విశ్లేషణ: మాకేమో రోగాలు.. ఆళ్లకేమో కొలువులా?

విశ్లేషణ: మాకేమో రోగాలు.. ఆళ్లకేమో కొలువులా?

తెలంగాణలో బోలెడు పరిశ్రమలున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి నుంచి మొదలుపెడితే కరీంనగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఫార్మా, గ్రానైట్, సిమెంట్​ఫ్యాక్టరీలు ఇలా ఎన్నో ఏర్పాటయ్యాయి. కానీ ఇక్కడుండేటోళ్లకు మాత్రం చేసేందుకు పని ఉండట్లేదు. తినేందుకు బువ్వ ఉండట్లేదు. ఈ ఫ్యాక్టరీలు, సంస్థల్లో పనిచేసేటందుకు వచ్చే వాళ్లంతా బయటివాళ్లే. సెక్రటేరియెట్‌‌ నుంచి మొదలు పెడితే మారుమూల ఇటుక బట్టీల దాకా ఇదే పరిస్థితి. ఒకవైపు ఫ్యాక్టరీల వల్ల పొల్యూషన్‌‌ పెరిగి ఇక్కడి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. వీటి వల్ల ఈడుండెటోళ్లకేమో రోగాలు రొష్టులు, బయటకెళ్లి వచ్చినోళ్లకేమో కొలువులా? ఇదెక్కడి న్యాయం అంటే పట్టించుకునే నాథుడు లేడాయె. పరిశ్రమలు అభివృద్ధికి మంచిదే. కానీ అవి మానవ మనుగడకు ప్రమాదకరంగా మారకూడదు. నిబంధనలకు విరుద్ధంగా, యాజమాన్యాల స్వార్థం కోసం నడిచే పరిశ్రమలను నియంత్రించి స్థానికులకు న్యాయం చేయాలి.

ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట ప్రాంతంలోని మేళ్ల చెరువు మండలం సిమెంట్‌‌ పరిశ్రమలకు కేంద్రంగా మారింది. మూడు దశాబ్దాల క్రితమే ఇక్కడ సిమెంట్‌‌ ఫ్యాక్టరీలను స్థాపించారు. మేళ్లచెరువు, మఠంపల్లి మండలాల్లో సిమెంట్‌‌ పరిశ్రమలకు కావల్సిన సున్నపురాయి వేల ఎకరాల్లో నిక్షిప్తమై ఉంది. ఒక్క మేళ్లచెరువు మండలంలోనే ప్రియా సిమెంట్‌‌(రైన్) అల్ట్రాటెక్‌‌, మైహోమ్, జువారి సాగర్‌‌, భీమా, కాకతీయ, నాగార్జున లాంటి పదిహేను సిమెంట్​ కంపెనీలు ఉన్నాయి. కానీ ఎన్నో ఏండ్లుగా అక్కడి ప్రజలు సొంత ఊళ్లలో ఉద్యోగాలు లేక, సిమ్మెంట్‌‌ ఫ్యాక్టరీల కాలుష్యానికి రోగాల బారిన పడుతూ బతుకులు ఈడుస్తున్నారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకపోవటం నల్గొండ జిల్లాకే  పరిమితం కాదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. తెలంగాణ సెక్రటేరియెట్‌‌ నుంచి మారుమూల ఇటుక బట్టీల దాకా ఇదే పరిస్ధితి కొనసాగుతోంది. 

