వాటర్ బోర్డులో 650 మంది సీవరేజీ కార్మికుల తొలగింపు
హైదరాబాద్, వెలుగు: మోరీలు, లెట్రిన్ లైన్లను క్లీన్ చేసిన్రు.. లాక్ డౌన్ లోనూ టైంకు డ్యూటీకి వచ్చిన్రు. జీతం తక్కువైనా కనీసం బతుకుకు భరోసా ఉంటుందని మలంతో నిండిన మ్యాన్ హోల్స్ లోకి దిగిన్రు. అసొంటోళ్లపై వాటర్ బోర్డు అధికారులు కనికరం చూపలేదు. ఏడు నెలల కింద తీసుకొన్న 650 సీవరేజీ కార్మికులందరిని ఒక్కసారిగా తీసేసిన్రు. రాత్రంతా పనిచేయించుకొని పొద్దుగాళ్ల టెర్మినేషన్ చేస్తున్నమని చెప్పిన్రు. దీంతో శనివారం కార్మికులు వాటర్బోర్డు హెడ్డాఫీస్ ఎదుట ధర్నా చేశారు. జాబ్ పోవటంతో ఓ కార్మికుడికి హార్ట్ ఎటాక్ వచ్చింది. కార్మికులను తొలగించినా కార్మిక సంఘాలు అడగలేదు. ఇప్పటివరకు వాటర్ బోర్డు ఎండీ స్పందించలేదు.
లాక్ డౌన్ కు ముందే రిక్రూట్
లాక్ డౌన్ కు ముందు మార్చి 1 న 650 మంది కార్మికులను వాటర్బోర్డు విధుల్లోకి తీసుకుంది. సూపర్ వైజర్లు, క్లీనర్లు, అసిస్టెంట్లుగా థర్డ్ పార్టీ కింద నియమించుకుంది. సర్కార్ జాబ్అంటే సెక్యూరిటీ ఉంటుందని ఆశతో డిగ్రీలు, ఇంటర్ చదివిన వాళ్లు కూడా చేరారు. వీళ్లతో మ్యాన్ హోల్స్ లో మలం శుభ్రం చేయించారు. అధికారులు చెప్పిన పనల్లా చేశారు. ఇప్పుడు చెప్ప పెట్టకుండా జాబ్లోంచి తీసేశారు. ఈనెల1న రాత్రంతా పనిచేయించుకొని పొద్దుగాళ్ల పనిలోకి రావద్దని చెప్పేశారు. థర్డ్ పార్టీ సంస్థ జాబ్ ల నుంచి తీసేస్తే…వాటర్ బోర్డు అధికారులు కనీసం పట్టించుకోవటం లేదు. ఏజెన్సీ వాళ్లతోనే మాట్లాడుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. కార్మికులను తొలగిస్తే వాటర్ బోర్డు ఎండీ నుంచి కనీసం రెస్పాన్స్ కూడా లేదు.
ఇలా తీసేస్తరనుకోలే..
రాత్రి, పగలు కష్టపడి పనిచేసిన తమను ఇలా తీసేస్తారని ఊహించలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా టైమ్ లో కంటైన్ మెంట్ ఏరియాల్లోనూ ప్రాణాలకు తెగించిన డ్యూటీకు వెళ్లామన్నారు. 9 గంటలు డ్యూటీ అయినా అదనంగా12 గంటలు చేయించారని చెప్పారు. ఒక్కసారిగా రావద్దంటే కుటుంబాన్ని ఎలా పోషించాలని కన్నీళ్లు పెట్టుకున్నారు. జాబ్ పోయిందన్న బాధతో ఓ కార్మికుడికి హార్ట్ ఎటాక్ వచ్చిందని హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడని కార్మికులు చెప్పారు. సీవరేజీ నిర్వహణ అంతా లేటెస్ట్ టెక్నాలజీ మెషీన్లతో అని చెప్పుకుంటున్నా మ్యాన్ వల్ గానే చేయిస్తున్నారన్నారు. పైగా సీఎం గౌరవ భృతి ఒక్క నెల మాత్రమే ఇచ్చి ఎగ్గొట్టారని తెలిపారు. ఈ విషయంలో మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ జోక్యం చేసుకొని తమ జాబ్లకు భరోసా ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు.
రోడ్డున పడేస్తే ఊరుకోం
సీవరేజీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. పెండింగ్ లో ఉన్న గౌరవ భృతి ఇవ్వాలి. ఇంకో సంస్థకు ఈ పనులు కట్టబెట్టినా మమ్మల్నే కొనసాగించాలి. ఉద్యోగ భద్రత లేకుండా రోడ్డున పడేస్తే ఊరుకునేది లేదు. మమ్మల్ని తీసేసినా ఒక్క కార్మిక నాయకుడు రాలేదు.
‑ బాలా నర్సింగ్, సీవరేజీ కార్మికుడు
50 మందికిపైగా డిగ్రీ చేసినం..
డిగ్రీ చేసినా ఉపాధి కోసం జీతం తక్కువైనా జాబ్ చేస్తున్నా. 650 మంది లో 50 మందికి పైగా డిగ్రీ చేసినవారు ఉన్నారు. ఎన్ఎం ఆర్(నాన్ మాస్టర్ రోల్) విధానంలో విధుల్లోకి తీసుకుని, ఆ తర్వాత కాంట్రాక్టు బేసిస్ లో కొనసా గిస్తామని చెబితేనే డ్యూటీకెక్కిన. మ్యాన్హోల్లో దిగి మురికినంతా ఎత్తిపోశా . అయినోళ్ల దగ్గర ఇజ్జత్ మొత్తం పోయిం ది. అలా చేసినా జాబ్ నుంచి తీసేశారు.
‑ కుమార్, సీవరేజీ కార్మికుడు
For More News..