
- కాంగ్రెస్ టికెట్ కోసం 9 మంది దరఖాస్తు
సిద్దిపేట, వెలుగు : సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ప్రత్యర్థులు ఎవరన్నదానిపై చర్చ జోరందుకుంది. గజ్వేల్లో కేసీఆర్ ను ఓడిస్తామని కాంగ్రెస్, బీజెపీ నేతలు గతంలో ప్రకటించినా.. బలమైన అభ్యర్థులను పోటీ చేయించేలా ఎలాంటి చొరవా చూపడం లేదు. దీనికి తోడు కేసీఆర్ పై గజ్వేల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలపాలనే ప్రతిపాదన ముందుకు వచ్చినా అది ఎంత వరకు సాధ్యమవుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది. కొంత కాలంగా బీజెపీ, కాంగ్రెస్ గజ్వేల్లో క్రియాశీలంగా ఉంటున్నాయి. రెండేళ్ల క్రితం పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గజ్వేల్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్టు ప్రకటించారు.
పోటీ పై రకరకాల ప్రచారాలు
గజ్వేల్లో సీఎం కేసీఆర్ పై పోటీ చేసే విషయంపై ప్రధాన రాజకీయ పార్టీల స్పందన అంతుబ్టడం లేదు. . ఏడాది క్రితం వరకు వరకు బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తాడనే ప్రచారం సాగింది. కానీ, ప్రస్తుతం చప్పుడు లేదు. ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని టీజెఎస్ అధ్యక్షుడు కోదండరాం ప్రకటించడం ఆసక్తి కలిగిస్తోంది. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా గద్దర్ కొడుకు సూర్యంను బరిలోకి దించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. గద్దర్ సొంతూరు తుప్రాన్ గజ్వేల్ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఆయన పై ఉన్న సానుభూతి ఎన్నికల్లో ప్రభావం చూపవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కాంగ్రెస్ టికెట్ కు 9 మంది ధరఖాస్తు
గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున 9 మంది దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి తో పాటు పీసీసీ సభ్యుడు మాదాటి జశ్వంత్ రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు, ఎన్ఎస్ యూఐ రాష్ట్ర కార్యదర్శి రాచకొండ ప్రశాంత్, తీగుల్ సర్పంచ్ భానుప్రకాశరావు, నాయకులు కృష్ణారెడ్డి, మాడిడ్యాల శ్రీనివాస్, విజయ్ కుమార్, రవీందర్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
బీజేపీలో టికెట్ ఆశావహులు
బీజెపీ నుంచి పలువురు ఆశావహులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ముఖ్యంగా బీజెపీ నేతలు నందన్ గౌడ్, దారం గురువా రెడ్డి, నలగామ శ్రీనివాస్, కప్పెర బాను ప్రసాద్ రావు, నందాల శ్రీనివాస్ గజ్వేల్ టికెట్ ను ఆశించడమే కాకుండా గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇటీవలి కాలం వరకు చీకోటి ప్రవీణ్ గజ్వేల్ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నాడని ప్రచారం జరిగింది. గజ్వేల్ పట్టణంలో జరిగిన గొడవల సందర్భంగా చీకోటి ప్రవీణ్ పర్యటన పై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఇక్కడి నుంచే పోటీ చేస్తాడనే ఊహాగానాలు సాగినా వాటిని ఆయన ఖండించడం గమనార్హం. బీజెపీ బలమైన అభ్యర్థిని గజ్వేల్లో నిలపాలనుకుంటే స్థానికేతరులను దించే అవకాశం వుంది. గత ఎన్నికల్లో బీజెపీ అభ్యర్థిగా హైదరాబాద్ కు చెందిన ఆకుల విజయ పోటీ చేశారు.