లోకల్​ వారికి కొలువులు లేవు
తెలంగాణలో 30 ఏండ్లుగా ఎన్నో పరిశ్రమలు ఉన్నా 90 శాతం పైగా స్థానికేతరులే ఉపాధి పొందుతున్నారు. అరకొర అవకాశాలు మాత్రమే స్థానికులకు కల్పిస్తున్నారు. వాళ్లను కూడా కాంట్రాక్టు కింద మాత్రమే తీసుకుంటున్నారు. యాజమాన్యాలు చేస్తున్న మోసాలను లేబర్‌‌, మైనింగ్ తదితర అధికారులు కట్టడి చేయటంలేదు. స్థానికుల్లో ఐటీఐ, బీటెక్‌‌ లాంటి సాంకేతిక విద్య చదివిన వారు వేలాది మంది ఉన్నారు. వారికి ఉద్యోగావకాశాలు ఇవ్వకుండా, బయట నుంచి వచ్చిన వాళ్లకు అవకాశాలు ఇచ్చి లోకల్​ వారికి అన్యాయం చేస్తున్నారు. ఇది సహజ న్యాయానికి, సామాజిక న్యాయానికి విరుద్ధం కాదా? అధికారులు ఈ అన్యాయాలపై ఎందుకింత అలసత్వం చూపుతున్నారు? ఈ ఫ్యాక్టరీల నిర్మాణంలో కూలీలుగా వేలాది మంది స్థానికులు పనిచేశారు. ప్రాణాలు కూడా కోల్పోయారు. వారి చెమట ధారలతో అంగుళమంగుళం నిర్మాణం చేసిన ఫ్యాక్టరీల్లో వారికి ఎందుకు అవకాశాలు రావటంలేదు?

లాంగ్వేజీ ప్రాబ్లెమ్‌‌
జాతీయ రాహదారులపై టోల్​ వసూలు చేసే సిబ్బందిని యాజమాన్యం బీహార్‌‌ నుంచి తెప్పించుకుంటున్నారు. లాంగ్వేజ్‌‌ ప్రాబ్లెమ్‌‌తో స్థానికులకు, వారికి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇది శాంతిభద్రతల సమస్యకు కూదా దారి తీస్తోంది. ఓల్డ్‌‌ సిటీలో గాజుల పరిశ్రమలో కూడా బీహార్‌‌, ఉత్తరప్రదేశ్ లాంటి నార్త్‌‌ ఇండియన్స్‌‌ని దిగుమతి చేసుకుని యాజమాన్యాలు కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ.. స్థానిక నిరుద్యోగ యువతకు అన్యాయం చేస్తున్నాయి. ఉపాధి అవకాశాలు లేక యువత పక్కదారి పడుతున్నారు. ఉపాధి విషయాలను విస్మరించడం విపరీత పోకడలకు దారి తీసే అవకాశం ఉంది. రిటైర్‌‌మెంట్‌‌ వల్ల ఉద్యోగ ఖాళీలు వేలల్లో ఉన్నాయి. సెక్రటేరియెట్‌‌, కలెక్టరేట్లలో కూడా స్థానికతను, రిజర్వేషన్లను పాటించటం లేదు. నీళ్లు, నిధులు, నియామకాల ఆశయం కోసమే సాగిన తెలంగాణ ఉద్యమం సార్థకం కావాలంటే స్థానికులకు కచ్చితంగా ఉద్యోగాలు కల్పించాల్సిందే.

అంతా ఇతర రాష్ట్రాల వారే
చాలా ప్రాజెక్టులు, ఫ్యాక్టరీల నిర్మాణ సమయంలో ఎంతో మంది మరణించారు. వారి అమాయకత్వం, పేదరికాన్ని ఆసరాగా చేసుకుని పదో పరకో చట్టవిరుద్ధంగా చేతిలో పెట్టి యాజమాన్యాలు చేతులు దులుపుకుంటున్నాయి. ఆ ప్రాంతాలన్నీ దుమ్ముధూళి, ధ్వని, వాయు కాలుష్యాలకు నిలయాలుగా మారాయి. స్థానికేతరులకు ఉపాధి కల్పించటాన్ని, తమ పిల్లలను నిరుద్యోగులుగా మిగిలిపోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా ఉపాధి పొందుతున్న వారిలో కోస్తా, రాయలసీమ జిల్లాలకు చెందిన వారే ఎక్కువ. నార్త్‌‌ ఇండియన్లు కూడా కొంతమంది ఉన్నారు.

