- సూర్యాపేటలో దామన్న, రమేశ్‌రెడ్డి కలయికపై సర్వత్రా చర్చ
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట కాంగ్రెస్‌లో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, రేవంత్ రెడ్డి అనుచరుడు పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేశ్‌రెడ్డి కలవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వారు మాత్రమే కలిశారు.. వారి మనసులు మాత్రం కలువలేదని పలువురు నేతలు చర్చించుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో భట్టి యాత్ర ప్రవేశించినప్పటి నుంచి అన్ని చోట్ల పార్టీ నాయకుల మధ్య గొడవలు జరిగాయి. దేవరకొండ, నకిరేకల్‌లో జరిగిన కొట్లాటలపై హైకమాండ్ వరకు ఫిర్యాదులు వెళ్లాయి. అయితే సూర్యాపేటలో భట్టి యాత్ర పైనే పార్టీ కేడర్‌లో టెన్షన్ నెలకొంది. మొదటి రోజు దామోదర్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో రమేశ్‌రెడ్డి కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి.
మరుసటిరోజే మారిన సీన్
ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగిన మరుసటి రోజే సీన్ మారిపోయింది. ఉప్పునిప్పులా ఉన్న రెండు వర్గాలు భట్టితో కలిసి యాత్రలో పాల్గొనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓవైపు దామన్న, ఇంకోవైపు రమేశ్‌రెడ్డి, భట్టితో కలిసి పాదయాత్ర చేశారు. యాత్ర సూర్యాపేటకు రాకముందు నుంచే దామోదర్ రెడ్డి కేతేపల్లి మండలంలో భట్టితో పలు మార్లు భేటీ అయ్యారు. సీఎంగా వైఎస్ ఉన్నప్పటి నుంచే భట్టి, దామోదర్ రెడ్డి మధ్య సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటంతో యాత్ర జనసమీకరణ, రోడ్ మ్యాప్ అంతా దామన్న డైరక్షన్లోనే జరిగింది. చివరకు భట్టికి వడదెబ్బ తగిలి కేతేపల్లిలో మూడు రోజులు పాటు విశ్రాంతి తీసుకున్న ప్పుడు కూడా దామోదర్ రెడ్డి స్వయంగా వైద్య చికిత్సలు చేయించారు.
భట్టి వంద రోజుల యాత్ర పూర్తయిన సందర్భంగా వేడుకలు చేశారు. ఈ పరిణామాలన్నీ ఒక ఎత్తయితే సూర్యాపేటకు భట్టి యాత్ర చేరుకోగానే రెండు వర్గాల మధ్య అల్లర్లు జరగడం కలవరపాటుకు గురిచేసింది. కానీ తెల్లారేసరికి అవన్నీ సద్దుమణగడం.. ఇద్దరూ కలిసి భట్టితో యాత్రలో పాల్గొనడంపై ఇద్దరి మధ్య జరిగిన చర్చల రహస్యం ఏమిటనే దానిపై సస్పెన్స్ నెలకొంది. కార్నర్ మీటింగ్‌లో ఒకే వేధికను ఇద్దరు కలిసి పంచుకోవడం, ఒకరిపైన మరొకరు ప్రశంసలు కురిపించడం, గిరిజనులతో కలిసి రొట్టెలు తిన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో దామన్న, రమేశ్‌రెడ్డి మధ్య గొడవలు ఆగిపోయినట్టేనని పార్టీలో ఓ వర్గం భావిస్తుండగా, ఇంకోవర్గం మాత్రం మనుషులే తప్ప వాళ్ల మనసులు ఇంకా కలవలేదనే చెబతున్నారు.
చర్చల రహస్యం ఇదేనా?
భట్టి యాత్ర సక్సెస్ చేయడంలో కీలకంగా వ్యవహారించిన దామోదర్ రెడ్డి మంగళవారం రాత్రి భట్టి నియోజకవర్గం దాటే వరకు అంతే పంథా అనుసరించారు. గొడవలు జరిగితే యాత్ర డిస్టబ్ అవుతుందనే ఉద్దేశంతో ముందు నుంచే దామోదర్ రెడ్డి జాగ్రత్తపడ్డారు. తొందరపడి ఎవరైనా గొడవలు చేద్దామని ప్రయత్నించినా, దామోదర్ రెడ్డి వర్గం సైలెంట్‌గా ఉండాలని భట్టి సూచించినట్లు తెలిసింది. మొదటి నుంచి రేవంత్ రెడ్డి ముద్రపడ్డ రమేశ్ రెడ్డి యాత్ర జరిగిన మూడు రోజుల పాటు ఇబ్బందులు పడ్డారు. కానీ పార్టీ తరపున తన బలాన్ని చాటుకునేందుకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. దీంతో భట్టి చివరి రెండు రోజులు రమేశ్ రెడ్డి కేడర్ తో కలిసి యాత్రలో పాల్గొన్నారు.
టికెట్ల విషయంలో ఏదో జరిగి ఉండవచ్చని అందరూ భావించారు. కానీ రెండు వర్గాలు కలిస్తేనే కాంగ్రెస్ సూర్యాపేటలో బలపడుతుందనే క్లారిటీ భట్టి ఇచ్చినట్లు తెలిసింది. పార్టీలో సీనియర్లకు ప్రయారిటీ ఏమాత్రం తగ్గదని , వచ్చే ఎన్నికల్లోనూ సీనియర్ల మాటే చెల్లుతుందనే సంగతిని భట్టి స్పష్టం చేసినట్లు తెలిసింది. ఎవరు సత్తా ఏంటన్నది పార్టీ హైకమాండ్ డిసైడ్ చేస్తదని, ఇప్పటికిప్పుడు ఎవరూ తొందరపడొద్దని చెప్పడంతోనే పాదయాత్ర సవ్యంగా సాగినట్లు రెండు వర్గాల నాయకులు చెబుతున్నారు.