
ఓ వైపు పార్లమెంటులో వక్ఫ్ బిల్లుపై చర్చ జరుతున్న క్రమంలో యూపీలో భద్రత పెంచారు. పోలీసు సిబ్బందిని హైఅలెర్ట్ లో ఉంచారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. సెలవుల్లో ఉన్న పోలీసుల వెంటనే విధుల్లో చేరాలని డీజీపీ ప్రశాంత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సెలవుల్లో అధికారులు, ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరాలి.. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సెలవులు ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
మరోవైపు ఢిల్లీ పోలీసులు పలు సున్నితమైన ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లను పెంచారు. సామాజిక వ్యతిరేక శక్తుల వల్ల ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని డీసీపీలకు ఆదేశాలు జారీ చేశారు. డీసీపీలు తమ తమ ప్రాంతాల్లో శాంతిభద్రతలను కాపాడుకునేందుకు నిఘా పెంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
బుధవారం ( ఏప్రిల్ 2) 1995 నాటి వక్ఫ్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించిన వక్ఫ్ సవరణ బిల్లు, 2024ను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఎనిమిది గంటల చర్చించాలని నిర్ణయించారు అయితే గడువు పొడిగించే అవకాశం ఉంది. బిల్లును ఆమోదింపజేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. బిల్లును పూర్తిస్థాయిలో వ్యతిరేకించాలని ప్రతిపక్షాలు గట్టి పట్టుదలతో ఉన్నాయి.
ఈ వివాదాస్పద బిల్లు వక్ఫ్ చట్టానికి 40 సవరణలను ప్రతిపాదిస్తూ ఆగస్టు 2024లో లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ముఖ్యమైన మార్పులలో ముస్లిం మహిళలు ,ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులలో చేర్చడానికి సంబంధించిన నిబంధనలు, భారతదేశ వక్ఫ్ బోర్డుల నియంత్రణ ,పాలనలో భారీ సంస్కరణలు ఉన్నాయి.
వక్ఫ్ చట్టం, 1995కు ప్రతిపాదించబడిన సవరణ ప్రకారం..ఖచ్చితమైన లెక్కలు నిర్ధారించడానికి వక్ఫ్ బోర్డులు తమ ఆస్తులను జిల్లా కలెక్టర్లతో నమోదు చేసుకోవాలి. ప్రస్తుతం చాలా మంది వక్ఫ్ బోర్డు సభ్యులు ఎన్నికైనవారే కానీ బిల్లు చట్టంగా ఆమోదించబడితే అందరు సభ్యులను ప్రభుత్వం నియమిస్తుంది.