డిజిటల్ వ్యవసాయం చేస్తున్న యువ రైతులు
రైతు తన పంటని ఓఎల్‌ఎక్స్‌లో అమ్ముకోవటం ఎప్పుడైనా చూశారా? వాట్సాప్ లో రైతులంతా మాట్లాడుకోవటం, ఫేస్ బుక్, ట్విటర్ లలో తమ పంటల గురించి మాట్లాడుకోవటం… అసలు ఊహ కైనా అందాయా ఇవన్నీ? ఇప్పుడు అది సాధ్యం చేశాడో యువరైతు. చదువుకున్న వాడు ఒక వ్యవస్థని ఎలా మార్చగలడో చేసి చూపిస్తున్నాడో యువకుడు.
ఎం బి ఎ చదువుకున్నాడు. గుజరాత్ లోని టాటా సంస్థలో ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ గా ఉద్యోగం కూడా వచ్చింది. జీతం కూడా బాగానే ఉంది. ఎవరికైనా ఇంతకన్నా కావాల్సింది ఏముంది? కానీ అతనికి మాత్రం ఎందుకో జీవితంలో కావాల్సిన “కిక్” దొరకలేదు. జాబ్ మానేశాడు. తిరిగి తన సొంత ఊరు వచ్చి వ్యవసాయం చేయటం మొదలు పెట్టాడు. ఇదేమీ తెలుగు సినిమా కథ కాదు. ఇది నిజమైన కథ… ఈ కథలో హీరో ఇజాప రవీందర్.
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన ఇజాప రవీందర్‌ది వ్యవసాయ కుటుంబం. చేస్తున్న జాబ్ నచ్చలేదు. వ్యవసాయం వైపు వచ్చేశాడు. కానీ రెగ్యులర్ రైతులా కాదు ఈ తరం స్పీడ్ ఎలా ఉంటుందో ఆలోచించి మరీ వ్యవసాయాన్ని, తోటి రైతులనీ అప్‌డేట్ చేస్తున్నాడు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల తో పాటు, సోషల్ మీడియాను వ్యవసాయానికి వేదిక గా మార్చేశాడు.
నేనూ రైతుని అవుతా
ఎంబిఎ అయిపోయాక ఏడాదిన్నర పాటు గుజరాత్‌లో జాబ్ చేశాడు ఇజాప రవీందర్. కానీ వ్యవసాయం మీద ఉన్న ఇష్టం మాత్రం అక్కడ నిలువనివ్వలేదు. ఊరికి వచ్చి “నేనూ రైతుని అవుతా” అని ఇంట్లో చెప్పేశాడు. ఇంట్లో కూడా ఇంత చదువు చదివి మట్టిలో పనేంటి? అని అడగలేదు. సంతోషంగా ఒప్పుకున్నారు. కొన్నేళ్లపాటు తండ్రి సూచనలు తీసుకున్నాడు. వ్యవసాయంలో సాటి రైతులు పడే అవస్థలు గమనించాడు. రైతుల కోసం ఏదైనా చేయాలని ఆలోచించాడు. ఎక్కువ చదువు లేకపోవటం వల్ల, ఫెర్టి లైజర్స్‌పై సరైన అవగాహన లేక రైతులు మోసపోతున్నారని అర్థం చేసుకున్నాడు. అధికారులని కలవాలన్నా, కొత్త వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలన్నా మంచి ప్లాట్‌ఫామ్ సోషల్ మీడియా అనుకున్నాడు.
రైతులతో వాట్సాప్ గ్రూప్
రైతు సమస్యల కోసం “క్రాప్ డాక్టర్” అనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. ముందు తన మండలంలో ఉన్న రైతులు , అగ్రికల్చర్ ఆఫీసర్లు, రిటైర్డ్ అగ్రికల్చర్ ఆఫీసర్‌లు, సీడ్ కంపెనీ యజమానులు, ఫెర్టి లైజర్ కంపెనీ యజమానులను ఆ గ్రూపులో చేర్చాడు. ఇక్కడ రైతులు తన పొలంలో వచ్చిన తెగుళ్ల వివరాలను ఇందులో పోస్ట్ చేస్తే అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఆ సమస్యకు పరిష్కారం చెబుతారు. ఫెర్టిలైజర్ షాప్ ఓనర్ లు దానికి ఎలాంటి మందులు వాడాలో రిఫర్ చేస్తారు. వాటిల్లో ఏది తక్కువ ధరలో వస్తుంది? ఆ మందును ఇంతకు ముందు ఎవరైనా వాడారా? వాడితే ఎలాంటి రిజల్ట్ వచ్చింది? లాంటి విషయాల మీద చర్చ జరుగుతుంది. ఎవరైనా రైతులు కొత్త పద్ధతిలో వ్యవసాయం చేస్తుంటే… ఆ వివరాలని అందరికీ చెబుతూ వాళ్ల ఎక్స్‌పీరియెన్స్‌ని ఇక్కడ షేర్ చేసుకుంటారు. ఈ విధానం ఇప్పుడు ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ లలో కూడా మొదలు పెట్టారు. ఈ గ్రూపులో కేవలం నిజామాబాద్ జిల్లా మాత్రమే కాకుండా నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాద్, సిద్దిపేట,మహబూబ్ నగర్, నల్గొండ,హైదరాబాద్, చిత్తూరు ఇలా చాలా జిల్లాల రైతులు ఉన్నారు.
