అక్టోబర్ 28-29 నాటికి సరిహద్దుల్లో వైదొలగనున్న భారత్, చైనా దళాలు

అక్టోబర్ 28-29 నాటికి సరిహద్దుల్లో వైదొలగనున్న భారత్, చైనా దళాలు

తూర్పు లడ్డాఖ్ సెక్టార్‌లోని డెమ్‌చోక్, దేప్సాంగ్ ప్లెయిన్స్‌లోని రెండు క్లిష్టమైన ఘర్షణ పాయింట్ల వద్ద సైనికుల తొలగింపు శుక్రవారం( అక్టోబర్ 25)  ప్రారంభమైంది. అక్టోబర్ 28--29 నాటికి ఈ ప్రాంతాల్లో భారత్, చైనా దళాలు పూర్తిస్థాయిలో వైదొలుగుతాయని ఆర్మీవర్గాలు వెల్లడించాయి. 

రెండు వైపుల నుంచి దళాలు ఏప్రిల్ 2020 నాటికి ముందు ఉన్న స్థానాలకు తిరిగి వస్తాయి. అన్ని తాత్కాలిక మౌలిక సదుపాయాలు తీసివేయబడతాయని తెలిపాయి. అయితే దేప్ సాంగ్, డెమ్ చోక్ ప్రాంతాల్లో రెండు వైపులనుంచి నిఘా కొనసాగనుంది.  అక్టోబర్ 31 నుంచి పెట్రోలింగ్ పున:ప్రారంభమవుతుంది. 

డెస్పాంగ్, డెమ్ చోక్ ఈ రెండు ప్రాంతాల్లో భారత్ సైన్యం, చైనా PLA  రెండూ నిఘా కలిగి ఉంటాయి. దేప్సాంగ్, డెమ్ చోక్ లోని పెట్రోలింగ్ పాయింట్ల వద్ద ఏప్రిల్ 2020కి ముందు భారత బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. 

జూన్ 15, 2020 గాల్వాన్‌లో జరిగిన రక్తపాత ఘర్షణ తర్వాత WMCC 17 సార్లు సమావేశమైంది. పెట్రోలింగ్‌ను విడదీయడం, తిరిగి ప్రారంభించడంపై చర్చలు జరపడానికి సైనిక కమాండర్లు 21 సార్లు సమావేశమయ్యారు. 

రష్యాలోని కజాన్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక భేటీ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సరిహద్దులో శాంతి, సుస్థిరతలను కొనసాగించాలని పిలుపునిచ్చిన క్రమంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. 

ఐదేళ్ల తర్వాత భారత్, చైనా మధ్య జరిగిన తొలి దౌత్య సమావేశం ఇది. రెండు దేశాల నేతలు సరిహద్దు శాంతి స్థాపనకు ఒప్పందాలను స్వాగతించారు. సరిహద్దులో శాంతిని కొనసాగించడం లక్ష్యంగా చర్యలు జరిపారు. 

పరస్పర గౌరవం, విశ్వాసం, సున్నితత్వం ప్రాతిపదికగా ఓపెన్ హార్ట్ తో చర్చలు జరపాలని నిర్ణయించారు. రెండు దేశాల మధ్య శాంతి స్థాపన ప్రపంచ అభివృద్ది లో కీలకం అని ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అన్నారు.