చిన్న వ్యాపారులుగా మారుతున్నారు
సరైన ఉద్యోగాలు రాకపోవడంతో స్థానికులు కూరగాయలు, పండ్లు, పాలు సరఫరా చేసే చిరు వ్యాపారులుగా మారారు. వారికి లోకల్​ ఫ్యాక్టరీల్లో ఉద్యోగావకాశాలు ఇవ్వకపోవటానికి కారణం యాజమాన్యాల స్వార్థమే. వారికి ఉపాధి కల్పిస్తే స్థాన బలం పెరుగుతుందని.. వారు సంఘటితమైతే చట్టవిరుద్ధ చర్యలు సాగవనే దురుద్దేశంతో స్థానికులకు అవకాశం ఇవ్వటం లేదు. ఇక్కడి రాళ్లు.. రప్పలు.. ఇక్కడి నీళ్లును దోపిడీ చేసి చట్టవిద్ధంగా, అప్రతిహతంగా వ్యాపార సామ్రాజ్యాలు నడపడానికి ఎంత ధైర్యం? అందుకు చట్టబద్ధ సంస్థలు సహకరించటం, యాజమాన్యాలు వాటిని లోబరుచుకోవటం ఇంకా ఎంతకాలం?

కాలుష్యంతో రకరకాల వ్యాధులు
ఫార్మా, సిమెంట్‌‌ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం వల్ల సమస్త జీవకోటి కాలుష్యం నుంచి తప్పించుకోలేకపోతోంది. సున్నపురాయి దుమ్ముకు కెమికల్స్ మిళితమై రావటంతో, శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. పశుపక్ష్యాదులన్నీ జబ్బుల బారిన పడుతున్నాయి. వాయు, శబ్ధ కాలుష్యంతో రోగనిరోధక శక్తి తగ్గిమొండి జబ్బులకు అవకాశం కలుగుతోంది.

యాజమాన్యాలకు అవసరం వచ్చినప్పుడే..
యాజమాన్యాలకు అవసరం వచ్చినప్పుడు కార్పొరేట్‌‌ సోషల్‌‌ రెస్పాన్సిబులిటీ, పరిశ్రమలు విస్తరించాలనుకున్నప్పుడు అరకొర సౌకర్యాలు చూపించి, లోకల్‌‌ నాయకులను దువ్వి, అధికారుల అండతో పబ్లిక్‌‌ హియరింగ్‌‌లు జరిపి మమ అనిపిస్తారు. ఇది ఏళ్ల తరబడి జరుగుతున్న తంతు. చట్టవిరుద్ధంగా నడుస్తున్న పరిశ్రమలకు అధికారులు వంత పాడటమేంటని ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతమంది స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చారు. కార్పొరేట్‌‌ సోషల్​ రెస్పాన్సిబులిటీతో ప్రజలకు చెందాల్సిన సౌకర్యాలు ఎంతవరకు అందాయి? వాయు కాలుష్యాన్ని, సౌండ్‌‌ పొల్యూషన్‌‌ కంట్రోల్‌‌కు ఏం చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పేది ఎవరు.

భూముల కొనుగోళ్లలో మాయాజాలం
సిమెంట్​ పరిశ్రమల ప్రారంభానికి ముందే భూముల కొనుగోళ్లలో పెద్ద తంతు జరిగింది. ఈ భూముల్లో ప్రభుత్వ, దళిత భూముల్ని యాజమాన్యాలు ఆక్రమించేశాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా రేవూరు గ్రామానికి చెందిన దళితుల భూములు, స్థానికేతర భూములను ‌‌ఆక్రమించిందని న్యాయపోరాటం జరుగుతోంది. యాజమాన్యాలు ప్రారంభంలో కొంత మంది బ్రోకర్లు ప్రభుత్వ భూములను వ్యక్తుల పేరు మీద రిజిస్ట్రేషన్‌‌ చేసి వారి దగ్గర నుంచి పరిశ్రమల యాజమాన్యాలు కొనుగోలు చేసేలా చేశారు. న్యాయపరమైన చిక్కులు తప్పించుకోవటానికి అలా చేశారు. అతి తక్కువ ధరలకు 1,500 నుంచి 3,000 ఎకరాల వరకు కొన్నారు. వారి అవసరాలకు మించి కొనుగోలు చేసి చట్టాన్ని ఉల్లంఘించారు. ఈ భూములపై విచారణ జరపాలి. ఎంతో లోతుల్లో సున్నపురాయి కోసం బ్లాస్టింగ్స్ పెడుతుంటారు. ఇవి జరిగినప్పుడల్లా భూకంపం వచ్చినట్టు భూమి ఊగిపోతుంది. ప్రియా, రైన్‌‌, జువారి తదితర పరిశ్రమల బ్లాస్టింగ్‌‌ వల్ల రేవూరు, రామాపురం, లంబాడి తండాలు, దొండపాడు తదితర గ్రామాలు విలవిలాడుతున్నాయి. సున్నపురాయి ఉండటం వల్ల ఈ ఊళ్ల ప్రజలు పునాదులు వెయ్యకుండానే ఇండ్లు నిర్మిస్తున్నారు. బ్లాస్టింగ్‌‌ల కారణంగా అవి త్వరగా కూలిపోతున్నాయి. ఈ 30 ఏండ్లలో రెండు, మూడుసార్లు ఇల్లు నిర్మించుకుని ఎంతో మంది పేదలయ్యారు.

