- తుమ్మల, పొంగులేటి పరిస్థితిపై జిల్లాలో చర్చ..
- ఇద్దరూ బీఆర్ఎస్ లోనే బేజారు అయ్యారని అనుచరుల ఆవేదన
- తుమ్మలకు బీఆర్ఎస్పాలేరు టికెట్ దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తి
- నాలుగేండ్లు ఏ పదవి లేకుండా భంగపడ్డ పొంగులేటి
ఖమ్మం, వెలుగు: ఒకప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చక్రం తిప్పిన కొందరు సీనియర్ నేతల రాజకీయ పరిస్థితి ‘ఓడలు బండ్లు..’ అన్నట్లుగా తయారైంది. అనుచరగణంతో జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ చేసిన వాళ్లకు నేడు పోటీ చేసేందుకు టికెట్లు రాక ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. ఒకరు ఇప్పటికే అధికార పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరగా, ఇద్దరు పార్టీ మారడమా, లేక ఇండిపెండెంట్ గా బరిలోకి దిగడమా అనే సందేహంలో ఉన్నారు.
వాళ్ల అనుచరులు మాత్రం పూలమ్మిన చోటనే మా సారు కట్టెలమ్ముకునే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. తమకు టికెట్లు ఇప్పించాలంటూ జిల్లాలోని లీడర్లను రప్పించుకున్న స్థితి నుంచి, సొంత టికెట్ తెచ్చుకోలేని దుస్థితి వచ్చిందని బాధపడుతున్నారు. వాళ్లలో ఒకరు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాగా, మరొకరు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇంకొకరు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు.
తాజా పరిణామాలే ఉదాహరణ
తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తన హవా నడిపించిన తుమ్మల నాగేశ్వరరావు, అప్పట్లో చాలా మందికి తన చేతుల మీదుగా టికెట్లు ఇప్పించారు. అనేక మంది పార్టీ అధినేతకు తమ పేరును రిఫర్ చేయాలంటూ తుమ్మల ఇంటి చుట్టూ తిరిగిన పరిస్థితి ఉంది. తర్వాత బీఆర్ఎస్లో చేరిన తుమ్మల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హవాను కొనసాగించారు. మంత్రిగా ఉన్న సమయంలో 10 నియోజకవర్గాల్లో అన్నీ తానై చూసుకున్నారు. అలాంటి ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక, నాలుగేళ్లుగా దాదాపు ప్రత్యక్ష రాజకీయాలకు అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు.
ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే సర్వస్వం అంటూ పార్టీ ఆదేశాలు ఉండడంతో, తన వర్గాన్ని కాపాడుకుంటూ వచ్చారు. పార్టీ కార్యకర్తలు, తన అనుచరుల ఇండ్లలో జరిగే ప్రైవేట్ కార్యక్రమాలకు మాత్రమే పరిమితమయ్యారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకే దక్కుతుందంటూ ధీమాగా బీఆర్ఎస్లో కొనసాగుతూ వచ్చారు. చివరకు అది కూడా దక్కకపోవడంతో ఇప్పుడు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్నప్పటికీ, పలువురు లీడర్ల ద్వారా కేసీఆర్ రాయబారం నడిపిస్తున్నారు. తుమ్మల పార్టీ మారకుండా ఉండేందుకు సంప్రదింపులు చేస్తున్నారు.
పొంగులేటి, జలగం పరిస్థితీ ఇంతే..
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది. 2014లో వైసీపీ కీలక నేతగా తన అనుచరులకు ఆయన టికెట్లు ఇప్పించుకున్నారు. ఆ ఎన్నికల్లో తాను ఖమ్మం ఎంపీగా గెలవడంతో పాటు, ఉమ్మడి జిల్లాలో ముగ్గురిని ఎమ్మెల్యేలుగా గెలిపించారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన, 2016లో బీఆర్ఎస్ లో చేరారు. అయినప్పటికీ 2018 ఎన్నికల్లో పొంగులేటికి సీఎం కేసీఆర్ టికెట్ నిరాకరించారు. అంతకు నాలుగేళ్ల ముందు తన చేతుల మీదుగా బీఫామ్‌లు ఇచ్చిన పొంగులేటి, సొంతంగా బీఫామ్ తెచ్చుకోలేని పరిస్థితి వచ్చింది. నాలుగేళ్లు బీఆర్ఎస్లో ఏ పదవి లేకుండా వేచి చూసినా ఫలితం లేకపోవడంతో గత నెలలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు.
మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు పరిస్థితి కూడా దాదాపు ఇంతే. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన, 2004లో సత్తుపల్లిలో కాంగ్రెస్ఎమ్మెల్యేగా అప్పటి టీడీపీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై విజయం సాధించారు. 2009లో ఖమ్మంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి, టీడీపీ అభ్యర్థి తుమ్మల చేతిలో ఓడిపోయారు. 2014లో బీఆర్ఎస్అభ్యర్థిగా కొత్తగూడెం నుంచి విజయం సాధించారు. 2018లో రెండోసారి బీఆర్ఎస్నుంచి పోటీచేసి, కాంగ్రెస్ అభ్యర్థి వనమా చేతిలో ఓడిపోయారు. తండ్రి వెంగళరావు సీఎంగా ఉన్న సమయంలో వెంకటరావు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తన హవా నడిపించారు.