ఆదర్శ రైతు అవార్డు
రవీందర్ ప్రయత్నాలు కేవలం సోషల్ మీడియాతో ఆగిపోలేదు. పొలాల్లోనే రకరకాల ప్రయోగాలు మొదలు పెట్టాడు. ఎరువులు, పురుగు మందులను పొలాల్లోనే టెస్ట్ చేస్తున్నారు. ఈ మధ్య పసుపులో సోకిన “మర్రాకు తెగులు” ఇబ్బంది పెట్టింది. దాంతో ఉప్లూర్ గ్రామంలో ఓ రైతుకు చెందిన ఎకరం పసుపు చేనును డివైడ్ చేశారు. ఒక్కో భాగంలో ఒక్కో కంపెనీకి చెందిన మందులను పిచికారి చేశారు. వివిధ గ్రామాల నుంచి ఉత్తమ రైతులను పిలిచి, ఏ మందు వాడిన పంట మంచి రిజల్ట్ ఇచ్చిందో చెప్పమన్నారు. వచ్చిన రిజల్ట్‌ని, ఆ ప్లేస్‌లో వాడిన మందు, దాని మోతాదు లాంటి వివరాలని వాట్సాప్ ద్వారా రైతులకు చెప్పారు. ఇలా ఒక తెగులును ఎలా కంట్రోల్ చేయాలో అందరికీ చెప్పారు. రైతుల కోసం రవీందర్ చేస్తున్న సేవలను గుర్తించి ఆల్ ఇండియా రేడియో నిజామాబాద్ 2019 లో కిసాన్ దివస్ రోజు ‘ఆదర్శ రైతు’ అవార్డుతో సత్కరించింది.
ఓఎల్‌ఎక్స్ లో
అందరూ స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఆఫీసుల్లో, స్కూల్ లో జెండా ఎగరేస్తారు. కానీ రవీందర్ మాత్రం తన పొలంలోనే జెండా ఎగరేశాడు. దళారులకు అమ్మకుండా ఓఎల్ ఎక్స్ లో తన పంటలను ఉంచి మద్దతు ధర ఇచ్చి ఎవరైనా కొనుక్కోవచ్చంటూ ఆఫర్ ఇచ్చాడు. ఇలాంటి ప్రయోగం ఇప్పటి వరకూ ఎవరూ చేయలేదు. వడ్లు దళారులకు అమ్ముకోవటం మాత్రమే తెలిసిన రైతు ఓఎల్‌ఎక్స్‌లో పంటని అమ్మటం అద్భుతమైన ఆలోచన. క్రాప్ డాక్టర్ పేరుతో రైతులకు ఏ కాలంలో
ఏ పంట వేయాలని సూచిస్తూ 2021 క్యాలెండర్ తయారు చేశాడు.
ఏ ప్రాంతమైనా ప్రాబ్లమ్ ఏదైనా
వాట్సాప్ ద్వారా రైతులకు సాగులో సలహాలు అందించడం సంతోషంగా ఉంది. దీని ద్వారా ఎక్కడున్నా రైతులు అడిగే సమస్యలకు పరిష్కారం చెప్పగలుగుతున్నాను. నూతనపద్ధతులు, నూతన సాగు విధానాలను రైతులకు అందించగలుగుతున్నాం. -కిషన్ రెడ్డి, రిటైర్డ్ సైంటిస్ట్.
వాట్సాప్‌లో మందులు చెబుతున్నాం
వాట్సాప్ గ్రూపులో పంటలకు సోకే తెగుళ్ళ గురించిన ఫొటోలు, మెసేజ్‌లు పోస్ట్ చేస్తారు. వాటిని చూసి రైతులకు సలహాలు, మందులు వివరాలు చెబుతున్నాం. రైతులు నేరుగా దుకాణాలకు వెళ్లి వాటిని కొని కావాల్సినంత మోతాదులో వాడుతున్నారు.-నవీన్, శాస్త్రవేత్త, కె.వి.కె రుద్రూర్
రైతుల్లో చైతన్యం కోసమే
రైతుల్లో చైతన్యం తేవడమే ఈ వాట్సాప్ ప్రధాన లక్ష్యం సామాజిక మాధ్యమాలు షోషల్ మీడియాద్వారా పొలాల్లో పరిశోధనల ద్వారా వారిలో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ గ్రూప్ లో సాగుకు సంబంధించిన అన్ని రంగాల వ్యక్తులు ఉన్నారు. దాంతో సమస్యకు సులభంగా పరిష్కారం లభిస్తుంది. -ఇజాప రవీందర్
ఇవి కూడా చదవండి
4 నెలల క్లాసులకే మొత్తం ఫీజులా..?
హఫీజ్‌పేట భూ కబ్జాలపై మళ్లీ పోరాటం తప్పదు