక్ష పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

మా సర్కారు ఉన్నందువల్లే వివక్ష  పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్.. ఇండియా బడ్జెట్ కాదని.. బిహార్ బడ్జెట్ అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఉండటంతోనే వివక్ష చూపిస్తున్నదని మండిపడ్డారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసమే బడ్జెట్ పెట్టినట్లు ఉందని విమర్శించారు. ‘‘బిహార్​లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే ఆ రాష్ట్రానికి ఎక్కువ ప్రాజెక్టులు, భారీగా నిధులు కేటాయించారు. 

తెలంగాణపై బీజేపీ వివక్ష చూపిస్తున్నది. రూ.50.65 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం.. తెలంగాణకు ఒక్కపైసా కూడా ఇవ్వలేదు. రైల్వే ప్రాజెక్టులు, విభజన హామీలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఐటీఐఆర్, బయ్యారం కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం లాంటి అనేక ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నయ్’’అని మహేశ్ గౌడ్​ పేర్కొన్నారు.