సీసీ కెమెరాల బిజినెస్​ పేరిట గంజాయి సేల్

సీసీ కెమెరాల బిజినెస్​ పేరిట గంజాయి సేల్
  • మంచిర్యాలలో 23.5 కేజీలు పట్టివేత.. 11 మంది అరెస్ట్
  • గోదావరిఖనిలో మరో 96 కిలోల గంజా స్వాధీనం

గోదావరిఖని/మంచిర్యాల, వెలుగు: సీసీ కెమెరాల బిజినెస్‌ పేరిట గంజాయి అమ్ముతున్న11 మందిని మంచిర్యాల పోలీసులు అరెస్ట్‌ చేశారు. రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్‌ గురువారం మీడియాకు వివరాలు తెలిపారు. మంచిర్యాల టౌన్ కు చెందిన సోమ ప్రవీణ్‌కుమార్‌ ఐబీఎక్స్‌రోడ్‌లో ఎస్‌బీఐ కాంప్లెక్స్ కింద ‘వై ఇన్ఫో సొల్యూషన్స్‌’ పేరుతో సీసీ కెమెరాల గోడౌన్‌ ఏర్పాటు చేశాడు. గంజాయి అమ్మేందుకు ప్లాన్‌ చేశాడు.

రాజీవ్‌నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ ఇరుగురాళ్ల సతీశ్‌కుమార్‌, సప్తగిరి కాలనీకి చెందిన మహ్మద్‌ సమీర్, భగవంతంవాడకు చెందిన బీమా అనుదీప్, తిలక్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ ఉబేద్‌, భరత్‌నగర్‌కు చెందిన అర్జున్‌ బాబురావు చౌహన్, కరీంనగర్ కార్ఖానగడ్డకు చెందిన మహ్మద్‌ అజీజ్, మంచిర్యాల రాజీవ్‌నగర్‌కు చెందిన జాడి రాఘవేంద్రస్వామి, నస్పూర్‌కు చెందిన గూడూరు రాము, ఎస్‌కే.అత్తాహర్, సలీంతో పాటు మైనర్‌తో ముఠాగా ఏర్పాటు చేసుకుని గంజాయి అమ్ముతున్నారు.

ఏపీలోని సీలేరు, చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ నుంచి గంజాయిని తెచ్చి గోడౌన్ లో దాస్తున్నారు. ఆ తర్వాత చిన్న ప్యాకెట్లుగా చేసి సేల్ చేస్తున్నారు. సమాచారం అందడంతో పోలీసులు గోడౌన్‌లో తనిఖీలు చేసి రూ.11.75 లక్షల విలువైన 23.5 కిలోల గంజాయితో పాటు 11 సెల్‌ఫోన్లు, ఐదు బైక్‌లు, వేయింగ్‌ మెషీన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 11 మందిని అరెస్ట్‌ చేయగా సోమ ప్రవీణ్ కుమార్ పాటు మరో 10 మంది పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు.

గోదావరిఖని వద్ద.. 
మంథని టు గోదావరిఖని రూట్ లో జీడీకే11వ గని వద్ద టుటౌన్​ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా..   రెండు కార్లలో రూ.48.38 లక్షల విలువైన 96 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని రెండు కార్లను సీజ్ చేశారు. యూపీ, రాజస్థాన్​, ఒడిశాకు చెందిన ఉదయ్​వీర్, రాజ్​లోథి సంజు, కేశవ్​ఖోరా, సోమంత ఖోరా, సూరజ్.. ​చత్తీస్​గడ్ లోని జగదల్ పూర్ చెందిన అర్జున్​భోరి వద్ద గంజాయి కొని మంథని మీదుగా మహారాష్ట్రకు తరలించి అమ్ముతున్నట్టు తేలింది.

కారు డ్రైవర్​సూరజ్తో పాటు అర్జున్​భోరీ పరారీలో ఉన్నారు.  మంచిర్యాల, గోదావరిఖని టుటౌన్​ పోలీసులను రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్​అభినందించారు. పెద్దపల్లి డీసీపీ చేతన, డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీసీ రాఘవేంద్రరావు, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేశ్, మంచిర్యాల ఏసీపీ రత్నపురం ప్రకాశ్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు ప్రసాదరావు, ప్రమోద్, రాజ్ కుమార్, రమేశ్​ ఉన్నారు.