
- మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా ప్రయత్నాలు
మెదక్, వెలుగు: జిల్లాలో ఇప్పుడు నామినేటెడ్పదవుల చర్చ నడుస్తోంది. పదేళ్లుగా అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులు ఎలాంటి పదవులు పొందలేక పోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతల్లో ఆశలు చిగురించాయి. ముఖ్యమంత్రి త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పడంతో జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులు తమవంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, జిల్లా రైతు బంధు సమితి, ఆరు మార్కెట్ కమిటీలు, ఆత్మ కమిటీలు, దేవాలయ కమిటీ చైర్మన్, డైరెక్టర్పదవుల కోసం ఆశావహులు ఇప్పటి నుంచే పార్టీ పెద్దల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు.
మెదక్ కా.. నర్సాపూర్ కా..
ప్రధానంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి ఎక్కువ పోటీ నెలకొంది. నెలకు రూ.50 వేల గౌరవ వేతనంతో పాటు, కారు అలవెన్స్, ప్రొటోకాల్ హోదా ఉండడంతో ఈ పోస్ట్‌కు ఎక్కువ డిమాండ్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు ఈ పదవిని ఆశిస్తున్నారు. మెదక్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచినందున ఈ పదవిని మెదక్ నియోజకవర్గానికి కేటాయించాలని ఇక్కడి కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు.
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆశీస్సులతో ఆ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయినందున ఆ లోటు భర్తీ చేసేందుకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి నర్సాపూర్ నియోజకవర్గానికి కేటాయించాలని అక్కడి కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పదవి ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
పోటీ ఎక్కువే..
జిల్లాలో మెదక్, పాపన్నపేట, రామాయంపేట, చేగుంట, తూప్రాన్ లో వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఆయా కమిటీలకు చైర్మన్ తోపాటు, డైరెక్టర్లు ఉంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కష్టపడిన కాంగ్రెస్నాయకులు ఆయా పదవులు ఆశిస్తున్నారు. మెదక్ నియోజకర్గంలోని మెదక్, రామాయంపేట, పాపన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఆశిస్తున్న వారు స్థానిక ఎమ్మెల్యే ద్వారా, తూప్రాన్, చేగుంట, నర్సాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు ఆశిస్తున్న వారు ఆయా సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జిల ద్వారా ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
మండల స్థాయి నాయకులు చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులు, గ్రామ స్థాయి నాయకులు డైరెక్టర్పదవులు ఆశిస్తున్నారు. అలాగే ఆత్మ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కోసం పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఎండోమెంట్ కమిటీలు ఇంకా రద్దు కానప్పటికీ పాపన్నపేట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల, కౌడిపల్లి మండలంలోని తునికి నల్లపోచమ్మ, నిజాంపేట మండలంలోని చల్మెడ తిరుమలయ్య స్వామి, తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లోని రామప్పగుట్ట దేవాలయ కమిటీ చైర్మన్, డైరెక్టర్ పదవులు ఆశిస్తున్న కాంగ్రెస్ లీడర్లు ఇప్పటి నుంచే తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.