తిరుమల కొండపై అపచారం..కొండపైకి తీసుకొచ్చిన కోడిగుడ్ల కూర, పలావ్ అన్నం

తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం.  .. కలియుగ దేవుడు సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తరలి వస్తుంటారు.  కోట్లాది మంది కొలిచే తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కొన్ని నియమాలు.. కట్టుబాట్లు ఉన్నాయి. అయితే తమిళనాడు నుంచి  తిరుమలకు వచ్చిన 28 మంది సభ్యుల బృందం నియమాలకు విరుద్దంగా... కొండపైకి  కోడిగుడ్ల కూర, పలావ్ అన్నం తీసుకొచ్చారు.  పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హిందువులు పవిత్రంగా భావించే  తిరుమల కొండపై అపచారం జరిగింది.  కొంతమంది భక్తులు నియమాలకు విరుద్దంగా మాంసాహారాన్ని కొండపైకి తీసుకొచ్చారు. అన్యమతస్థులను కొండపైకి అనుమతించరు.  కాని ఒక్కోసారి అధికారుల కళ్లు కప్పి.. కొండపైకి వస్తుంటారు.  ఇప్పుడు అలానే వచ్చిన 28 మంది సభ్యుల బృందం.. తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలోని గుమ్మడిపూడి గ్రామానికి చెందిన వారు శుక్రవారం ( జనవరి 18)   అలిపిరి మార్గం ద్వారా తిరుమల కొండకు వచ్చారు. అయితే వీరు తమ వెంట పలావ్.. కోడిగుడ్ల కూర కొండపైకి తీసుకురావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.   ఓ భారీ బాక్సులో కోడిగుడ్ల కూర, పలావ్ తో వారు కనిపించారు. కొండపైకి చేరుకున్న తర్వాత రాంభగీచ బస్టాండ్ కు సమీపంలో పార్కింగ్ ప్రాంతంలో వారంతా తాము తెచ్చుకున్న పలావ్, కోడిగుడ్ల కూర తిన్నారు. 

తిరుమల నియమాలు.. కట్టుబాట్ల ప్రకారం మాంసం, మద్యం, మత్తు పదార్థాలను కొండపైకి అధికారులు అనుమతించరు. కాని  వారు కోడిగుడ్ల కూరను కొండపై  తినడం అక్కడే ఉన్న మిగతా భక్తులు చూసి దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు  28 మంది భక్తుల బృందాన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే తమకు తిరుమల నిబంధనల గురించి తెలియదని..తాము వండుకున్న కోడిగుడ్ల కూరను తమతోపాటు కొండపైకి తీసుకువచ్చినట్లు పోలీసులకు తెలిపారు. 

కోట్లాది మంది భక్తులు భక్తితో కొలిచే దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి. శ్రీవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశవ్యాప్తంగా భక్తులు, సెలబ్రిటీలు నిత్యం తిరుమల కొండకు వస్తుంటారు. అయితే హిందూ మతానికి చెందివారే కాదు కొందరు ఇతర మతాలకు చెందినవారు కూడా తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనాలు చేసుకుంటారు. తిరుమల కొండపై కొన్ని నియమాలు, కట్టుబాట్లు ఉంటాయి.