51 ‘ఔటర్’ గ్రామాల విలీనంపై చర్చ

  • సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ గెజిట్
  • మూడు జిల్లాల నుంచి తీసి కలిపిన ప్రభుత్వం
  • అస్కి, ఉన్నతాధికారుల కమిటీ రిపోర్ట్ , సబ్​కమిటీ నివేదిక ఆధారంగానే ప్రక్రియ 
  • జీపీ ఎలక్షన్స్​తర్వాత గ్రేటర్​లో కలుపుతారని ఊహాగానాలు

హైదరాబాద్, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)ను ఆనుకొని ఉన్న 51 గ్రామపంచాయతీలను స్థానిక మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ సర్కార్ గెజిట్ జారీ చేసిన నేపథ్యంలో జనాల్లో చర్చ మొదలైంది. రెండు, మూడు నెలల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో విలీనంపై రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. తమ గ్రామాలను ఇవే మున్సిపాలిటీల్లో కొనసాగిస్తారా? లేక ఇంతకుముందు ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ప్రకటన చేసినట్టు గ్రేటర్ లో విలీనం చేస్తారా అన్న డిస్కషన్​ కొనసాగుతోంది.

గత బీఆర్ఎస్ ​ప్రభుత్వం ఔటర్ రింగ్​రోడ్డు లోపల ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్​లో విలీనం చేస్తామని అప్పట్లో ప్రకటించింది. తర్వాత ఏర్పడిన కాంగ్రెస్​ కూడా ఇదే ప్రస్తావన తీసుకువచ్చింది. ఇప్పుడు గెజిట్​కూడా రిలీజ్​చేసి 51 గ్రామాలను వాటికి దగ్గరగా ఉన్న మున్సిపాలిటీల్లో వీలినం చేసింది. అయితే ఈ విలీన ప్రక్రియ ఆషామాషీగా చేసింది కాదని, పూర్తి స్థాయి రిపోర్టు తెప్పించుకుని, సబ్​కమిటీ సిఫార్సుల మేరకు అభివృద్ధి కోణంలో ప్రక్రియ పూర్తి చేశామని అధికారులుటున్నారు. 

ముందు 45 గ్రామాలే..

ఔటర్​రింగ్​రోడ్లు ఇవతల, అవతల ఉన్న గ్రామాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం హైదరాబాద్​లోని అస్కి( అడ్మినిస్ట్రేటివ్​స్టాఫ్​ కాలేజీ ఆఫ్​ఇండియా)తో ఒక స్టడీని నిర్వహింపజేసింది. తర్వాత రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్​మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి విలీనంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆదేశించింది. ఔటర్ సమీపంలోని 45 గ్రామాలను శివారు మున్సిపాలిటీల్లో విలీనం చేయాలంటూ ప్రతిపాదించడం, అస్కి రిపోర్ట్​, మున్సిపల్​అడ్మినిస్ట్రేషన్ సలహా మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

51కి పెరిగిన సంఖ్య 

ఔటర్​సమీపంలోని గ్రామాల విలీనంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం క్యాబినెట్​సబ్​కమిటీని గత నెల ఒకటో తారీఖున ఏర్పాటు చేసింది. దీనికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు చైర్మన్​గా , మంత్రులు పొన్నం ప్రభాకర్​, అనసూయ సీతక్క, దామోదర రాజనర్సింహ సభ్యులుగా వ్యవహరించారు. వీరు ఔటర్​రింగ్​ రోడ్డు లోపల, అవతల ఉన్న గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు.

అన్ని రకాల చర్చల తర్వాత ఉన్నతాధికారుల కమిటీ, మున్సిపల్​అడ్మినిస్ట్రేషన్​సూచించిన 45 గ్రామాలే కాకుండా ఓఆర్ఆర్ బయట కూడా దానికి ఆనుకొని, దగ్గరగా మరో 6 గ్రామాలు ఉన్నాయని గుర్తించారు. మొత్తంగా 51 గ్రామాలను కూడా విలీనం చేయాలని చేయాలని ప్రతిపాదించారు. దీంతో ప్రభుత్వం సోమవారం రాత్రి 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ గెజిట్​ రిలీజ్​చేసింది. 

విలీనమైన గ్రామాలు ఇవే... 