పాలకుల పాపం స్థానికులకు శాపం
పరిశ్రమలు స్థానికులకు అన్యాయం చేయటానికి కారణం ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలిచినవారు యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరించటమే. వీరి అండతోనే యాజమాన్యాలు ఇష్టానుసారం అక్రమాలు కొనసాగిస్తున్నాయి. యాజమాన్యాలు, నాయకులు పరస్పరం సహకరించుకుంటూ ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటూ స్థానికులకు అన్యాయం చేస్తున్నారు. సర్పంచులు, ఎంపీటీసీలకు డబ్బు ఎరవేసి లోబరచుకుంటున్నాయి. వారి పిల్లలకు ఉపాధి కల్పిస్తాయి, వారి సొంత నిర్మాణాలకు ఉచితంగా సిమెంట్‌‌ ఇస్తాయి. ఫ్యాక్టరీల్లో కాంట్రాక్టులు ఇస్తాయి. అధికారులకు, నాయకులకు వీరి గెస్ట్‌‌ హౌస్​ల్లో మర్యాదలు జరుగుతాయి. కానీ స్థానికులకు మాత్రం ఎలాంటి సహకారం, సాయం అందడం లేదు. దశాబ్దాలుగా స్థానికులకు జరుగుతున్న అన్యాయాలను ఇక సాగనియ్యమని, అవసరమైతే న్యాయపోరాటం చేసేందుకు నిరుద్యోగ యువత సిద్ధమవుతోంది.

లోకల్​ వారికే ఉద్యోగాలివ్వాలె
స్థానిక రెవెన్యూ, పోలీస్‌‌లతోపాటు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులను కూడా పావులుగా మార్చుకోవటం వల్లే యాజమాన్యాలు స్థానికులను పట్టించుకోవడం లేదు. సామాజిక, ఆర్థిక వెనుకబాటు వల్ల తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఇక్కడి ప్రజలు గుర్తించలేకపోతున్నారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌‌లో స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని జగన్‌‌మోహన్‌‌రెడ్డి ప్రత్యేక జీవో తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తుంటే.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం చేసిన తెలంగాణలో అలాంటి నిబంధనలు లేకపోవటం విచారకరం. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా స్థానికులకు ఉద్యోగ కల్పనలో ఎలాంటి మార్పులు రాలేదు. లోతైన మైనింగ్‌‌, కాలుష్యం వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. హెవీ బ్లాస్టింగ్‌‌ల కారణంగా భూ స్థితిగతుల్లో మార్పులు వస్తాయి. ఇటీవల కాలంలో నల్గొండ ప్రాంతంలో తరచు భూకంపాలు రావడానికి సిమెంట్‌‌ పరిశ్రమల బ్లాస్టింగ్​లే కారణమని నిఫుణులు కూడా భావిస్తున్నారు.
- సాధం వెంకట్‌‌, సీనియర్‌‌ జర్నలిస్టు