నా కూతురును గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన్రు: దిశా సాలియన్‌ తండ్రి

నా కూతురును గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన్రు: దిశా సాలియన్‌ తండ్రి

 

  • ఆదిత్య ఠాక్రేపై కేసు పెట్టి, సీబీఐ దర్యాప్తుకు అప్పగించండి 
  • బాంబే హైకోర్టులో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ దిశా సాలియన్ తండ్రి పిటిషన్ 
  • బిల్డింగ్ నుంచి దూకితే రక్తం లేదు.. ఫ్రాక్చర్స్ కూడా లేవు 
  • ఆత్మహత్య అని పోలీసులు అబద్ధం చెప్పారని ఆరోపణలు

ముంబై: శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రేపై కేసు నమోదు చేయాలని బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్‌ తండ్రి సతీశ్ సాలియన్ బుధవారం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన కూతురు దిశ.. సామూహిక అత్యాచారం, హత్యకు గురైందని పిటిషన్​లో పేర్కొన్నారు. ఆదిత్య ఠాక్రేతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసి సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. ‘‘2020, జూన్ 8న నా కూతురు దిశ ప్రాణాలు కోల్పోయింది. 

అప్పుడు అధికారంలో ఉన్న శివసేన ప్రభుత్వం.. కొంత మంది రాజకీయ నేతలను కాపాడేందుకు కుట్రపూరితంగా కేసును తప్పుదోవ పట్టించింది. నా కూతురు చనిపోవడం వెనుక ఆదిత్య ఠాక్రే, శివ‌సేన (యూబీటీ) పార్టీ ప్రతినిధి కిశోరి పెడ్నేకర్, మరికొందరి హస్తం ఉంది. వీరిని కాపాడేందుకు అప్పటి ప్రభుత్వం నాపై చాలా ఒత్తిడి చేసింది. 

నిందితులను తప్పించేందుకు కేసును పోలీసులు పక్కదారి పట్టించారు. నా కూతురు బిల్డింగ్​పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నదని తేల్చి హడావిడిగా కేసు మూయించారు’’అని సతీశ్ సాలియన్ పిటిషన్​లో పేర్కొన్నారు. కాగా, దిశ చనిపోయిన ఆరు రోజుల తర్వాత.. అంటే 2020, జూన్ 14న బాంద్రాలోని త‌న అపార్ట్‌మెంట్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి కనిపించాడు. 

సతీశ్ సాలియన్ చేసిన ఆరోపణలేంటి?

సతీశ్ సాలియన్ తన పిటిషన్​లో సంచలన ఆరోపణలు చేశారు. ‘‘నా కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. 2020, జూన్‌ 8న నా కూతురు ఇంట్లో పార్టీ ఏర్పాటుచేసింది. దానికి ఆదిత్య ఠాక్రేతో పాటు అతని సెక్యూరిటీ సిబ్బంది, నటులు సూరజ్‌ పంచోలి, డినో మోరియా, మరికొందరు అటెండ్ అయ్యారు. అప్పుడే నా కూతురిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘటనలో నా కూతురు ఫియాన్సి రోహన్ రాయ్ హస్తం కూడా ఉన్నది. 

అదే రోజు రాత్రి అపార్ట్​మెంట్ 14వ అంతస్తు నుంచి నా కూతురు కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నదని పోలీసులు చెప్పారు. కానీ.. నా కూతురు ఒంటిపై గాయాల్లేవు. రక్తపు మరకలు కూడా లేవు. ఒక్క ఫ్రాక్చర్ కూడా లేదు” అని ఆయన పేర్కొన్నారు. కాగా, సతీశ్ సాలియన్ ఆరోపణల్లో నిజం లేదని ఆదిత్య ఠాక్రే అన్నారు.  తన పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. దీనిపై కోర్టులోనే స్పందిస్తానని స్పష్టం చేశారు.