తొలిరోజు 7 మండలాల నుంచే దాఖలు
రాజన్న సిరిసిల్ల, వెలుగు: సెస్ ఎన్నికలకు తొలిరోజు మంగళవారం 13 నామినేషన్లు దాఖలయ్యాయి. వివిధ పార్టీలకు చెందిన 12 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. సెస్ పరిధిలోని 13 మండలాలు, రెండు మున్సిపాలిటీలు ఉండగా 7 మండలాల నుంచి నామినేషన్లు వచ్చాయి.
ప్రత్యేక కౌంటర్లు పెట్టలే
సెస్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ వేసేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయలేదు. నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి మమత ఒక్కరే స్వీకరిస్తున్నారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో అభ్యర్థులు అసౌకర్యానికి గురువుతున్నారు. సెస్ కార్యాలయం లోపల ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు ఇవ్వడానికి ముగ్గురిని మాత్రమే అనుమతినిస్తున్నారు. ఒకరు నామినేషన్ల పత్రాలు దాఖలు చేసి వచ్చేంత వరకు మిగతా అభ్యర్థులు వేచి చూడాల్సి వస్తోంది.
పిటిషన్ కొట్టివేత
సెస్ పరిధిలోని 15 డైరెక్టర్ స్థానాలకు ఒక ఎస్సీ, రెండు జనరల్(ఉమెన్), 12 స్థానాలను జనరల్ కు కేటాయించింది. సెస్ రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా సరిగా లేదని బోయినపల్లి మండలం విలసాగర్కు చెందిన ఏనుగుల కనకయ్య 9న హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు పిటిషన్ను కొట్టేసింది. ఇప్పటికే కొంతమంది నామినేషన్లు దాఖలు చేయగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ల నుంచి అభ్యర్థులు నేడు నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు.
తొలిరోజు నామినేషన్లు ఇవే..
బీజేపీ నుంచి రేగులపాటి సుభాష్రావు(సిరిసిల్ల టౌన్ 2), బెంద్రం తిరుపతి రెడ్డి(ఇల్లంతకుంట), బీఆర్ఎస్ నుంచి మల్లుగారి రవీందర్ రెడ్డి(ఇల్లంతకుంట), కాంగ్రెస్ నుంచి జలగం ప్రవీణ్(తంగళ్లపల్లి), బీఎస్పీ నుంచి నీరటి బాల్ నర్స్(ఎల్లారెడ్డిపేట), పల్లెం సతయ్య(కోనరావుపేట), కట్కూరి ఆంజనేయులు(బోయినపల్లి), వైఎస్సార్టీపీ అభ్యర్థి చొక్కాల రాములు(వేములవాడ టౌన్ 2) నుంచి నామినేషన్లు వేశారు. నలుగురు ఇండిపెండెంట్లు నామినేషన్దాఖలు చేశారు. నలుగురు ఇండిపెండెంట్లు నలుగురు నామినేషన్లు దాఖలు వేశారు. ఇంకా 8 మండలాల నుంచి నామినేషన్లు దాఖలు కాలేదు.
ఆరు స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ఖరారు
బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మరో తొమ్మిది మంది అభ్యర్థులను బుధవారం ఖరారు చేయనున్నారు.