![కౌన్ బనేగా ఢిల్లీ సీఎం..? రేసులో ఐదుగురు కీలక నేతలు](https://static.v6velugu.com/uploads/2025/02/discussions-in-bjp-on-who-will-be-the-new-cm-of-delhi_Juvr3XI2Vl.jpg)
- ప్రచారంలో పలువురి పేర్లు లిస్టులో పర్వేశ్ వర్మ, విజేందర్ గుప్తా,
- కైలాశ్ గెహ్లాట్, మనోజ్ తివారీ, వీరేంద్ర సచ్ దేవా
- బన్సూరీ స్వరాజ్, స్మృతీ ఇరానీ కూడా..
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో కొత్త సీఎం ఎవరనే దానిపై చర్చ మొదలైంది. ఆ పార్టీ ఎవరికి పగ్గాలు అప్పగిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సీనియర్ నేతకు ఇస్తుందా..? లేక మహిళా నేతకు అప్పగిస్తుందా..? లేదంటే అనూహ్యంగా ఏదైనా కొత్త పేరును తెరపైకి తెస్తుందా..? అనే చర్చ జోరుగా సాగుతున్నది. ఈ క్రమంలో సీఎం రేసులో వీళ్లే ఉన్నారంటూ కొంతమందిపై ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తున్నది.
ఆయనతో పాటు విజేందర్ గుప్తా, కైలాశ్ గెహ్లాట్, మనోజ్ తివారీ, వీరేంద్ర సచ్ దేవా పోటీలో ఉన్నట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా దుష్యంత్ గౌతమ్, బన్సూరీ స్వరాజ్, స్మృతీ ఇరానీ లాంటి వాళ్లకీ అవకాశం లేకపోలేదని చర్చ జరుగుతున్నది. ఏదేమైనా 26 ఏండ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీకి అధికారం దక్కింది. ఈ నేపథ్యంలో సీఎం ఎంపికపై ఆ పార్టీ హైకమాండ్ ఆచితూచి అడుగులు వేయనుంది. బీజేపీ ఎప్పటిలాగే సంప్రదాయాన్ని పాటిస్తూ సీఎం అభ్యర్థి లేకుండానే ఢిల్లీ ఎన్నికల బరిలోకి దిగింది. ఇప్పుడు అనేక అంశాలు, సమీకరణాలు పరిగణనలోకి తీసుకుని సీఎంను ఎంపిక చేయనుంది.
ప్రచారంలో ఉన్న పేర్లు ఇవే..
పర్వేశ్ వర్మ: ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్‌ను ఓడించి ట్రబుల్ షూటర్ అనిపించుకున్నారు పర్వేశ్ వర్మ. ఈయన ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కొడుకు. 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున వెస్ట్ ఢిల్లీ సెగ్మెంట్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ సెగ్మెంట్లో పోటీ చేసి, 4 వేల ఓట్ల తేడాతో కేజ్రీవాల్‌ను ఓడించారు.
విజేందర్ గుప్తా: ఈయన బీజేపీ వెటరన్ లీడర్. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నప్పటి నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి అంచెలంచెలుగా ఎదిగారు. మొదట మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2013లో న్యూఢిల్లీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కేజ్రీవాల్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత రోహిణి నియోజకవర్గం నుంచి 2015, 2020, 2025లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు.
కైలాశ్ గెహ్లాట్: ఆప్ సర్కార్‌లో మంత్రిగా పని చేసిన కైలాశ్ గెహ్లాట్.. ఎన్నికలకు ముందు 2024 నవంబర్ లో బీజేపీలో చేరారు. ఈసారి ఎన్నికల్లో బిజ్వాసన్ సెగ్మెంట్ నుంచి ఆప్ లీడర్ సురేందర్ భరద్వాజ్‌పై 8 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇంతకుముందు నజఫ్ గఢ్ సెగ్మెంట్ నుంచి 2015, 2020లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈయన జాట్ కమ్యూనిటీలో ప్రముఖ నేత.
మనోజ్ తివారీ: ఈయన బీజేపీ ఎంపీ. నార్త్ ఈస్ట్ ఢిల్లీ సెగ్మెంట్ నుంచి పోయిన లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందారు. తివారీ ఎమ్మెల్యేగా గెలవనప్పటికీ, ఆయనకున్న పేరుప్రఖ్యాతుల దృష్ట్యా సీఎం పదవికి హైకమాండ్ పరిశీలించే అవకాశం ఉంది. పూర్వాంచల్ రీజియన్‌లో తివారీకి మంచి పట్టుంది. ఈ ఏడాది చివర్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తివారీ పేరును పరిగణనలోకి తీసుకునే చాన్స్ ఉంది.
వీరేంద్ర సచ్ దేవా: బీజేపీ ఢిల్లీ చీఫ్‌గా వీరేంద్ర సచ్ దేవా పని చేస్తున్నారు. ఈయన పంజాబీ కమ్యూనిటీకి చెందిన లీడర్. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఆప్‌కు దీటుగా బదులిస్తూ దూసుకెళ్లారు. తరచూ వార్తల్లో నిలిచారు..
వీళ్లకూ చాన్స్..
సీఎం పదవికి మరికొంత మంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ మహిళను సీఎం చేయాలని పార్టీ హైకమాండ్ భావిస్తే.. బన్సూరీ స్వరాజ్, స్మృతీ ఇరానీ పేర్లను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సుష్మా స్వరాజ్ కూతురైన బన్సూరీ స్వరాజ్.. ప్రస్తుతం న్యూఢిల్లీ ఎంపీగా ఉన్నారు. ఒకవేళ దళితుడిని సీఎం చేయాలని హైకమాండ్ భావిస్తే.. పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ దుష్యంత్ గౌతమ్ పేరును పరిశీలించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక పార్టీలు మారి బీజేపీలో చేరిన అర్విందర్ సింగ్ లవ్లీ, రమేశ్ బిధూరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.