మాస్టర్ ప్లాన్‌పై రైతులతో చర్చించి, సమస్య పరిష్కారం చేయాలె : రేవంత్ రెడ్డి

కామారెడ్డి బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ బంద్ లో పార్టీ శ్రేణులు పాల్గొని, విజయవంతం చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేసి ప్రజాక్షేత్రంలో సభలు జరిపి రైతులతో చర్చించాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యం వల్లనే సమస్య జఠిలం అయ్యిందన్న రేవంత్ రెడ్డి.. వెంటనే ప్రభుత్వం రైతులతో చర్చించి సమస్యలను పరిష్కరించి, న్యాయం చేయాలని కోరారు. రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

కామారెడ్డి కొత్త మాస్టర్​ప్లాన్​కు వ్యతిరేకంగా వందలాది మంది రైతులు కదం తొక్కారు. తమను సంప్రదించకుండా తమ భూములను ఇండస్ట్రియల్​, గ్రీన్​జోన్​లో పెట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులతో కలిసి వచ్చి కామారెడ్డి కలెక్టరేట్​ ముందు బైఠాయించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పలువురు గాయపడ్డారు. కొందరు మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. ర్యాలీలు, ధర్నాలతో దాదాపు 10 గంటల పాటు కామారెడ్డి పట్టణంలో హైటెన్షన్​ వాతావరణం నెలకొంది. మాస్టర్​ ప్లాన్​కు వ్యతిరేకంగా నెలరోజులుగా ఆందోళన చేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం, తన భూమి ఇండస్ట్రియల్​ జోన్​లోకి పోతే తనకు నష్టం జరుగుతుందన్న ఆవేదనతో రాములు అనే రైతు బుధవారం ఆత్మహత్య చేసుకోవడంతో సర్కారుపై రైతులు కన్నెర్ర చేశారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో అడ్లూర్​, అడ్లూర్​ఎల్లారెడ్డి, టెకిర్యాల్, లింగాపూర్​, ఇల్చిపూర్​ గ్రామాలకు చెందిన వందలాది మంది  రైతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయమే కామారెడ్డి జిల్లా కేంద్రానికి తరలివచ్చారు.