మేడ్చల్​మల్కాజిగిరి జిల్లా పరిధిలోని పూడూరు, రైలాపూర్ గ్రామాలు మేడ్చల్ మున్సిపాలిటీలోకి.. కీసర,యాద్గార్ పల్లి, అంకిరెడ్డిపల్లి, చీర్యాల్, నర్సంపల్లి, తిమ్మాయిపల్లి గ్రామాలను దమ్మాయిగూడ మున్సిపాలిటీలో కలిపారు. అలాగే బోగారం, గోధుమకుంట, కరీంగూడ, రాంపల్లి దయారా జీపీలను నాగరం మున్సిపాలిటీలోకి..వెంకటాపూర్, ప్రతాపసింగారం, కొర్రెముల్, కాచివాణి సింగారం, చౌదరిగూడ గ్రామపంచాయతీలను పోచారం మున్సిపాలిటీలో విలీనం చేశారు.

అంకుశాపూర్, ఔషాపూర్, మాదారం, ఏదులాబాద్, ఘన్ పూర్, మర్పల్లిగూడలను ఘట్ కేసర్ మున్సిపాలిటీలోకి.. మునీరాబాద్, గౌడవెల్లి గ్రామాలను గుండ్లపోచంపల్లిలోకి...బొమ్రాసిపేట్, శామీర్ పేట్, బాబాగూడ గ్రామపంచాయతీలను తూమ్ కుంట మున్సిపాలిటీ విలీనం చేస్తూ గెజిట్​విడుదల చేశారు.

సంగారెడ్డి జిల్లా పరిధిలోని..కర్దన్​పూర్, ముత్తంగి, పోచారం, పాటి, ఘనాపూర్ గ్రామపంచాయతీలను తెల్లాపూర్ లో విలీనం చేశారు. అలాగే ఐలాపూర్, ఐలాపూర్ తండా, పటేల్ గూడ, దయరా, కిష్టారెడ్డిపేట్, సుల్తాన్ పూర్ గ్రామాలను అమీన్ పూర్ మున్సిపాలిటీలో కలిపారు. 
రంగారెడ్డి జిల్లా పరిధిలోని..బాచారం, గౌరెవెల్లి, కుత్భుల్లాపూర్, తారామతిపేట్గ్రామపంచాయతీలను పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిలోకి..బహదూర్ గూడ, పెద్ద గోల్కొండ, చిన్నగోల్కొండ, హమీదుల్లానగర్, రషీద్ గూడ, ఘన్సీమియాగూడ గ్రామాలను శంషాబాద్ మున్సిపాలిటీలోకి, మిర్జాగూడ గ్రామాన్ని నార్సింగి మున్సిపాలిటీలోకి, హర్షగూడ గ్రామపంచాతీని తుక్కుగూడ మున్సిపాలిటీల్లో విలీనం చేస్తున్నట్టు గెజిట్​లో పేర్కొన్నారు. 

గ్రేటర్​లో కలిపేస్తారా? 

మూడు జిల్లాల పరిధిలోని ఔటర్​సమీప గ్రామ పంచాయతీల పదవీకాలం పూర్తికావడంతో ఇక నుంచి ఆయా మున్సిపాలిటీల కిందనే కొనసాగనున్నాయి. విలీన ప్రక్రియతో రెండు, మూడునెలల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇక్కడి గ్రామాల్లో జరిగే అవకాశం లేదు. ప్రస్తుతం కొనసాగుతున్న మున్సిపాలిటీల పదవీకాలం కూడా వచ్చే ఏడాది జనవరితో పూర్తికానుంది. ఆ తర్వాత ఇప్పుడు విలీనమైన 51 గ్రామపంచాయతీల్లో 33 గ్రామ పంచాయతీలను అభివృద్ధి, ఇతర కారణాలతో గ్రేటర్​లో కలుపుతారని, మిగతా18 గ్రామాలను ఆయా మున్సిపాలిటీల్లోనే కొనసాగిస్తారని స్థానికంగా చర్చించుకుంటున్నారు.

తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ సహా బడంగ్‌‌పేట, బండ్లగూడ జాగీర్, మీర్‌‌పేట్, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌‌నగర్, నిజాంపేట్ కార్పొరేషన్లను, పెద్ద అంబర్‌‌పేట్, ఇబ్రహీంపట్నం, జల్పల్లి ,శంషాబాద్, తుర్కయంజల్ , మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, బొల్లారం , తెల్లాపూర్, అమీన్‌‌పూర్, దమ్మాయిగూడ, నాగారం, ఘట్‌‌కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్, పోచారం మున్సిపాలిటీలను కూడా గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేస్తారని అనుకుంటున్నారు. జీహెచ్ ఎంసీ విస్తరణలో భాగంగానే ఈ కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది.