
మహారాష్ట్రలో దిశా సాలియన్ అనుమానాస్పద మృతి కేసు మరోసారి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐదేళ్ల క్రితం చనిపోయిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఐదేళ్ల క్రితం ముంబైలోని 14 అంతస్తుల భవనంపై నుండి పడి చనిపోయిన దిశా మృతిని అప్పట్లో ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా పోలీసులు తేల్చారు. ఈ ఘటన తర్వాత ఆరు రోజులకే నటుడు సుశాంత్ తన ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. అయితే తాజాగా ఈ కేసు మళ్లీ తెరపైకి రావడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి.
దిశ మృతిపై హైకోర్టుకు వెళ్లారు ఆమె తండ్రి సతీశ్ సాలియన్. దిశ మృతికి సివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే కారణమని ఆమె తండ్రి సతీష్ సాలియన్ ముంబై హైకోర్టులో పిటిషన్ వేశారు. తన కూతురుది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదని, గ్యాంగ్ రేప్ చేసి చంపేశారని, దీనిపై విచారణ జరపాలని కోరారు. ఆదిత్య ఠాక్రేకు నార్కో టెస్టు చేయాలని పిటిషన్ లో కోరారు. దీనిపై స్పందించిన ఆదిత్యా ఠాక్రే కోర్టులోనే తేల్చుకుంటామని అన్నారు.
Also Read : పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చుకుని బీజేపీ మాజీ MLA ఆత్మహత్య
మహారాష్ట్రలో ఈ వ్యవహారం మరోసారి మాటల యుద్ధానికి దారితీసింది. అసెంబ్లీలో ఈ వ్యవహారంపై బీజేపీ, ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే ఇదంతా బీజేపీ కుట్ర అని ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఆరోపిస్తోంది. ప్రజా సమస్యలు, నాగ్ పూర్ అల్లర్లను డైవర్ట్ చేసేందుకే ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపిస్తున్నారు.
అసలేం జరిగింది?
2020, జూన్ 9న దిశా సాలియన్ (Disha Salian) అనుమానాస్పద పరిస్ధితుల్లో చనిపోయింది. ముంబైలోని మలద్ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ 14వ ఫ్లోర్ నుంచి పడిపోయి ఆమె ప్రాణాలు కోల్పోయింది. చనిపోవడానికి ముందు ప్రియుడు రోహన్, మరికొంత మందితో కలిసి ఆమె పార్టీలో పాల్గొంది. ఈ నేపథ్యంలో దిశపై లైంగిక దాడి చేసి చంపారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ముంబై పోలీసులు మాత్రం ప్రమాదవశాత్తు మరణించిందని కేసు నమోదు చేశారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని కూడా వార్తలు వచ్చాయి.
దిశ మరణించి వారం రోజులు కూడా గడవకముందే తన అపార్ట్‌మెంట్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ చేసుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. 2020, జూన్ 14న బాంద్రాలోని తన ఇంట్లో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వీరిద్దరి మరణాలకు ఏదైనా లింకు ఉందేమోనని అప్పట్లో అనుమానాలు వచ్చాయి. అయితే దిశా సాలియన్ ఆత్మహత్య చేసుకోలేదని, ఆమెపై లైంగిక దాడి చేసి హత్య చేశారని అప్పటి బీజేపీ ఎంపీ నారాయన్ రాణె ఆరోపించడంతో సంచలనం రేగింది. ఆమె మరణం వెనుక రాజకీయ నేతలు, బాలీవుడ్‌కు చెందిన వాళ్ల హస్తం ఉందని ఆరోపించారు. తనపై జరిగిన లైంగిక దాడి విషయాన్ని సుశాంత్‌తో దిశ చెప్పిందని.. దీంతో అతడిని వాళ్లు వేధించడం మొదలుపెట్టారని, అందుకే సుశాంత్ ప్రాణాలు తీసుకున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఐదేండ్ల తర్వాత ఎందుకీ పిటిషన్:
దిశ సాలియన్ కేసులో ఆమె తండ్రి కోర్టుకు వెళ్లడంపై ఆదిత్య ఠాక్రే స్పందించారు. ఐదేళ్లుగా ఈ కేసు నడుస్తోందని, దీన్ని కోర్టులోనే ఎదుర్కొంటామని అన్నారు. ఈ కేసుపై మహారాష్ట్ర మంత్రి సంజయ్ శిర్సత్ స్పందిస్తూ.. నిందితులను జైలుకు పంపాల్సిందేనని అన్నారు. దిశ తండ్రి ఇన్నాళ్లుగా బయటకు రాలేకపోయాడని, ఇప్పుడు ఓపెన్ అయ్యాడని, ఏ విషయమనేది కోర్టు నిర్ణయిస్తుందని అన్నారు.
శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఈ వ్యవహారంపై స్పందించారు. ఇది రాజకీయ కుట్రలో భాగమేనని అన్నారు. అప్పట్లో ఈ విచారణ మొత్తం దగ్గరుండి చూశానని, ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనేఅని అప్పట్లో పోలీసులు కూడా తేల్చారని అన్నారు. కానీ ఐదేండ్ల తర్వాత మళ్లీ కేసును తిరగదోడుతున్నారంటే దీని వెనుక బీజేపీ రాజకీయం ఉందని రాష్ట్ర ప్రజలకు అర్థం అవుతోందని అన్నారు. ఔరంగజేబ్ ఇష్యూను డైవర్ట్ చేసేందుకు ఈ కేసును మళ్లీ తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు.